బాలీవుడ్ కండల వీరుడికి మళ్లీ బెదిరింపులు... ముంబై పోలీస్ స్టెప్ ఇదే
ఈ క్రమంలో తాజాగా మరోసారి జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపు వచ్చింది.
By: Tupaki Desk | 29 Nov 2023 5:05 AM GMTగతకొంతకాలంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ వేదికగా బాలీవుడ్ కండల వీరుడికి గ్యాంగ్ స్టర్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి! ఈ క్రమంలో తాజాగా మరోసారి జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపు వచ్చింది. అతని ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఈ బెదిరింపులు రావడంతో ముంబై పోలీస్ అలర్ట్ అయ్యారు.
అవును... సల్మాన్ ఖాన్ కు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి మరోసారి బెదిరింపు వచ్చింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫేస్ బుక్ ఖాతా ద్వారా సల్మాన్ కు బెదిరింపు రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్ భద్రతను సమీక్షించారు.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసిన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జైలులో ఉన్నాడు. ఇటీవల వాంకోవర్ నివాసంపై జరిగిన దాడికి సంబంధించి పంజాబీ గాయకుడు గిప్పీ గ్రేవాల్ ను ఉద్దేశించి ఫేస్ బుక్ పోస్ట్ సల్మాన్ ఖాన్ కు కూడా హెచ్చరిక చేసింది.
ఇందులో "మీరు కోరుకున్న ఏ దేశానికైనా పారిపోండి.. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి.. మరణానికి ఎటువంటి వీసా అవసరం లేదు" అని గ్యాంగ్ స్టర్ లారెన్స్ హెచ్చరించాడు. ఈ సమయంలో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... వెంటనే సల్మాన్ ఖాన్ భద్రతా ఏర్పాట్లను పునఃపరిశీలించారు.
కాగా... ఈ ఏడాది మార్చిలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతని భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ కు గతంలోనూ హత్య బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో యూకేలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఇండియన్ స్టూడెంట్ మెయిల్ నుంచి ఈ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కచ్చితంగా చంపేస్తామని కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డ్ బ్రార్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ లో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పునరుద్ఘాటించాడు.
ఈ సందర్భంగా... గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూను ప్రస్తావించిన గోల్డీ బ్రార్... సల్మాన్ ఖాన్ ను చంపడమే తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నాడు. ఈ లక్ష్యాలు కేవలం సల్మాన్ ని చంపడంతో ఆగవని.. బ్రతికి ఉన్నంత కాలం శత్రువులందరిపైనా హత్యా ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మాత్రం సల్మాన్ ఖాన్ ఫస్ట్ టార్గెట్, అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు.