Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. ఈ ఏడాది వాళ్లదే హవా..

అదే సమయంలో బాలీవుడ్ మళ్ళీ పుంజుకొని సక్సెస్ బాట పట్టింది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:43 AM GMT
బాక్సాఫీస్.. ఈ ఏడాది వాళ్లదే హవా..
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ సినిమా ఆధిపత్యం బాహుబలి సినిమాతో స్టార్ట్ అయ్యింది. తరువాత పాన్ ఇండియా ట్రెండ్ ని ఉనికిలోకి తీసుకొచ్చి సౌత్ సినిమాలు అన్ని కూడా మినిమమ్ ఐదు భాషలలో ఏక కాలంలో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని స్ట్రైట్ చిత్రాలు కూడా మల్టీపుల్ భాషలలో డబ్ అవుతూ డిజిటల్ స్పేస్ లోకి వస్తున్నాయి.

ఇలా రావడం వలన అన్ని ప్రాంతాల ఆడియన్స్ కి ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లు రీచ్ అవుతున్నాయి. టాలీవుడ్ నుంచి ఎక్కువ సినిమాలు పాన్ ఇండియా బ్రాండ్ తో థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా సూపర్ హిట్ అయ్యాయి. రెండేళ్ళ పాటుగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై టాలీవుడ్ సినిమాల హవా నడిచింది. దేశంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ సినిమాలలో తెలుగు సినిమాలు కచ్చితంగా ఉండేవి.

అయితే ఈ ఏడాది మాత్రం టాలీవుడ్ నుంచి పెద్దగా ప్రభావం చూపించే సినిమాలు రాలేదని చెప్పాలి. అదే సమయంలో బాలీవుడ్ మళ్ళీ పుంజుకొని సక్సెస్ బాట పట్టింది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి. ఆ రెండు బాలీవుడ్ నుంచి వచ్చినవే కావడం విశేషం. ఇక ఐదు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు మూడు ఉండగా అందులో గద్దర్ 2 బాలీవుడ్ నుంచి వచ్చింది.

మిగిలిన రెండు సినిమాలైన జైలర్, లియో కోలీవుడ్ నుంచి వచ్చినవి కావడం విశేషం. తాజాగా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ పఠాన్ మూవీ కూడా టాప్ 5 కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో చేరే అవకాశం కనిపిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇది కూడా టాప్ 5లో చేరొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ఏడాది టాప్ 5లో చేరే సత్తా ఒక్క సలార్ కి మాత్రమే ఉంది.

ఈ సినిమా ఈ ఏడాది మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించే మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మాత్రం కచ్చితంగా టాలీవుడ్ ఇండియన్ మూవీ మార్కెట్ పై స్ట్రాంగ్ ఆధిపత్యం చూపించనుంది. దీనికి కారణం పుష్ప2, దేవర, ఓజీ, సలార్2, గేమ్ చేంజర్, కల్కి2898 ఏడీ వంటి పెద్ద సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి 500 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించగలిగేవే కావడం గమనార్హం.