బాలీవుడ్ చిత్రాల్లో హిందూ వ్యతిరేకతకు కారణం?
బాలీవుడ్ లో అంతకంతకు హిందూ వ్యతిరేకత పెరుగుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 5 Sep 2024 12:30 AM GMTబాలీవుడ్ లో అంతకంతకు హిందూ వ్యతిరేకత పెరుగుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత ప్రమాదకర తీవ్రవాదుల్లో హిందువులు ఉన్నారంటూ పెద్ద తెరపై చూపించే ప్రయత్నం జరుగుతోందని హిందూవాదులు విమర్శిస్తున్నారు. ఇటీవలే విడుదలైన `ఐసీ 814- ది కాందహార్ హైజాక్` సినిమాలో కూడా హిందువులను తీవ్రవాదులుగా చూపించడంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. నిజ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో వాస్తవంగా ముస్లిం ముష్కరులు భారత విమానాన్ని హైజాక్ చేసారన్నది ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ అందులో ఓ ముగ్గురు హిందువులు ఉన్నారంటూ చూపించడం పెనుదుమారం రేపింది. దీనిపై తీవ్ర దుమారం చెలరేగుతుండగా, ఇప్పుడు ఆ మూడు పేర్లను తిరిగి ముస్లిమ్ పేర్లకు మార్చారని కూడా కథనాలొస్తున్నాయి. ఐసీ 814 ఓటీటీ సినిమాగా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది.
అయితే ఈ సినిమా కారణంగా బాలీవుడ్ సినిమాల్లో హిందూ ఫోబియో గురించి మరోసారి సర్వత్రా చర్చ వేడెక్కిస్తోంది. ఈ చర్చలో భాగంగా ముగ్గురు ఖాన్‌లు వారి అనుబంధ సమూహాల కారణంగా బాలీవుడ్ హిందూ వ్యతిరేకిగా మారుతోందని `క్వారా`లో కొందరు రచయితల బృందం చర్చకు తెర లేపారు. వారు హిందూ వ్యతిరేకులు అని రచయిత విమర్శించాడు. ఉదాహరణలుగా చూపిస్తూ అమీర్ ఖాన్ PK, దంగల్‌లో హిందూ ఆచారాలను బహిరంగంగా అపహాస్యం చేసారు. దంగల్‌లో స్ఫూర్తి నింపే సీన్లలో వేరే ఫోటోలు ఉన్నాయి కానీ హిందూ దేవుడి ఫోటో లేనేలేదు. మల్లయోధులకు హనుమంతుడే మొదటి గురువు. కనీసం ఒక్క ఫ్రేమ్‌లో అయినా అమీర్ చూపించాడా..? అంటూ విమర్శించాడు. ముస్లిమ్ దేశాలకు అనుకూలంగా హిందూ వ్యతిరేక సినిమాలు తీస్తున్నారని కూడా విమర్శించారు. భారతదేశంలో సరైన భద్రతాభావం లేదని వ్యాఖ్యానించిన ఖాన్ ల గురించి ప్రస్థావించాడు.
పద్మావత్ - శాక్ర్ డ్ గేమ్స్ లోను హిందువులను కించపరిచారనే వాదన కూడా అంతే బలంగా ఉంది. పద్మావత్ చిత్రంలో ముస్లిమ్ రాజును హైలైట్ చేస్తూ రాజ్ పుత్ రాజులను కించపరిచారనే వాదన తెరపైకి తెచ్చారు. శాక్ర్ డ్ గేమ్స్ లోను భగవద్గీతకు అవమానం ఎదురైందని, కించపరిచారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఐసీ 814 మూవీ పై విమర్శలు చెలరేగడంతో దేశ ప్రజల సెంటిమెంట్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తామంటూ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చింది. కానీ బాలీవుడ్ చిత్రాలలో హిందువులను విలన్‌లుగా లేదా తీవ్రవాదులుగా చిత్రీకరించడం ప్రమాదకర స్థాయికి పెరిగిందనే ఆందోళనలు కొనసాగుతున్నాయి.