సంతాన ప్రాప్తి కోసం ఆలయంలో కత్రిన పూజలు
పవిత్రమైన పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆలయ ధర్మకర్తలకు కత్రినా తన కృతజ్ఞతలు తెలిపింది.
By: Tupaki Desk | 12 March 2025 2:00 AM ISTసెలబ్రిటీల ఆలయాల సందర్శన ఎల్లవేళలా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యక్షమై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆశ్చర్యపరిచింది. తెలంగాణలో పలు దేవాలయాల్లో గ్లోబల్ ఐకన్ ప్రియాంక పూజలు ఆచరించింది. గత వారం, నటి కం పార్లమెంటు సభ్యురాలు కంగనా రనౌత్ ఉడిపి దక్షిణ కన్నడలోని కాపు మరియమ్మ ఆలయం, కటీలు శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయం సహా పలు దేవాలయాలను సందర్శించారు.
గత నెలలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా కత్రినా కైఫ్ త్రివేణి సంగమంలో తన అత్తగారు వీణా కౌశల్‌తో కలిసి పవిత్ర స్నానం చేసింది. స్టార్ హీరోయిన్ పవిత్ర ఆచారాలలో తరించింది. పరమార్థ నికేతన్ ఆశ్రమం అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతితో దైవాచారాల గురించి ముచ్చట్లాడుతూ కనిపించింది. కత్రినా కైఫ్ మంగళవారం నాడు కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రసిద్ధ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని కూడా సందర్శించారు. పవిత్ర సర్ప సంస్కార కర్మలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయంలో పూజలు నిర్వహించేప్పుడు కత్రినా ముసుగు ధరించి, దుప్పట్టతో తల కప్పుకుని కనిపించింది.
కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాసస్థ్యం ఎంతో గొప్పది. 5,000 సంవత్సరాల నాటి పురాతన ఆలయమిది. ఇక్కడ భక్తులు నాగ దోషాన్ని (సర్ప సంబంధిత బాధలు) తొలగించడానికి ఆచారాలు నిర్వహిస్తారు. వివాహం, ప్రసవంలో అడ్డంకులు వంటి వాటికి పరిహారం లభిస్తుంది. కర్ణాటకలో పలు ఆలయాలను సందర్శించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు.
కత్రిన కైఫ్- విక్కీ కౌశల్ జంట ప్రేమ వివాహం గురించి తెలిసిందే. విక్కీ, కత్రిన ఇద్దరూ బాలీవుడ్ లో కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ జంట క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో బిజీ. కొంత విలువైన సమయం కేటాయించి ఇప్పుడు కత్రిన ఆలయాలను సందర్శిస్తోంది. సంతాన ప్రాప్తి కోసమే కుక్కే సుబ్రమణ్య స్వామిని సందర్శించిందని అభిమానులు భావిస్తున్నారు.
పవిత్రమైన పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆలయ ధర్మకర్తలకు కత్రినా తన కృతజ్ఞతలు తెలిపింది. ఈసారి నేను ఇక్కడికి రాగలిగినందుకు చాలా అదృష్టవంతురాలిని. నిజంగా సంతోషంగా కృతజ్ఞతతో ఉన్నాను. నేను స్వామి చిదానంద సరస్వతిని కలిశాను. వారి ఆశీర్వాదాలు తీసుకున్నాను.. అని అన్నారు. కత్రినా కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించడం అభిమానులలో , భక్తులలో ఉత్సుకతను రేకెత్తించింది. ఆమె ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దక్షిణ కన్నడలోని ఇతర ప్రసిద్ధ దేవాలయాలను కత్రిన సందర్శిస్తుందో లేదో అనేదానిపై ఇప్పటికి అస్పష్టంగా ఉంది. జూలై 2024లో కత్రినా మంగళూరులోని కోరగజ్జ ఆలయాన్ని సందర్శించింది. కత్రినతో పాటు క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తదితరులు ఉన్నారు. ఏడాది కాలంగా కత్రినలో చాలా మార్పు కనిపిస్తోంది. వరుసగా దేవాలయాల సందర్శనలలో నిమగ్నమై ఉంది.