భారీ చిత్రాల దర్శకుడి తర్వాత మెగా డైరెక్టర్ బరిలోకి!
ఇటీవలే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నెట్‌ఫ్లిక్స్ కోసం `హీరామండి`కి దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 22 Sep 2024 9:30 PM GMTఇటీవలే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నెట్‌ఫ్లిక్స్ కోసం `హీరామండి`కి దర్శకత్వం వహించారు. ఇది అత్యంత విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. వేశ్యా గృహాల నేపథ్యంలో నిజ కథను తెరకెక్కించారు. హీరామండి సీజన్ 2 కోసం సన్నాహకాల్లో ఉన్నారు. ఇంతలోనే ఇప్పుడు మరో బాలీవుడ్ పెద్ద దర్శక నిర్మాత నెట్ ఫ్లిక్స్ కోసం భారీ వెబ్ సిరీస్ ని తెరకెక్కించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేత, దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. షూటింగ్ 2025 ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ప్రాజెక్ట్ 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతుంది.
కరణ్ మొదటిసారి ఒక వెబ్ సిరీస్ కోసం దర్శకత్వం వహిస్తుండగా, అతడు ఎంచుకునే కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది? అంటూ చర్చ సాగుతోంది. కెరీర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలను అందంగా మలిచిన ఘనత కరణ్ కి ఉంది. ప్రేమకథల్లో ట్రెండ్ సెట్టర్ స్టోరీస్ అతడికి వెన్నతో పెట్టిన విద్య. కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కభీ అల్విదా నా కెహనా, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏ దిల్ హై ముష్కిల్ , రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన హిట్ చిత్రాలు.
వీటన్నిటి కంటే భిన్నంగా ఇప్పుడు వెబ్ సిరీస్ కథాంశాన్ని ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ఇది స్త్రీ ఆధారిత సిరీస్. మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశంతో రూపొందుతుంది. కరణ్ జోహార్ గత కొన్నేళ్లుగా స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ ని వెచ్చించనుందని కూడా తెలుస్తోంది.