సకుటుంబ సపరివారసమేతంగా బ్రహ్మానందం
ఆయన పేరులోనే ఆనందం దాగి ఉంది. అందరినీ ఆనందింపజేసేవాడు! భారతదేశంలోని అత్యంత ఆదరణ కలిగిన హాస్యనటుడు.
By: Tupaki Desk | 13 Nov 2024 10:30 PM GMTఆయన పేరులోనే ఆనందం దాగి ఉంది. అందరినీ ఆనందింపజేసేవాడు! భారతదేశంలోని అత్యంత ఆదరణ కలిగిన హాస్యనటుడు. దాదాపు 35ఏళ్ల కెరీర్ లో సుమారు 1000 సినిమాల్లో నటించి రారాజుగా కొనసాగుతున్నాడు. గిన్నిస్ రికార్డుల్లోను ఆయనకో రికార్డు ఉంది. అతడు మరెవరో కాదు.. కింగ్ ఆఫ్ కామెడీ.. ది గ్రేట్ బ్రహ్మానందం.
కన్నెగంటి బ్రహ్మానందం పూర్తి పేరు. బ్రహ్మానందం అని అందరూ పిలుచుకుంటారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినా ప్రజలు ఆయన ప్రతిభకు ఎప్పుడో డాక్టరేట్‌లు ఇచ్చారు. భారతదేశంలోని అత్యధిక పారితోషికం పొందే హాస్య నటులలో ఒకరిగా బ్రహ్మీకి పేరుంది. అతడు ఫిల్మ్ ఆర్ట్‌కి చేసిన కృషికి భారతదేశంలో నాల్గవ-అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీతో సత్కారం అందుకున్నాడు.
ఇటీవల ఆయన సెలక్టివ్ గా మాత్రమే నటిస్తున్నారు. బ్రహ్మానందం వారసుల గురించి తెలిసిందే. పెద్ద వాడు రాజా గౌతమ్ హీరోగా ప్రయత్నించాడు. కానీ ఆశించిన సక్సెస్ ఇక్కడ అంత వీజీ కాదు. పల్లకిలో పెళ్లికూతురు లాంటి హిట్ సినిమాతో పరిచయమైన అతడు ఫ్లాపులను ఎదుర్కొన్నాడు. ఇటీవలే దూత సినిమాలోను నటించి మెప్పించాడు. ప్రస్తుతం తన తండ్రి పేరు మీదనే రూపొందుతున్న `బ్రహ్మానందం` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ దీపావళికి విడుదలైన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక రెండో కుమారుడు సిద్ధార్థ్ గత ఏడాది ఐశ్వర్యను పెళ్లాడాడు. ఈ ఈవెంట్ కి అతిరథ మహారథులు విచ్చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సకుటుంబ సమేతంగా బ్రహ్మానందం ఫోటోగ్రాఫ్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇందులో బ్రహ్మానందం, ఆయన భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్, అతడి భార్య జ్యోత్స్న రెడ్డి, చిన్న కుమారుడు సిద్ధార్థ్ - శైలజ దంపతులు వారితో పాటు కిడ్స్ కూడా ఉన్నారు. కొడుకులు, కోడళ్లు, మనవలతో బ్రహ్మానందం ఫ్యామిలీ లైఫ్ ఎంత ఆనందంగా ఉందో ఈ ఫోటో ఆవిష్కరిస్తోంది. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోని నెటిజనులు వైరల్ గా షేర్ చేస్తున్నారు.
తీరిక సమయాల్లో బ్రహ్మీ వ్యాపకం
జనవరి 2019లో, బ్రహ్మానందం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (AHI)లో విజయవంతమైన గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలను తగ్గించారు. నటనతో పాటు, బ్రహ్మానందం ఔత్సాహిక శిల్పి, స్కెచ్ కళాకారుడు కూడా. ఆయన తన ఖాళీ సమయంలో స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి తాత్విక రచనలను కూడా చదువుతాడు.