బాక్సాఫీస్ షేక్.. ఒక్కరోజే రూ.150కోట్లు!
అలా సౌత్‌లో రజనీ 'జైలర్' హవా నడుస్తుండగా.. నార్త్‌లో 'గదర్-2', 'ఓఎంజీ-2' సినిమాలు అదరగొట్టాయి.
By: Tupaki Desk | 16 Aug 2023 1:11 PM GMTస్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15.. ఇండియన్ బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిసింది. ఇప్పటికే విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న సినిమాలకు కలెక్షన్ల వరద పారింది. పంద్రాగస్టు రోజు హాలీడే కావడం వల్ల సినిమాలు చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. దీంతో దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ కళకళలాడాయి. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ బద్దలైంది. ఒక్కరోజే ఏకంగా రూ.150 కోట్ల వరకు వసూలు నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు లెక్కలు తెలిపాయి.
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేయగా.. పంద్రాగస్టు రోజు కాసల వర్షంతో మరింత షేక్ చేసింది. ఇప్పటికే రూ.400కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం.. ఎక్కడా తగ్గేదే లే అన్నట్టు దూసుకెళ్లింది. డబుల్ డిజిట్ కలెక్షన్లతో రఫ్పాడించింది. అలా సౌత్‌లో రజనీ 'జైలర్' హవా నడుస్తుండగా.. నార్త్‌లో 'గదర్-2', 'ఓఎంజీ-2' సినిమాలు అదరగొట్టాయి. బాక్సాఫీస్ ముందు సూపర్‌హిట్‌గా నిలిచాయి.
సన్నీ డియోల్- అమీషా పటేల్ నటించిన 'గదర్-2'.. తొలి రోజునుంచే భారీగా వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే రూ.250కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మరోవైపు, మంచి టాక్ సంపాదించిన 'ఓఎంజీ-2'కు తొలి రోజు కలెక్షన్లు తక్కువే వచ్చినప్పటికీ.. ఆ తర్వాత రోజు నుంచి క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ పోతోంది.
మొత్తంగా ఇండిపెండెన్స్ డే రోజు కలెక్షన్లలో గదర్-2దే పైచేయిగా నిలిచింది. దేశభక్తి చిత్రంగా వచ్చిన ఈ సినిమాను చూసేందుకు పంద్రాగస్టు రోజు ఆడియెన్స్ ఎగబడ్డంతో.. ఆగస్టు 15న ఈ చిత్రానికి ఏకంగా రూ.55 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇతర సినిమాలు ఏవీ లేకపోతే ఈ చిత్రం దాదాపు రూ.70కోట్లు వసూలు చేసేదని పేర్కొన్నాయి. ఆ తర్వాతి స్థానంలో జైలర్ నిలిచింది. ఓఎంజీ-2 సైతం మంచి హోల్డ్‌తో వసూళ్లు రాబట్టింది.
ఇక కరణ్ జోహార్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, అలియా భట్ నటించిన రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమాకు అక్కడక్కడా పర్వాలేదనిపించే కలెక్షన్లు వచ్చాయి. ఒపెన్‌హైమర్ సినిమాకు కూడా కలెక్షన్లు స్వల్పంగా పెరిగాయి. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌కు మాత్రం మైనర్ వసూళ్లు దక్కాయి. ఈ ఒక్క సినిమా మాత్రమే డిజాస్టర్‌గా నిలిచింది.