Begin typing your search above and press return to search.

'బ్రహ్మ ఆనందం' మూవీ రివ్యూ

చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రోమోల్లో ఉన్న ఆహ్లాదం.. సినిమాలోనూ ఉందా? తెలుసుకుందాం పదండి.

By:  Tupaki Desk   |   14 Feb 2025 12:52 PM GMT
బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ
X

'బ్రహ్మ ఆనందం' మూవీ రివ్యూ

నటీనటులు: బ్రహ్మానందం-రాజా గౌతమ్-వెన్నెల కిషోర్-ప్రియ వడ్లమాని-ఐశ్వర్య హొలక్కల్-సంపత్ రాజ్-రాజీవ్ కనకాల-రఘుబాబు-ప్రభాకర్ తదితరులు

సంగీతం: శాండిల్య పిసపాటి

ఛాయాగ్రహణం: మితేష్ పర్వతనేని

నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క

రచన-దర్శకత్వం: ఆర్వీఎస్ నిఖిల్

ఒకప్పుడు విరామం లేకుండా నటించిన చేసిన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం.. కొన్నేళ్ల నుంచి సినిమాలు తగ్గించారు. ఇప్పుడాయన మళ్లీ బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్‌ తో కలిసి నటించిన సినిమా.. బ్రహ్మ ఆనందం. చక్కటి ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రోమోల్లో ఉన్న ఆహ్లాదం.. సినిమాలోనూ ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ: బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఒక థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అతను.. ఒంటరిగా బతుకుతుంటాడు. కెరీర్లో అనుకున్నంతగా ఎదగలేకపోతున్న బ్రహ్మానందానికి తాను రాసుకున్న ఓ మంచి ప్లేను ఢిల్లీలో పెద్ద షోలో ప్రదర్శించే అవకాశం వస్తుంది. కానీ అందుకోసం ఆరు లక్షల డబ్బు అవసరమవుతుంది. కానీ ఎక్కడా డబ్బులు పుట్టవు. ఆ స్థితిలో మూర్తి (బ్రహ్మానందం) అనే పెద్దాయన ఓ పది రోజులు తనతో పాటు ఒక ఊరిలో ఉండి తనను బాగా చూసుకుంటే తనకున్న ఆరెకరాల పొలం రాసిస్తానని చెబుతాడు. దీంతో మూర్తి వెంట తన ఊరికి వెళ్తాడు బ్రహ్మానందం. కానీ అక్కడికి వెళ్లాక అతడికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఆ ఊరిలోనే ఇరుక్కుపోతాడు. ఇదంతా మూర్తి ఆడిన నాటకమని బ్రహ్మానందానికి తెలుస్తుంది. ఇంతకీ మూర్తి ఎవరు.. తన నేపథ్యమేంటి.. తన డ్రామా వెనుక కారణాలేంటి.. చివరికి బ్రహ్మానందం లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: వయసు మీద పడ్డ ఓ పెద్దాయన.. తన వయసులోనే ఉన్న పెద్దావిడ. అతనేమో ఒంటరి. ఆమెకు అందరూ ఉన్నా లేనట్లే. అనుకోకుండా వృద్ధాశ్రమంలో కలుస్తుంది ఈ జంట. ఒకరంటే ఒకరికిష్టం. కానీ ఆ వయసులో ఇద్దరూ కలవాలంటే చాలా కష్టం. వీళ్లిద్దరినీ ఓ కుర్రాడు కలిపితే..? ప్రేమలో పడ్డ యువ జంటను కలపడానికి ఓ పెద్ద వయస్కుడు ప్రయత్నించడం రొటీన్. కానీ లేటు వయసులో ఒకరినొకరు ఇష్టపడ్డ వృద్ధ జంటను ఓ కుర్రాడు కలిపేందుకు పోరాడడం భిన్నం. వినడానికే కాదు.. చూడ్డానికి కూడా ఆసక్తికరంగా అనిపించే డిఫరెంట్ పాయింటుతో 'బ్రహ్మ ఆనందం'లో ఒక మంచి ప్రయత్నంగా నిలవడానికి సరైన పునాదే పడింది. కానీ కేవలం ఓ మంచి పాయింట్ ఎంచుకుంటే సరిపోదు. దాన్ని ప్రభావవంతంగా చెప్పాలి. సరిపడా వినోదం ఉండాలి. ఎమోషన్లు పండాలి. ఐతే దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ ఈ విషయంలోనే నిరాశ పరిచాడు. కథ బాగున్నా.. సరైన కథనం లేక 'బ్రహ్మానందం' ఉడకికీ ఉడకని వంటకంలా తయారైంది.

