థియేటర్లో జాతీయ గీతం వినే ఓపిక మన యువతకి లేదు! బ్రహ్మానందం
థియేటర్లో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శన తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Aug 2024 11:23 AM GMTథియేటర్లో సినిమా ప్రదర్శనకు ముందు జాతీయ గీతం ప్రదర్శన తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే. జనగణమన మొదలవుతుందనగానే ప్రేక్షకులంతా నుంచుని గీతాన్ని దేశభక్తిని చాటాలి. పిడుగే వచ్చి పడినా ఆ సమయంలో నుంచున్న చోట నుంచి కదిలే ప్రశక్తే ఉండకూడదు. అంతటి దేశ భక్తిని ప్రతీ పౌరుడు చాటాలి అన్న నినాదంతో గీతాన్ని థియేటర్లో తప్పనిసరి చేసారు. కానీ నేడు థియేటర్లో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే.
కొన్ని థియేటర్లు జాతీయ గీతాన్ని వేసే పరిస్థితి లేదు. జాతీయ గీతాన్ని కట్ చేస్తారు. లేదంటే మ్యూట్ చేస్తారు. పది నిమిషాలు సమయం వృద్ధా అన్నట్లుగానే థియేటర్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అలాగే క్యాన్సర్ కారకాలకు సంబంధించి యాడ్స్ కూడా మ్యూట్ చేస్తున్నారు. రెండున్నర గంటల ఎంటర్ టైన్ మెంట్ కి ఇచ్చే ప్రధానాత్య పావుగంట జాతీయ గీతానికికి, క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలకు ఇవ్వకపోవడం దౌర్భాగ్యమనే చెప్పాలి.
తాజాగా జాతీయ గీతం పట్ల నిర్లక్షం ప్రదర్శించే వారిపై ప్రముఖ నటుడు బ్రహ్మానందం చురకలు అంటించారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం యువత తీరును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. `నాడు స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో నేడు దేశ వ్యాప్తంగా ప్రజలు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నారన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్నారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు ఎలాగో స్వాతంత్య్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ లాంటిదన్నారు. సినిమా థియేటర్ లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల చరిత్రను, త్యాగాలను నేటి యువత తెలుసుకోవాలని సూచించారు.