లెజెండ్ శ్యామ్ బెనగల్ హైదరాబాద్ కనెక్షన్?
ముఖ్యంగా శ్యామ్ బెనగల్ హైదరాబాద్ కనెక్షన్ గురించి చాలా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 24 Dec 2024 6:22 AM GMTప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారన్న వార్తలు హైదరాబాద్ మీడియాలోను హెడ్ లైన్స్ గా మారిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ముంబైలోని వోకార్డ్ హాస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందిన ఆయన వయసు 90 ఏళ్లు. ముఖ్యంగా శ్యామ్ బెనగల్ హైదరాబాద్ కనెక్షన్ గురించి చాలా చర్చ సాగుతోంది.
దిగ్ధర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జన్మస్థలం హైదరాబాద్ అని తెలిపారు. ఇక్కడే పుట్టి పెరిగానని, చదువుకున్నానని తెలిపిన ఆయన దేశంలో ఎక్కడా లేని మిశ్రమ సంస్కృతి నగరంలో ఉందని ప్రశంసించారు. చిన్నప్పుడు సికిందరాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ లో వేసిన సినిమాలను వీక్షించేందుకు తాను కూడా వెళ్లానని శ్యామ్ బెగనల్ గుర్తు చేసుకున్నారు. నాకు తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడటానికి కష్టపడతానని తెలిపారు.
శ్యామ్ బెనెగల్ భారతీయ సమాంతర సినిమాని పునర్నిర్వచించిన మేధావి. 1970లు, 1980లలో న్యూ వేవ్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. తన రియలిస్టిక్ ఫిలింమేకింగ్ ఆలోచింపజేసే సామాజిక కథనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన రచనలు, దర్శకత్వం వహించిన సినిమాలు ప్రజలను గొప్పగా అలరించాయి. మమ్మో, సర్దారీ బేగం, భూమిక, మండి, మంథన్, సూరజ్ కా సాత్వాన్ ఘోడా సహా ఎన్నో పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను శ్యామ్ బెనగల్ రూపొందించారు. `ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్` శ్యామ్ బెనగల్ చివరి చిత్రం. ఇది 2023లో విడుదలైంది.
దిగ్గజ దర్శకుడు 90వ పుట్టినరోజు సందర్భంగా తాను మరో రెండు మూడు ప్రాజెక్ట్‌లకు పని చేస్తున్నానని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన తదుపరి చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. కానీ అది వీలుపడలేదు. శ్యామ్ బెనెగల్ కెరీర్ జర్నీలో అసాధారణంగా 18 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. అతడు 1991లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్నారు. 2005లో సినీ ప్రపంచంలో దేశ అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కేను అందుకున్నారు.