సుపుత్రుని తలచి తట్టుకోలేకపోయిన అగ్రనిర్మాత
జనులు ఆ సుపుత్రుని కనుగొని పొగడగా సంతోషం కలుగుతుందనేది సుమతీ శతకకారుని పద్యం సారాంశం.
By: Tupaki Desk | 12 Nov 2024 3:30 PM GMTపుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తాత్పర్యం: కుమారుడు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు. జనులు ఆ సుపుత్రుని కనుగొని పొగడగా సంతోషం కలుగుతుందనేది సుమతీ శతకకారుని పద్యం సారాంశం.
ఇప్పుడు అగ్ర నిర్మాత బోనీకపూర్ తన సుపుత్రుడు అర్జున్ కపూర్‌ని చూసి అలాంటి ఆనందంలో ఉన్నాడు. తన వారసుడు `సింగం ఎగైన్`లో విలన్ గా అద్భుతంగా నటించాడు. ఈ సినిమా బంపర్ హిట్టు కొట్టింది. అర్జున్ నటనపై ప్రశంసలు కురిసాయి. ఈ విజయాన్ని కుమారుడి కంటే ఇప్పుడు తండ్రి బోనీ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ విషయం అతడి పుట్టినరోజు పార్టీలో బయటపడింది.
బోనీ కపూర్ తన 69వ పుట్టినరోజును తన పిల్లలు అర్జున్, అన్షులా, ఖుషీతో జరుపుకున్నారు. బోనీ కపూర్ తన పిల్లలతో కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నటనతో తన తండ్రిని గర్వపడేలా చేసినందుకు అర్జున్ కపూర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బోనీ తన నటనా ప్రయాణాన్ని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలకు అర్జున్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. 69 సంవత్సరాల వయసులో బోనీ సంపూర్ణ ఆనందాన్ని ఆస్వాధిస్తున్నాడు. అతడి పిల్లలు ఎదిగేస్తున్నారు. అర్జున్ కపూర్ పెద్ద నటుడయ్యాడు. జాన్వీ కపూర్ కథానాయికగా ఎదిగేసింది. ఖుషీ కపూర్ కూడా పెద్ద స్టార్ అయిపోవడం ఖాయం. అందుకే బోనీలో ఆనందానికి అవధుల్లేవ్. ఇప్పుడు సుపుత్రుని ఘనవిజయం ఎంతగానో మైమరిచిపోయేలా చేస్తోంది.
బోనీ తన పిల్లల మధ్య భావోద్వేగ బంధం ఈ బర్త్ డే ఫోటోగ్రాఫ్స్ లో స్పష్టంగా కనిపించింది. అర్జున్ తన తండ్రి నుండి ప్రశంసలు అందుకున్న తర్వాత ఆ వీడియోను కూడా షేర్ చేసాడు. తాజా ఇంటర్వ్యూలో బోనీ చిత్ర పరిశ్రమలో అర్జున్ ప్రయాణం గురించి గొప్పగా మాట్లాడాడు. ``మీ ప్రయాణం హెచ్చు తగ్గులతో అద్భుతంగా ఉంది. మంచి పనిని కొనసాగించండి. సింగం ఎగైన్ లో చూసిన తర్వాత మీ నటనతో మైమరిపించారు. మీ జీవితంలో త్వరలో చాలా గొప్ప ఇన్నింగ్స్ రాబోతోందని భావిస్తున్నాను`` అంటూ ఎమోషనల్ అయ్యారు బోనీ. నువ్వే నేను కోరుకున్న ఉత్తమ కుమారుడివి...అని పొగిడేశాడు. అర్జున్ దీనికి స్పందిస్తూ..``ఇలాంటి క్షణాల కోసం జీవించడం గర్వాన్నిస్తోంది. ఈ క్షణం మీ పుట్టినరోజు జరుపుకోవడం మరింత ప్రత్యేకమైనది. విజయంతో మీ పుట్టినరోజున మిమ్మల్ని సంతోషపెట్టగలను`` అని అర్జున్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి బోనీ కపూర్ బర్త్ డేని ఫ్యామిలీ సెలబ్రేషన్ లా మార్చడం వెనక ఆ కుటుంబంలో వరుస సక్సెస్ లు కారణమని భావించాలి.