టాలీవుడ్ లో బాలీవుడ్ క్రేజ్ ఇంట్రెస్టింగ్!
ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ఆఫర్ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 20 May 2024 5:30 PM GMTటాలీవుడ్ లో బాలీవుడ్ విలన్లు కొత్తేం కాదు. కాకపోతే అప్పటి విలన్లు అంతా హిందీ లో కేవలం విలన్ పాత్రలకు పరిమితమైన వారినే దిగుమతి చేసేవారు. కానీ నేడు ట్రెండ్ మారింది. టాలీవుడ్ పాన్ ఇండియాలో సంచలనం అవ్వడంతో నేరుగా బాలీవుడ్ హీరోలే తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. విలన్ పాత్ర కాకపోయినా గెస్ట్ రోల్స్ ఛాన్స్ వచ్చినా వదులకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ఆఫర్ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అమితాబచ్చన్...సల్మాన్ ఖాన్..అజయ్ దేవగణ్.. సైఫ్ అలీఖాన్ లాంటి వారు ఇప్పటికే టాలీవుడ్ లో లాంచ్ అయిపోయారు. `సైరా నరసింహారెడ్డి` లో అమితాబచ్చన్..`ఆర్ ఆర్ ఆర్` లో అజయ్ దేవగణ్..`గాడ్ ఫాదర్` లో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే కోవలో మరికొంత మంది నటులు కనిపిస్తున్నారు. సంజయ్ దత్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తోన్న `డబుల్ ఇస్మార్ట్` లో నటిస్తున్నారు. తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇస్తోన్న దత్ తొలి సినిమా ఇదే.
ఇటీవల రిలీజ్ అయిన టీజర్ లోనూ దత్ కనిపించారు. ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్` లో కూడా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లవర్ బోయ్ గా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మీ `ఓజీ`తో టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తో తలపడుతున్నాడు. అలాగే అడవి శేష్ నటిస్తోన్న `గుఢచారి-2` లో కూడా నటిస్తున్నాడు. విలక్షణ నటుడిగా పేరొందిన బాడి డియోల్ కూడా బాలయ్య 109వ సినిమాతో తెలుగులో విలన్ గా పరిచయమవుతున్నాడు.
`హరి హర వీరమల్లు` లో కూడా బాబి డియోల్ నటిస్తున్నాడు. వీటితో పాటు నాగార్జున -నవీన్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ ఇతడే విలన్ అని ప్రచారం సాగుతోంది. పాన్ ఇండియా చిత్రం విష్ణు హీరోగా నటిస్తోన్న `కన్నప్ప`లో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. ఇదే అతడి తొలి తెలుగు సినిమా. అలాగే `కల్కి 2898` లో కూడా అమితాబచ్చన్ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న `దేవర`లోనూ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.
ఇలా హిందీ నుంచి చాలా మంది స్టార్లు తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తున్నారు. వాళ్లందర్ని మేకర్స్ ఏరికోరి మరీ తెస్తున్నారు. దీంతో పారితోషికం విషయంలో సదరు నటులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండానే ఇక్కడా ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.