Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఆగస్టు 15 సంగతేంటి? అందరికీ నష్టమేనా?

తెలుగులో ఆగస్టు 15వ తేదీన పుష్ప-2 రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాయిదా పడింది.

By:  Tupaki Desk   |   26 July 2024 10:54 AM GMT
బాలీవుడ్ ఆగస్టు 15 సంగతేంటి? అందరికీ నష్టమేనా?
X

బాలీవుడ్ టు మాలీవుడ్.. ఏ ఇండస్ట్రీలోనైనా స్పెషల్ అకేషన్స్ కు తమ సినిమాలను రిలీజ్ చేయాలని మేకర్స్ తోపాటు ఆయా హీరోలు భావిస్తుంటారు. హాలీడేస్ తోపాటు వీకెండ్ కలిసి వస్తే తమ సినిమాకు వసూళ్ల విషయంలో తిరుగుండదని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటారు. అలా 2024లో ఇప్పటికే ఫెస్టివల్స్ సందర్భంగా అనేక చిత్రాలు రిలీజ్ అయ్యాయి. త్వరలో రానున్న ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పలు సినిమాలు సిద్ధమవుతున్నాయి.

తెలుగులో ఆగస్టు 15వ తేదీన పుష్ప-2 రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో ఆ రోజు రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్, రవితేజ మిస్టర్ బచ్చన్ విడుదల అవ్వనున్నాయి. కోలీవుడ్ హీరో విక్రమ్ తంగలాన్ కూడా అప్పుడే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూడు సినిమాలతో పాటు హీరో రానా నిర్మిస్తున్న '35: చిన్న కథ కాదు' విడుదలవుతోంది. మరి బాలీవుడ్ సంగతేంటంటే.. అక్కడ కూడా మూడు చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి.

జాన్ అబ్రహం, శర్వరీ జంటగా దర్శకుడు నిఖిల్ అద్వానీ తెరకెక్కిస్తున్న వేదా మూవీ.. ఆగస్టు 15న రిలీజ్ అవ్వనుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనుంది. రాజ్‌ కుమార్ రావు హీరోగా, శ్రద్ధా కపూర్‌ లీడ్ రోల్ లో రూపొందుతున్న మూవీ స్త్రీ 2 అదే రోజు విడుదలవ్వనుంది. ఈ రెండు చిత్రాలతోపాటు అక్షయ్ కుమార్ నటించిన కామెడీ థ్రిల్లర్ మూవీ ఖేల్ ఖేల్ మే కూడా రిలీజ్ అవ్వనుంది.

ఈ మూడింటితోపాటు డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ హిందీలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. అన్ని సినిమాలకు స్క్రీన్లు సరిపోవని, డిస్ట్రిబ్యూటర్లు తమ చిత్రాలకు అనుకూలంగా ఒత్తిడి తెస్తారని చెబుతున్నారు. కొన్నిసార్లు బ్లాక్ మెయిల్ కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని సినిమాలకు షోలతో పాటు వసూళ్లు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారుతుందని అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ తోపాటు వసూళ్ల విషయంలో దెబ్బతింటాయని చెబుతున్నారు. ఒక్క సినిమా అయినా రీ షెడ్యూల్ అయితే బెటర్ అని సూచిస్తున్నారు. మూడు చిత్రాలు ఒకేసారి తీసుకొస్తే అనవసరమైన సవాళ్లు ఎదురవుతాయని అంటున్నారు. ఇంకా తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కనుక మరింత ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.