మూవీ రివ్యూ : భ్రమయుగం
By: Tupaki Desk | 23 Feb 2024 7:59 AM GMT'భ్రమయుగం' మూవీ రివ్యూ
నటీనటులు: మమ్ముట్టి-అర్జున్ అశోకన్-సిద్దార్థ్ భరతన్-అమల్దా లిజ్ తదితరులు
సంగీతం: క్రిస్టో జేవియర్
ఛాయాగ్రహణం: షెహ్నాద్ జలాల్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర-శశికాంత్
రచన-దర్శకత్వం: రాహుల్ సదాశివన్
తెలుగులోనూ మంచి ఆదరణ ఉన్న మలయాళ నటుల్లో మమ్ముట్టి ఒకరు. లేటు వయసులోనూ అద్భుతమైన పాత్రలతో అలరిస్తున్న ఈ లెజెండరీ నటుడు.. ఇప్పుడు ఓ వైవిధ్యమైన హార్రర్ చిత్రం చేశాడు. అదే.. భ్రమయుగం. ఈ రోజే తెలుుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
17వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్లు భారతీయ బానిసల్ని దేశం దాటించే ప్రయత్నంలో ఉండగా.. ఆ బానిసల్లో ఒకడైన దేవన్ (అర్జున్ అశోకన్) వారి నుంచి తప్పించుకుని అడవి మధ్యలోని ఒక పెద్ద బంగళాలోకి వెళ్తాడు. దాని యజమాని తుడుమన్ పోటీ (మమ్ముట్టి) అతడితో ప్రేమగా మాట్లాడి బంగళాలో ఆశ్రయం కల్పిస్తాడు. లంకంత ఉన్న ఆ బంగళాలో తుడుమన్ తో పాటు ఓ వంట వాడు (సిద్దార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. తనకు ఆశ్రయం, తిండి దొరికిందని ముందు ఆశపడ్డ దేవన్ కు.. ఆ తర్వాత తుడుమన్ పైకి కనిపించేంత మంచి వాడు కాదని అర్థమవుతుంది. ఆ బంగళా దాటి బయటికి వెళ్లలేని సంక్లిష్ట స్థితికి చేరుకుంటాడు. ఇంతకీ తుడుమన్ ఎవరు.. తన నేపథ్యమేంటి.. అతణ్ని దాటి దేవన్ అక్కడ్నుంచి బయటపడగలిగాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
అడవి మధ్యలో పెద్ద బంగళా.. దారి తప్పిన ఓ వ్యక్తి అందులోకి అడుగు పెడతాడు.. ముందు అంతా మామూలుగానే అనిపిస్తుంది.. తర్వాత అదొక దయ్యాల కొంప అని అర్థమవుతుంది.. ఆ బంగళాలోకి వెళ్లిన వ్యక్తి అక్కడ్నుంచి బయటపడ్డానికి పోరాటం చేస్తాడు.. ఈ లైన్లో కొన్ని వందల సంఖ్యలో హార్రర్ సినిమాలు వచ్చి ఉంటాయి. నేపథ్యాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి హార్రర్ సినిమాలన్నింటినీ ఇలాగే నడిపిస్తుంటారు. 'భ్రమయుగం' కూడా దాదాపుగా ఇదే లైన్లో తెరకెక్కిన సినిమానే అయినా.. ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకు ప్రధాన కారణం.. మమ్ముట్టి. 70 ఏళ్లు దాటినా ఇంకా ఎంతో ఉత్సాహంగా సినిమా సినిమాకూ ఆయన చూపించే వైవిధ్యం.. పోషించే పాత్రలు ఇంకెవరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చాలా సింపుల్ అనిపిస్తూనే.. బలమైన ముద్ర వేసే కుడుమన్ పాత్రలో ఆయన హావభావాల గురించి చెప్పడం కాదు.. తెర మీదే చూసి అనుభూతి చెందాలి. ఆయన నవ్వే ఒక నవ్వు చాలు.. ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించడానికి. ఆ ఒక్క నవ్వుకే ఎన్ని అవార్డులైనా ఇచ్చేయొచ్చు అనిపిస్తుంది. చాలా నెమ్మదిగా.. అక్కడక్కడా బోరింగ్ గా సాగే 'భ్రమయుగం'లో మమ్ముట్టికి తోడు ఇంకో ఇద్దరు ఆర్టిస్టుల అద్భుత అభినయం.. ప్రతి సన్నివేశంలోనూ కనిపించే వినిపించే సాంకేతిక నైపుణ్యం.. 'భ్రమయుగం'ను భిన్నమైన సినిమాగా నిలబెట్టాయి. ఐతే హార్రర్ సినిమాల్లో మామూలుగా కనిపించే హడావుడి ఇందులో ఉండదు. ఇలాంటి సినిమాలను ఆస్వాదించడానికి ప్రత్యేకమైన అభిరుచితో పాటు ఓపికా ఉండాలి.
