కన్నడలో సెన్సేషన్.. ఇక్కడ పట్టించుకోలా
కానీ 'బాయ్స్ హాస్టల్' తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమాలో విషయం లేదని కాదు కానీ.. మరీ మన ఆడియన్స్ ఆశించిన స్థాయిలో లేదు
By: Tupaki Desk | 29 Aug 2023 5:22 AM GMTహాస్టల్ హుడుగారు బేకాగిదరే.. ఈ ఏడాది కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. చాలామంది కొత్త వాళ్లను పెట్టిన నితిన్ కృష్ణమూర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిన్న సినిమా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. మేకింగ్.. కథను చెప్పే విధానంలో కొత్త పంథాలో సాగిన ఈ చిత్రం కన్నడ యువ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కన్నడలో న్యూ వేవ్ సినిమాలకు ఊపు తెచ్చిన వాళ్లలో ఒకడైన రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడం విశేషం.
కన్నడలో సాధించిన విజయం చూసి.. తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి లెజెండరీ బేనర్‌తో కలిసి ఛాయ్ బిస్కెట్ వాళ్లు తెలుగులో 'బాయ్స్ హాస్టల్' పేరుతో ఈ చిత్రాన్ని అందించారు. ఇది డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకుండా బాగా శ్రద్ధ పెట్టి ఒరిజినల్ అనిపించేలా డైలాగ్స్ రాయించి.. డబ్బింగ్ కూడా బాగా శ్రద్ధ పెట్టి చేయించారు. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. సెలబ్రెటీలు ఈ సినిమాను ప్రమోట్ చేశారు.
కానీ 'బాయ్స్ హాస్టల్' తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమాలో విషయం లేదని కాదు కానీ.. మరీ మన ఆడియన్స్ ఆశించిన స్థాయిలో లేదు. ఒక దశ వరకు వినోదాత్మకంగానే అనిపించినా.. తర్వాత గాడి తప్పింది. ఇలాంటి కామెడీ సినిమాలకు తెలిసిన నటీనటులు ఉంటే ప్లస్ అవుతుంది. అలా లేకపోవడం వల్ల మన వాళ్లు కనెక్ట్ కాలేకపోయారని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో కొన్ని ఇరిటేటింగ్ సీన్లు సినిమా గ్రాఫ్‌ను తగ్గించేశాయి. 'కాంతార' లాగా ఏదైనా స్టన్నింగ్‌గా ఉంటే తప్ప కొత్త వాళ్లు చేసిన అనువాద చిత్రాన్ని ఆదరించడం కష్టం.
కాబట్టే బాగా ప్రమోట్ చేసినా ఈ చిత్రం జనాల్లోకి వెళ్లలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండటంతో సినిమాను రిలీజ్ చేసిందే తక్కువ థియేటర్లలో. వాటిలో కూడా సరైన ఆక్యుపెన్సీలు లేకపోయాయి. వీకెండ్లోనే సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ తర్వాత పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా.. తెలుగులో మాత్రం ఇంపాక్ట్ వేయలేకపోయింది.