వృద్ధాప్యంతో 31 ఏళ్ల వయసులో "బాబీ" మృతి..!
ఇది రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన శునకం కాగా... వీటి సగటు ఆయుర్దాయం 10 నుంచి 14 ఏళ్లు. ఈ సందర్భంగా స్పందించిన కోస్టా... చనిపోయిన మా పూర్వీకులు ఎంతో, తనకు బాబీ కూడా అంతే అని చెబుతుండటం గమనార్హం!
By: Tupaki Desk | 25 Oct 2023 11:36 AM GMTఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం ఉన్న జీవి ఏది అంటే... శునకం (కుక్క) అని టక్కున సమాధానం చెబుతారు! ఇక అత్యల్ప విశ్వాసం ఉన్న జీవి ఏది అంటే... మనిషి కాకుండా ఇంకా ఏదైనా జీవి ఉందేమో నని గూగుల్ చేస్తుంటారు!! అందుకే చాలా మంది ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటూ.. తోటి మనుషులకంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. ఇలా పెంచుకున్న ఒక కుక్క 31 ఏళ్ల వయసులో మరణించింది. ఇది దానికి వృద్ధాప్యం!!
అవును... ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా పేరున్న "బాబి" 31 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచింది. పోర్చుగల్ లోని కాన్ క్వెయిరోస్ అనే ఊళ్లో 1992 మే 11న ఈ కుక్క పుట్టింది. అప్పటికి బాబి యజమాని లియోనల్ కోస్టా వయస్సు 8 ఏళ్లు మాత్రమే. అలా ఇద్దరూ కలిసి పెరిగారు! దీంతో బాబి మరణించిందనే విషయాన్ని కోస్టా జీర్ణించుకోలేకపోతున్నాడంట.
ఈ సందర్భంగా ఆ శునకం ఇంతకాలం జీవీంచడానికి గల కారణాలను లియోనల్ కోస్టా వివరించాడు. ఇందులో భాగంగా... మంచి ఆహారం, స్వచ్చమైన గాలి, అమితమైన ప్రేమ.. ఇవే బాబి ఇన్నేళ్లపాటు జీవించడానికి కారణాలని చెప్పారు. మరణించేనాటికి బాబి పూర్తి వయసు... 31 సంవత్సరాల 165 రోజులని తెలుస్తుంది.
ఇది రఫీరో డో అలెంటెజో జాతికి చెందిన శునకం కాగా... వీటి సగటు ఆయుర్దాయం 10 నుంచి 14 ఏళ్లు. ఈ సందర్భంగా స్పందించిన కోస్టా... చనిపోయిన మా పూర్వీకులు ఎంతో, తనకు బాబీ కూడా అంతే అని చెబుతుండటం గమనార్హం!
కాగా... ఈ ఏడాది మే నెలలో బాబీ బర్త్ డే అత్యంత ఘనంగా జరిగింది. అంతే కాదు అప్పటికే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ బర్త్ డే పార్టీకి 100 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని యజమాని లియోనెల్ కోస్టా చెప్పారు. ఈ కార్యక్రమంలో బర్త్ డే బాయ్ బాబీ తో కలిసి ఒక డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శన కూడా ఇచ్చింది.
ఇక ఈ బర్త్ డే పార్టీకి వచ్చిన అతిధులకు మాంసం, చేపల తో కూడిన వెరైటీ వంటకాలు వడ్డించారు. మనుషులు తినే ఆహారమే తినే బాబీ కూడా ఇదే ఆహారాన్ని ఆరగించింది. ఈ సందర్భంగా బాబీ తల్లి “గిరా” ని గుర్తుచేసుకున్న కోస్టా... అది 18ఏళ్లు బ్రతికినట్లు తెలిపాడు! ఈ క్రమంలో 31ఏళ్ల వయసులో ప్రపంచంలోనే వృద్ధ శునకం అయిన బాబీ కన్నుమూసింది! యజమానికి కన్నీరు మిగిల్చింది!!