దీపిక ముందు పెద్ద సవాల్!
By: Tupaki Desk | 20 March 2025 3:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గతేడాది ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురి కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన దీపికా ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇప్పుడు దీపికా తిరిగి మేకప్ వేసుకుని షూటింగుల్లో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కూతురు పుట్టాక తన లైఫ్ లో వచ్చిన మార్పుల గురించి, షూటింగ్ లో పాల్గొనడం గురించి దీపిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.
లైఫ్ లో తల్లి అవడమనేది గొప్ప మధురానుభూతి అని చెప్తోన్న దీపికా, ప్రస్తుతం తాను ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపింది. కూతురు పుట్టినప్పటి నుంచి బ్రేక్ లో ఉన్నానని, ఇప్పుడు మళ్లీ షూట్స్ కు రెడీ అవాలని, తన కూతురికి తల్లిగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే మిగిలినవన్నీ చేయాలని దీపికా చెప్పుకొచ్చింది.
ఈ విషయంలో ఎంతోమంది ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తుంటారని, ఎవరెన్ని చెప్పినా ఇంత చిన్న వయసులో కూతురిని వదిలి మన పనిలో మనం బిజీ అవడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని, దీన్ని ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నానని, ఎలాగైనా ఈ ఫేజ్ ను ఎదుర్కొంటాననే నమ్మకం తనకు ఉందని దీపిక అంటోంది. అయితే ఈ ఎఫెక్ట్ తన సినిమాలపై కూడా ఉంటుందని, తాను బిడ్డకు జన్మనివ్వక ముందు కూడా కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని, ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకుంటానని దీపిక తెలిపింది.
ఇక సినిమాల విషయానికొస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సింగం అగైన్ మూవీలో చివరిగా కనిపించిన దీపిక ఆ సినిమాలో చాలా పవర్‌ఫుల్ రోల్ లో కనిపించింది. దాంతో పాటూ కల్కి 2898ఏడీలో కూడా దీపికా పదుకొణె కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం కల్కి సీక్వెల్ కు సంబంధించిన వర్క్స్ జరుగుతుండగా, కల్కి2లో దీపిక పాత్ర చాలా కీలకం కానుంది.