స్టార్ కిడ్స్ ఎందుకిలా తేలిపోతున్నారు?
ఇప్పుడు మరో పెద్ద స్టార్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సినిమా 'నాదానియాన్' పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదని అర్థమవుతోంది.
By: Tupaki Desk | 21 Feb 2025 9:30 PM GMTఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్- శ్రీదేవి కుమార్తె ఖుషి కపూర్ జంటగా నటించిన 'లవ్ యాపా' విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. పెద్ద స్టార్ల నటవారసులు నటించినా ఈ సినిమాకి ఆశించిన బజ్ రాలేదు. రిలీజ్ ముందు లవ్ యాపాకు కనీస హైప్ రాలేదు. చివరికి బాక్సాఫీస్ వద్ద ఫలితం నిరాశపరిచింది.
ఇప్పుడు మరో పెద్ద స్టార్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సినిమా 'నాదానియాన్' పరిస్థితి ఇందుకు విరుద్ధంగా లేదని అర్థమవుతోంది. ఇబ్రహీం సరసన 'లవ్ యాపా' బ్యూటీ ఖుషీ కపూర్ కథానాయికగా నటించింది. ఇప్పుడు ఖుషీకి వరుసగా మరో ఫ్లాప్ రెడీగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ''నదానియన్' సినిమా గురించి పెద్దగా ప్రచారం కూడా చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
ప్రచారం లేకుండా ఏ సినిమా ప్రజలకు చేరువ కాదు. అలాగే పాటలు టీజర్ వంటి వాటికి ఆశించిన బజ్ రాలేదు. దీంతో ఈ సినిమా విజయంపై నమ్మకం లేదని పెదవి విరిచేస్తున్నారు. నిజానికి సౌత్ లోని అగ్ర హీరోల వారసుల సినిమాలకు ఉండే సహజసిద్ధమైన క్యూరియాసిటీ హిందీ స్టార్ల పిల్లలకు ఉండటం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ల నటవారసులకు కనీస ఆరంభ వసూళ్లకు కూడా హామీ లేదు. మంచి టాక్ వచ్చినా కానీ, జనం థియేటర్లకు వస్తారా? అన్న గ్యారెంటీ కూడా కనిపించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. 'ది ఆర్చీస్'తో తెరకు పరిచయమైన స్టార్ కిడ్స్ విషయంలోను జీరో బజ్ నిజంగా ఆశ్చర్యపరిచింది.
అమీర్ ఖాన్, సైఫ్ ఖాన్ దశాబ్ధాలుగా బాలీవుడ్ ని ఏల్తున్న హీరోలు. స్వయంకృషి, హార్డ్ వర్క్ తో శాసించే స్థాయికి ఎదిగారు. భారీ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించారు. కానీ వారి పిల్లలు లెగసీని ముందుకు తీసుకెళ్లగలరా? అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. అయితే సైఫ్ ఖాన్ కుమారుడు నటిస్తున్న మొదటి సినిమాతోనే అతడు స్టార్ అవుతాడా లేదా? అన్నది నిర్ణయించలేం. అతడు తన తదుపరి చిత్రం సర్జమీన్ తోను లక్ చెక్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో కాజోల్ వంటి పెద్ద స్టార్ అండదండలు అతడికి ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.