ఇండియన్ సినిమా హాలీవుడ్ లో రీమేక్!
హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లోనో..ఇతర భాషల్లోనూ రీమేక్ అవ్వడం సహజం.
By: Tupaki Desk | 3 July 2024 11:30 AM GMTహాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లోనో..ఇతర భాషల్లోనూ రీమేక్ అవ్వడం సహజం. కంటెంట్ భారతీయులకు కనెక్ట్ అవుతుందంటే రీమేక్ చేసే ధైర్యం చేస్తుంటారు. కానీ ఇండియన్ సినిమాలు హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం అన్నది పెద్దగా జరగదు. ఎందుకంటే సినిమాలు తీసే దర్శకులంతా హాలీవుడ్ మేకింగ్ నే కాపీ కొట్టి తీస్తారు? అనే విమర్శ చాలా కాలంగా ఉంది. ఇప్పటికీ అది ఉంది. కాబట్టి ఇక్కడ సినిమాలు హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం జరగదని అనుకుంటాం.
కానీ ఓ బాలీవుడ్ చిత్రం ఇప్పుడు హాలీవుడ్ లో రీమేక్ అవ్వడం విశేషం. దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో నికిల్ నగేష్ భట్ `కిల్` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో లక్ష్య హీరోగా నటించాడు. ఈ సినిమా ఇంకా థియేటర్ కూడా రిలీజ్ కాలేదు. కానీ టోరెంటో, ట్రిబెకాతో సహా పలు చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈనేపథ్యంలో హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి 87 లెవన్ ఎంటర్ టైన్ మెంట్స్- లయన్స్ గేట్ నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి.
`జాన్ విక్` ప్రాంచైజీలతో ఈ నిర్మాణ సంస్థలకు హాలీవుడ్ లో మంచి పేరుంది. తాజాగా కిల్ సినిమా నచ్చడంతో భారీ బడ్జెట్ తో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆర్మీ కమాండ్ అయిన అమ్రిత్ తన ప్రియురాలిని కాపాడేందుకు ప్రత్యర్ధులతో రైలు లో చేసిన యాక్షన్ కథనంతో ఈ సినిమా రూపొం దించారు. భారతీయ తెరపై మునుపెన్నడు చూడని యాక్షన్ సన్నివేశాలు ఈసినిమాలో ఉన్నాయని దర్శకుడు ధీమా వ్యక్తం చేసాడు.
ఇండియాలో రిలీజ్ కాకుండానే హాలీవుడ్ లో రీమేక్ కావడం అన్నది ఇంతవరకూ ఏ సినిమాకి జరగలేదని, ఆ రకంగా తమ సినిమా రికార్డు సృష్టించిదన్నారు. ఈ శుక్రవారమే సినిమా ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఫలితం హాలీవుడ్ లో కీలకంగా మారుతుందా? లేక రిజల్ట్ తో పనిలేకుండా హాలీవుడ్ ముందుకెళ్లుందా? అన్నది చూడాలి.