కూతురి బోయ్‌ఫ్రెండ్‌పై డాడీ బోనీ మాట!
దేవర చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీకపూర్ ఇంతలోనే రామ్ చరణ్ సరసన RC16లో అవకాశం అందుకుంది.
By: Tupaki Desk | 1 April 2024 5:39 AM GMTదేవర చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీకపూర్ ఇంతలోనే రామ్ చరణ్ సరసన RC16లో అవకాశం అందుకుంది. కెరీర్ ఆరంభమే ఎన్టీఆర్- రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోల సరసన జాన్వీ అవకాశాలు అందుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలికి టాలీవుడ్ గ్రాండ్ వెల్కం చెబుతోంది. ఈ బ్యూటీకి ఇక్కడ అరుదైన గౌరవమిది.
అటు బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గక ముందే, జాన్వీని తెలుగులో పెద్ద స్టార్ ని చేయాలనేది బోనీకపూర్ ప్లాన్. ఇది నిజానికి జాన్వీ సక్సెస్ రేటును బట్టి ఆధారపడి ఉంది. దేవర, ఆర్.సి 16 సాధించే విజయాలు జాన్వీ టాలీవుడ్ కెరీర్ కి అత్యంత కీలకం. అదంతా అటుంచితే జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితం, ప్రేమాయణాల గురించి ఇటీవల విస్త్రతంగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడైన శిఖర్ పహారియాతో జాన్వీ డేటింగ్ చేస్తోందనేది పెద్ద పుకార్. శిఖర్ గతంలో జాన్వీ కపూర్ - బోనీ కపూర్‌లతో పాటు చాలా ఈవెంట్‌లలో కనిపించాడు. ఇటీవల జాన్వీ తిరుపతి విజిట్ లోను తన చెంతనే ఉన్నాడు. ఈ షికార్లను అనుసరించి ఈ జంట ప్రేమాయణంపై విస్తృతమైన ఊహాగానాలు కొనసాగుతున్నా జాన్వీ- శిఖర్ ఇద్దరూ మౌనంగా ఉంటున్నారు. ఈ వార్తల్ని ఖండించకపోవడంతో అనుమానాలే నిజమని భావిస్తున్నారు.
నిజానికి లవ్ స్టోరీస్ ఎప్పుడూ నటీమణుల కెరీర్ కి ఇబ్బందికరం. అందుకే దీనిపై బోనీకపూర్ తాజా ఇంటర్వ్యూలో ఖండించకుండా తెలివైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసాడు. బోనీ కపూర్ నిర్మించిన మైదాన్ విడుదల ప్రమోషన్స్ లో జాన్వీ-శిఖర్ సంబంధంపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. శిఖర్ పహారియా గురించి మాట్లాడమని మీడియా ప్రశ్నించగా ``నేను అతనిని ప్రేమిస్తున్నాను.. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం జాన్వీ కపూర్ అతడిని చూడలేదు.. కానీ నేను అతడితో స్నేహంగా ఉన్నాను`` అని అన్నారు. దీనిని బట్టి జాన్వీ కంటే ముందే బోనీకి శిఖర్ సన్నిహితుడన్నమాట.
బోనీ నర్మగర్భంగా చేసిన మరో ప్రకటన సోషల్ మీడియాలో దావానలంలా మారింది. ``అతడు(శిఖర్) ఎప్పటికీ మాజీ కాలేడని నేను నమ్ముతున్నాను. అతడు మా చుట్టూ ఉంటాడు. నా కోసమో, జాన్వీ కోసమో, అర్జున్ కోసమో.. ఏ వ్యక్తి అయినా మీ కోసం ఏ హోదాలో ఉన్నా, అతడు అందరితో స్నేహంగా ఉంటాడు. అందువల్ల.. మా సెటప్‌లో అతడిలాంటి వ్యక్తిని కలిగి ఉండటం మాకు ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను`` అని అన్నారు. జాన్వీతో శిఖర్ పహారియా స్నేహానికి బోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చాలా కాలమే అయింది. అంతేకాదు.. కొంతకాలంగా ఆ కుటుంబంలో ఒక సభ్యుడి హోదాను కూడా అందుకున్నాడు. జాన్వీ- శిఖర్ జంట స్నేహం ఇలానే కొనసాగుతుందని బోనీ కూడా ధృవీకరించడం విశేషం. అతడు ఎప్పటికీ మాజీ కాలేడు! అని బోనీ అన్నారు. దీనర్థం మరింత విశదంగా బోనీయే చెప్పాలి.