ఎప్పుడో అంతరించిపోయిన బ్లాక్ అండ్ వైట్ థీమ్ ను 'భ్రమయుగం' కోసం ఎంచుకోవడమే దీనికొక డిఫరెంట్ కలర్ తీసుకొచ్చింది. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఒక కన్విక్షన్ తోనే 'భ్రమయుగం'ను బ్లాక్ అండ్ వైట్ సినిమాగా తీయాలనుకున్నాడని సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏంటి అనే ఫీలింగ్ తో దీనికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. కానీ అలవాటు పడ్డాక వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతాం. కథంతా ఒక పాడుబడ్డ బంగళాలోనే జరిగినా.. విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. దీనికి తోడు ఉలికిపాటుకు గురి చేసే సౌండ్ డిజైన్ మరింతగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. తెర మీద కనిపించే సన్నివేశాలు అంత గొప్పగా ఏమీ లేకున్నా.. కథ పెద్దగా ముందుకు కదలకున్నా.. నరేషన్ మరీ నెమ్మదిగా అనిపించినా.. ఈ కథలో ఇన్వాల్వ్ అయిపోయేలా చేయడంలో ఆర్టిస్టుల అభినయం.. టెక్నికల్ వాల్యూస్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా నిగూఢంగా అనిపించే మమ్ముట్టి పాత్ర-నటన ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కథ పరంగా మాత్రం ప్రథమార్ధం చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. మమ్ముట్టి పాత్రకు సంబంధించిన మర్మాన్ని తెలిపే ప్రి ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రమే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.
ద్వితీయార్ధంలో కథనం కొంచెం వేగం పుంజుకుంటుంది. మమ్ముట్టి తప్పించుకోవడానికి మిగతా ఇద్దరు చేసే ప్రయత్నాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. చివరి అరగంటలో సన్నివేశాలు ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగా సాగుతాయి. కొన్ని సీన్లు లాజిక్కుతో సంబంధం లేకుండా సాగినా.. హార్రర్ సినిమా కాబట్టి సర్దుకోవచ్చు. మమ్ముట్టి పతాక సన్నివేశాల్లో ఇంకా చెలరేగిపోయాడు. కానీ ఆయన పాత్ర నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. దాన్ని ముగించిన తీరు అంత కిక్ ఇవ్వదు. పతాక ఘట్టాల్లో నటీనటులు అభినయంతో పాటు దర్శకుడు ఇతర టెక్నీషియన్ల పనితనం గొప్పగా అనిపిస్తుంది. అంతిమంగా ఒక వెరైటీ హార్రర్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. హార్రర్ సినిమా కాబట్టి భయంతో వణికించే స్థాయిలో అయితే భ్రమయుగం లేదు. కానీ కొన్ని సీన్లు ఒళ్ళు జిల్లు మనేలా చేస్తాయి. సినిమా అంతా ముగ్గురే ఆర్టిస్టులుండడం.. సన్నివేశాలు మరీ నత్తనడకన సాగడం.. కథలో పెద్దగా మలుపులు లేకపోవడం వల్ల కొంత నిరాశ తప్పదు. ఇది అందరికీ రుచించే సినిమా కాదు. కానీ గొప్ప నటనను.. టెక్నికల్ బ్రిలియన్స్ ను ఆస్వాదించే వారికి ఇది మంచి కిక్కు ఇస్తుంది.
నటీనటులు:
మమ్ముట్టి గురించి చెప్పేదేముంది? అద్భుతంగా నటించాడు. ఆయన స్థాయి నటుడు ఇలాంటి పాత్ర చేయడమే ఆశ్చర్యం. ఎలాంటి ఇమేజ్ బంధనాలు పెట్టుకోకుండా ఇలాంటి పాత్రలు చేయడం కొందరు స్టార్లకే సాధ్యం. కొన్ని క్లోజప్ షాట్స్ చూస్తే ఆయన ఎంత గొప్ప నటుడో అర్థమవుతుంది. ముందే అన్నట్లు మమ్ముట్టి నవ్వే ప్రేక్షకులను కంగారు పెడుతుంది. అర్జున్ అశోకన్.. సిద్దార్థ్ భరతన్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కీలక సన్నివేశాల్లో ఇద్దరి హావభావాలు ఆకట్టుకుంటాయి. సినిమా అంతా ఈ ముగ్గురే కనిపిస్తారు. ఓ అమ్మాయి కొన్ని నిమిషాలు అలా మెరిసి మాయం అవుతుంది. ఆమె ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా 'భ్రమయుగం' ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. ప్రతి విభాగం గొప్ప పనితీరును కనబరిచింది. క్రిస్టో జేవియర్ బ్యాగ్రౌండ్ స్కోర్.. కొన్ని చోట్ల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. సౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. జలాల్ ఛాయాగ్రహణం కూడా సూపర్బ్ అనిపిస్తుంది. విజువల్స్ వావ్ అనిపిస్తాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. ఒక్క లొకేషన్లోనే సినిమా సాగినా.. సన్నివేశాలు రిపీటెడ్ అనే ఫీలింగ్ కలగదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ రాహుల్ సదాశివన్ తన ముద్రను చూపించాడు. ఇది డైరెక్టర్స్ ఫిలిం అనే భావన కలుగజేశాడతను. తన నరేషన్లో ఒక వైవిధ్యం కనిపిస్తుంది. అతను కథ ఇంకొంచెం చిక్కగా ఉండేలా చూసుకుని.. ఇంకొన్ని హై మూమెంట్స్ రాసుకుని ఎగ్జిక్యూట్ చేసి ఉంటే బాగుండేది.
చివరగా: భ్రమయుగం.. అదో మాదిరి హార్రర్
రేటింగ్ - 2.75/5