ఈ ప్రకటనతో రాజమౌళికి చెక్ పెట్టాడా?
మహాభారతం- రామాయణం లాంటి పురాణేతిహాస కథల్ని ఎన్నిసార్లు అయినా సినిమాలుగా తీయొచ్చు.
By: Tupaki Desk | 22 Oct 2023 5:10 AM GMTమహాభారతం- రామాయణం లాంటి పురాణేతిహాస కథల్ని ఎన్నిసార్లు అయినా సినిమాలుగా తీయొచ్చు. తెలుగు సినిమా క్లాసిక్ డేస్ లో ఈ ప్రఖ్యాత పురాణేతిహాసాలపై అనేక సినిమాలు తెరకెక్కించారు. వాటి నుంచి పాక్షికంగా కొన్ని కథల్ని ఎంచుకుని వాటిని విజయవంతంగా తెరకెక్కించిన వారు ఉన్నారు. అదంతా అటుంచితే మహాభారతం సినిమాలను ఫ్రాంఛైజీగా మలచాలని ఆరాటపడినవారిలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రథముడు. ఐదు సినిమాలుగా భారతాన్ని తెరకెక్కించేందుకు దాదాపు 1000 కోట్లు పైగా వెచ్చించాలని అతడు భావించాడు. కానీ అమీర్ ఖాన్ ప్రయత్నాలు రకరకాల కారణాలతో సఫలం కాలేదు. అతడు కొన్ని హెచ్చరికల్ని కూడా ఎదుర్కొన్నాడు. దీంతో మధ్యలోనే డ్రాప్ అయ్యాడు.
ఆ తర్వాత అతడిని మించి బలమైన ఆకాంక్షను వెలిబుచ్చాడు రాజమౌళి. మహాభారతం సినిమాని భారీ తారాగణం అధునాతన సాంకేతికతను ఉపయోగించి లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో రక్తి కట్టించాలని కలలుగంటున్నాడు. బాహుబలి తర్వాత అతడి నుంచి ప్రకటన వెలువడింది. కానీ ఇప్పటివరకూ దీనికి సంబంధించిన తొలి అడుగుపడకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహాభారతంతో మరోసారి రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోవడం ఖాయమని అంతా భావించినా కానీ ఆయన ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం నిరాశపరిచింది. ఇంతలోనే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇది భారీ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని చెబుతున్నారు. ఈ సినిమాని పూర్తి చేసిన అనంతరం రాజమౌళి మహాభారతం సినిమాని తెరకెక్కించేందుకు ఛాన్సుంటుందని కథనాలొచ్చాయి.
అయితే ఇప్పుడు రాజమౌళి కంటే ముందే మహాభారతంను మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని ప్రకటించి బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బిగ్ షాకిచ్చారు. కాశ్మీర్ ఫైల్స్- వ్యాక్సిన్ వార్ తర్వాత అతడి దృష్టి ఇప్పుడు మహాభారత కథలపైకి మళ్లింది. పైగా మూడు భాగాలుగా సినిమాని తెరకెక్కించేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. అయితే అగ్నిహోత్రి ప్రకటనతో రాజమౌళి ఖంగు తిన్నారా? అంటూ ఒక సెక్షన్ లో డిష్కసన్ మొదలైంది. కానీ అగ్నిహోత్రి తీసాడని రాజమౌళి మానుకోవాల్సిన అవసరం ఏం లేదు. నిజానికి ఎంతమంది ఎన్నిసార్లు తెరకెక్కించినా ఇంకా ఏదో ఒక కొత్తదనం చూపించేందుకు అవకాశం ఉన్న కథలు మహాభారతం, రామాయణం. అందుకే వీటిపై ఎప్పటికప్పుడు దర్శకనిర్మాతలు నిత్యనూతనంగా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
పైగా అగ్నిహోత్రి మేకింగ్ స్టైల్ తో రాజమౌళి మేకింగ్ స్టైల్ ని పోల్చలేం. అగ్ని హోత్రి షటిల్డ్ గా కథను చెప్పగలడేమో కానీ, భారీ బడ్జెట్లతో అతడు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్ని సృజించగలడా? అతడి సినిమాల కోసం వందల కోట్లు వెచ్చించేందుకు ఎవరు ముందుకు వస్తారు? అన్నది ప్రశ్న. ఇక రాజమౌళి పనితనం గురించి ప్రపంచానికి ఇప్పటికే తెలుసు. అతడు లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్ని క్రియేట్ చేసి, అవసరం అయిన వీఎఫ్ఎక్స్ ఇతర సాంకేతికతతో మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు. అతడు ఎంసియు తరహా సూపర్ హీరో సినిమాల్ని తీయగలడు. అందుకే రాజమౌళి నుంచి ఏదైనా సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఒకటే క్యూరియాసిటీ నెలకొంటుంది.
దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అతని భార్య పల్లవి జోషి నిర్మాతలుగా మూడు భాగాల మహాభారతం `పర్వ` పేరుతో తెరకెక్కనుంది. ఈ సినిమా పోస్టర్‌ను ఇంతకుముందే ఆవిష్కరించారు. ఈ హఠాత్ ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్కంఠ రేపుతోంది. రాజమౌళి కంటే ముందే అతడు ఈ ప్రకటన చేయడం అందరికీ బిగ్ షాకింగ్ గా మారింది.