బాలీవుడ్ బాక్సాఫీస్: ఇవి బిగ్గెస్ట్ ఫైట్స్!
గతంలో బాలీవుడ్‌లో జరిగిన కొన్ని ప్రధాన బాక్సాఫీస్ సమరాల్లో ఎవరు గెలిచారు? ఏ కారణాలు విజయానికి దారితీశాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By: Tupaki Desk | 12 March 2025 5:00 AM ISTబాలీవుడ్‌లో పెద్ద సినిమాల మధ్య క్లాష్ అనేది చాలా కామన్. కానీ కొన్ని సందర్భాల్లో ఇది వేరే లెవెల్‌కు వెళ్లిపోతుంది. హై ప్రొఫైల్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఒకేసారి విడుదలవుతుంటే ప్రేక్షకుల దృష్టంతా ఆ క్లాష్‌పైనే ఉంటుంది. గతంలో బాలీవుడ్‌లో జరిగిన కొన్ని ప్రధాన బాక్సాఫీస్ సమరాల్లో ఎవరు గెలిచారు? ఏ కారణాలు విజయానికి దారితీశాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
డాన్ Vs జానేమన్ (2006)
షారుఖ్ ఖాన్ 'డాన్' రీమేక్‌గా వచ్చినప్పటికీ, దాన్ని అద్భుతమైన మోడరన్ మేకోవర్‌లో తీర్చిదిద్దారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ స్టైలిష్ ప్రెజెంటేషన్, మాస్ ఎలిమెంట్స్, షారుఖ్ పెర్ఫార్మెన్స్‌తో విజయాన్ని సాధించింది. మరోవైపు, సల్మాన్ ఖాన్ 'జానేమన్' కొత్తదనం ఉన్న కథతో వచ్చినా, బాక్సాఫీస్ వద్ద అంత పెద్ద ప్రభావం చూపలేకపోయింది. షారుఖ్ స్టార్ పవర్ కారణంగా 'డాన్' స్పష్టంగా గెలిచిన మూవీగా నిలిచింది.
ఓం శాంతి ఓం Vs సావరియా (2007)
ఈ క్లాష్ చాలా ఆసక్తికరమైనది. ఒకవైపు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె లాంటి క్రేజీ కాంబినేషన్‌తో 'ఓం శాంతి ఓం' విడుదలైంది. మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించిన 'సావరియా' వచ్చింది. కానీ, భారీ విజువల్ ట్రీట్ ఉన్నప్పటికీ 'సావరియా' కథాపరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 'ఓం శాంతి ఓం'లో మాస్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, హై ఎమోషన్స్ అన్నీ కలిపి ఉండటంతో ఇది బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది.
జబ్ తక్ హై జాన్ Vs సన్ ఆఫ్ సర్దార్ (2012)
యశ్ చోప్రా చివరి చిత్రంగా 'జబ్ తక్ హై జాన్' భారీ అంచనాలతో విడుదలైంది. మరోవైపు అజయ్ దేవగణ్ 'సన్ ఆఫ్ సర్దార్' పూర్తిగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన సినిమా. కానీ షారుఖ్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ లాంటి భారీ స్టార్ కాస్ట్, సూపర్ ఎమోషనల్ కథాంశంతో 'జబ్ తక్ హై జాన్' బలంగా నిలిచింది. 'సన్ ఆఫ్ సర్దార్' బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని సాధించినా, ఈ క్లాష్‌లో విజయం 'జబ్ తక్ హై జాన్'దే.
దిల్‌వాలే Vs బాజీరావు మస్తాని (2015)
ఇది బాలీవుడ్‌లోనే హై ప్రొఫైల్ క్లాష్‌గా నిలిచింది. షారుఖ్ ఖాన్ - కాజోల్ రియూనియన్‌తో వచ్చిన 'దిల్‌వాలే' మామూలు సినిమా కాదు. కానీ అదే సమయంలో సంజయ్ లీలా భన్సాలీ భారీ విజువల్ వండర్‌గా తీసిన 'బాజీరావు మస్తాని' విడుదలైంది. తొలుత 'దిల్‌వాలే' ఓపెనింగ్స్ బాగానే దక్కించుకున్నా, కంటెంట్ పరంగా బలమైన 'బాజీరావు మస్తాని' మెల్లగా టేక్ ఓవర్ చేసి బాక్సాఫీస్ విజేతగా నిలిచింది.
రయీస్ Vs కాబిల్ (2017)
ఇక్కడ కూడా రెండు భారీ సినిమాలు పోటీపడ్డాయి. షారుఖ్ ఖాన్ 'రయీస్'లో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ రోల్ ప్లే చేయగా, హృతిక్ రోషన్ 'కాబిల్'లో భావోద్వేగభరితమైన పాత్ర చేశాడు. మొదట్లో 'రయీస్' బాక్సాఫీస్‌ను శాసించినా, 'కాబిల్' కూడా మౌత్ టాక్ ద్వారా నిలబడ్డది. అయినప్పటికీ, కమర్షియల్ గా 'రయీస్'దే విజయమని చెప్పాలి.
సలార్ Vs డుంకీ (2023)
ఇటీవల జరిగిన క్లాష్‌లలో హై వోల్టేజ్ ఎంటర్టైనర్ 'సలార్' vs ఎమోషనల్ డ్రామా 'డుంకీ' పోటీ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్‌తో వచ్చిన 'సలార్' మాస్ ఆడియన్స్‌ను మెప్పించగా, రాజ్‌కుమార్ హిరానీ, షారూఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన 'డుంకీ' ఎక్కువగా ఎమోషనల్ కనెక్ట్ కలిగింది. అయితే, బాలీవుడ్ మార్కెట్‌లో మాత్రం 'డుంకీ' పోటీగా నిలిచింది. బాక్సాఫీస్ వసూళ్లను బట్టి చూస్తే, ఈ క్లాష్‌లో గెలుపు 'సలార్'దే అని చెప్పొచ్చు.