బ్రహ్మానందం పేరు ఎత్తగానే ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు విరుస్తాయి. ఆయన్నుంచి ప్రధానంగా ఆశించేది కామెడీనే. కానీ ఆయన ఎమోషన్లు పండించాల్సి వస్తే ఎంత గొప్పగా అభినయించగలరో అప్పట్లో 'బాబాయ్ హోటల్'.. ఈ మధ్య వచ్చిన 'రంగమార్తాండ' లాంటి సినిమాలు రుజువుగా నిలుస్తాయి. 'బ్రహ్మ ఆనందం'లో ఆయన చేసిన మూర్తి పాత్రలోనూ కొంచెం ఫన్ టచ్ ఉన్నప్పటికీ.. ప్రధానంగా ఈ పాత్ర ఎమోషన్లతోనే ఆకట్టుకుంటుంది. లేటు వయసులో ప్రేమలో పడి.. దాన్ని పండించుకోవడానికి తపించే వ్యక్తి పాత్రలో బ్రహ్మి అద్భుత అభినయం ప్రదర్శించాడు. 'బ్రహ్మ ఆనందం' సినిమాను డ్రైవ్ చేసేది ఆయన పాత్రే. తాళ్లూరి రామేశ్వరితో బ్రహ్మి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూస్తే ఏ వయసు ప్రేక్షకులకైనా ముచ్చటేస్తుంది. ఐతే ఈ ప్రేమకథను డీల్ చేసినంత బాగా.. మిగతా సినిమాను దర్శకుడు చేయలేకపోయాడు. ముఖ్యంగా రాజా గౌతమ్ క్యారెక్టర్ని అతను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. దశా దిశా లేనట్లు ప్రవర్తించే ఆ పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ముడిపడ్డ సన్నివేశాలు చాలా వరకు విసుగు పుట్టిస్తాయి. ఈ పాత్ర ద్వారా అసలేం చెప్పదలుచుకున్నారన్నది అర్థం కాదు. తన స్వార్థం తప్ప ఏమీ పట్టని కుర్రాడు పరివర్తన చెందితే ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు కానీ.. అది తెరపై అంత ప్రభావవంతంగా కనిపించలేదు. థియేటర్ ఆర్టిస్టుగా హీరో జర్నీని చూపించే సన్నివేశాలు కానీ.. అతడి ప్రేమకథ కానీ ఆసక్తికరంగా అనిపించవు. బ్రహ్మానందం పాత్ర ప్రవేశంతోనే కథలో కొంచెం కదలిక వస్తుంది. ఆయనతో పాటు వెన్నెల కిషోర్ కూడా ప్రేక్షకులను కొంత ఎంటర్టైన్ చేయగలిగారు. కథ సిటీ నుంచి పల్లెటూరికి మళ్లాక మొదట్లో కొన్ని సీన్లు బాగానే అనిపిస్తాయి. కానీ రాను రాను అక్కడ కూడా వ్యవహారం గాడి తప్పుతుంది.

