70 కోట్ల నుంచి 30కోట్లకు దిగిపోయిన స్టార్ హీరో
ఉత్తరాదితో పాటు దక్షిణాదినా హవా చాటడం ద్వారా పాన్ ఇండియా స్టార్ గా అవతరించాలని రణబీర్ కపూర్ కలలు కంటున్నాడు.
By: Tupaki Desk | 1 Oct 2023 8:59 AM GMTఉత్తరాదితో పాటు దక్షిణాదినా హవా చాటడం ద్వారా పాన్ ఇండియా స్టార్ గా అవతరించాలని రణబీర్ కపూర్ కలలు కంటున్నాడు. బ్రహ్మాస్త్రతో అది సాధ్యపడలేదు. ఈ చిత్రం ఉత్తరాదిన ఎంత పెద్ద హిట్టయినా దక్షిణాది నుంచి ఆశించిన స్థాయి వసూళ్లను సాధించలేదు. అందుకే ఇప్పుడు ఒక దక్షిణాది దర్శకుడితో తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు యానిమల్ తో ఆశించిన పాన్ ఇండియా స్టార్ డమ్ అతడి చేతికి చిక్కుతుందా? అంటే కాస్త ఆగాలి.
రణబీర్ కపూర్ నటించిన `యానిమల్` ఇంటెన్స్ టీజర్ ఇంటర్నెట్‌లో భారీ సంచలనం సృష్టించింది. అర్జున్ రెడ్డి- కబీర్ సింగ్ ప్రకంపనాలు మరోసారి ఖాయమేనని అంతా ఊహిస్తున్నారు. యానిమల్ టీజర్ విడుదలైన రెండు రోజుల తర్వాత కూడా యూట్యూబ్‌లో నంబర్ వన్ గా ట్రెండింగ్‌లో ఉంది. యానిమల్‌లో రణబీర్ కపూర్ మునుపెన్నడూ చూడని గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపిస్తాడు. నిస్సందేహంగా టీజర్ అంచనాలను అమాంతం ఆకాశాన్ని తాకేలా చేసింది. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే రణబీర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని వ్యాఖ్యానిస్తున్నారు.
రణబీర్ ప్రస్తుతం ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నాడు. కానీ ఇది రికార్డుల వరకూ చేరుస్తుందా? అన్నది వేచి చూడాలి. డిసెంబర్ 1న విడుదల కానున్న `యానిమల్` ఆశించిన రిజల్ట్ ని ఇస్తుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార ఎత్తుగడ విషయంలో దర్శకుడు సందీప్ వంగా ఎంతో జాగ్రత్త పడుతున్నాడని తెలిసింది. టీజర్ తో వచ్చిన హైప్ ని ట్రైలర్ తో మరో లెవల్ కి తీసుకెళ్లాలని అతడు తపన పడుతున్నాడట.
ఇంతలోనే యానిమల్ నటుడు రణబీర్ గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. నిజానికి సినిమా నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడానికి రణబీర్ ముందే పారితోషికాన్ని ఆశించలేదని తెలిసింది. తన పారితోషికంలో మెజారిటీ వాటాను తగ్గించుకున్నాడని తెలిసింది. పాపులర్ జాతీయ మీడియా కథనం ప్రకారం..రణబీర్ మార్కెట్ విలువ ఒక్కో సినిమాకు దాదాపు రూ.70 కోట్లు. కానీ యానిమల్ నిర్మాణ విలువను పెంచేందుకు టీసిరీస్ కి సందీప్ వంగాకు మద్దతుగా అతడు తన పారితోషికంలో 50 శాతానికి కట్ పెట్టి, 30-35 కోట్ల వరకూ మాత్రమే ముందస్తు రుసుము తీసుకుంటున్నట్లు సమాచారం. మిగిలిన మొత్తం గ్యాంగ్‌స్టర్-డ్రామా నిర్మాణ విలువను మెరుగుపరచడానికి ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పనిచేస్తే వచ్చే లాభాల్లో రణబీర్ కి వాటా ఇచ్చేందుకు టీసిరీస్ డీల్ కుదుర్చుకుందట. అంటే విజయాన్ని బట్టి రణబీర్ కి ఆదాయం వస్తుందన్నమాట. లేదంటే 30కోట్ల పారితోషికంతో సరిపుచ్చుకుంటాడు. ఇక ఇదే మోడల్ లో షారూఖ్ సహా చాలా మంది అగ్రహీరోలు పరిమిత పారితోషికాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
కబీర్ సింగ్ తర్వాత సందీప్ వంగా చేసిన రెండవ బాలీవుడ్ చిత్రం యానిమల్. నిజానికి ఈ సినిమాని 2023 ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. సన్నీ డియోల్ గదర్ 2, అక్షయ్ కుమార్ OMG 2, రజనీకాంత్ జైలర్ చిత్రాలతో ఘర్షణకు సిద్ధమైంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడంతో దర్శకనిర్మాతలు ఆలోచించుకుని సినిమా విడుదల తేదీని మార్చేశారు. నాణ్యతకోసమే ఈ మార్పు అని సందీప్ వంగా ప్రకటించారు. ``యానిమల్ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. ఏడు పాటలు ఐదు భాషల్లోకి గుణిస్తే మొత్తం 35 పాటలు. 35 పాటల కోసం విభిన్న గీత రచయితలు, విభిన్న గాయకులు, ఇతర టెక్నికల్ టీమ్ తో పని చేయాల్సి ఉంటుంది. నేను అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది``అని తెలిపారు. యానిమల్‌లో రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. `తూ ఝూతీ మైన్ మక్కార్` తర్వాత రణబీర్ కి ఇదే ఏడాదిలో ఇది రెండవ విడుదల కానుంది. యానమిల్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాలన్నది అతడి అతిపెద్ద కల.