బ్రహ్మానందం పాత్ర ఏదో పెద్ద ప్లే నడుపుతున్నట్లు.. నడపబోతున్నట్లు ఇంటర్వెల్ దగ్గర చాలా బిల్డప్ ఇస్తారు కానీ.. ఆ తర్వాత ఆ పాత్రను తేల్చిపడేశారు. బ్రహ్మి ప్రేమకథ ఆసక్తికరంగా అనిపించినా.. తన ప్రేమను పండించుకోవడానికి ఆ పాత్ర చేసే ప్రయత్నాలు మాత్రం చాలా బోరింగ్ గా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో ఏ సన్నివేశం ఎందుకు వస్తుందో తెలియదు. అంతకంతకూ ఇంట్రెస్ట్ తగ్గిపోయేలా నడుస్తుంది కథనం. హీరోలో రియలైజేషన్ వచ్చే సన్నివేశాలు తేలిపోయాయి. హీరో అనే కాదు.. మిగతా పాత్రలు కూడా ఉన్నట్లుండి మారిపోతున్నట్లు చూపించారు. దాని వల్ల ఎమోషన్ క్యారీ అవ్వలేదు. చివర్లో ఒక పావుగంట మాత్రం 'బ్రహ్మ ఆనందం' మెరుగ్గా అనిపిస్తుంది. సంపత్ పాత్ర క్లైమాక్సుని కొంచెం నిలబెట్టింది. బ్రహ్మి సైతం మెప్పించాడు. గౌతమ్ క్యారెక్టర్ మాత్రం ఎక్కడా ప్రేక్షకులకు కనెక్టయ్యేలా సాగలేదు. బ్రహ్మి-వెన్నెల కిషోర్ కామెడీ.. బ్రహ్మి-రాజేశ్వరి మధ్య పరిణతితో కూడిన ప్రేమకథ.. చివర్లో కొన్ని ఎమోషనల్ సీన్ల వరకు 'బ్రహ్మ ఆనందం' ఓకే అనిపిస్తుంది. కానీ అనాసక్తికర కథనం.. స్లో నరేషన్.. బోరింగ్ సీన్లు చాలా వరకు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రం మిశ్రమానుభూతినే మిగులుస్తుంది.

నటీనటులు: బ్రహ్మానందం చాన్నాళ్ల తర్వాత పూర్తి స్థాయి పాత్రలో కనిపించిన సినిమా ఇది. బ్రహ్మిని మళ్లీ ఇలా చూడడం ఆయన అభిమానులకు ఆనందాన్నిస్తుంది. ఐతే బ్రహ్మి నుంచి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ ఆశిస్తే నిరాశ తప్పదు. అక్కడక్కడా కొంత నవ్వించాడు కానీ.. ఒకప్పటి స్థాయిలో అయితే వినోదాన్ని అందించలేదు. కామెడీ కంటే ఎమోషన్ల విషయంలోనే ఆయనే ఎక్కువ ఆకట్టుకున్నాడు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ పెర్ఫామెన్స్ బాగుంది. తెరపై బ్రహ్మికి మనవడు అంటే నమ్మేలా తన లుక్ బాగానే మెయింటైన్ చేశాడు. తన గత చిత్రాలతో పోలిస్తే నటనలో మెరుగుపడ్డాడు. ముఖ్యంగా ప్రి క్లైమాక్సులో తన నటన మెప్పిస్తుంది. తన స్వార్థమే ముఖ్యం అనుకునే పాత్రను కన్విన్సింగ్ గా చేశాడు. గౌతమ్ డైలాగ్ డెలివరీనే అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది. వెన్నెల కిషోర్ కు.. గౌతమ్-బ్రహ్మిలతో సమానంగా స్క్రీన్ టైం దొరికింది. అతను ఉన్నంతలో బాగానే నవ్వించాడు. సినిమాలో అతడి కామెడీనే బిగ్ రిలీఫ్. ప్రియ వడ్లమానిది చిన్న పాత్రే. తన నటన పర్వాలేదు. రాజీవ్ కనకాల.. తాళ్లూరి రామేశ్వరి.. సంపత్.. వీళ్లంతా బాగానే చేశారు.

సాంకేతిక వర్గం: 'బ్రహ్మ ఆనందం'లో సాంకేతిక విభాగాల పనితీరు ఓకెే. శాండిల్య పిసపాటి నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. మంచి ఫీల్ ఇస్తుంది. సినిమాలోని ఒకట్రెండు పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. మితేష్ పర్వతనేని ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ప్లెజెంట్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా బాగానే కుదిరాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా బలమైన స్క్రీన్ ప్లే.. ఆసక్తికర నరేషన్ తో మెప్పించలేకపోయాడు. రైటింగ్ చాలా చోట్ల సాధారణంగా అనిపిస్తుంది. కథలో విషయం ఉన్నప్పటికీ.. దాన్ని తెరపై బలంగా చెప్పలేకపోయాడు.

చివరగా: బ్రహ్మానందం.. పాయింట్ బాగుంది కానీ!

రేటింగ్-2.25/5