చెన్నైలో రజనీకాంత్ థియేటర్ కనుమరుగు
ఉత్తర మద్రాసులో మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ సినిమా థియేటర్ అయిన `శ్రీ బృందా` నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన తర్వాత కనుమరుగైంది.
By: Tupaki Desk | 13 March 2025 8:00 PM ISTఉత్తర మద్రాసులో మొట్టమొదటి ఎయిర్ కండిషన్డ్ సినిమా థియేటర్ అయిన `శ్రీ బృందా` నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన తర్వాత కనుమరుగైంది. దీనిని నిన్నటితో కూల్చి వేసారు. పెరంబూరులోని ఈ ప్రత్యేకత కలిగిన థియేటర్ లో సోమవారం రాత్రి తమిళ చిత్రం `డ్రాగన్`ని చివరిగా ప్రదర్శించారు. ఇది నగర సినిమా చరిత్రలో ఒక శకానికి ముగింపు. మద్రాసులో తొలి ఏసీ సినిమా హాల్ లో 1,170 సీట్లతో ఫిల్మ్ రీల్స్ రోజుల నుండి డిజిటల్ యుగం వరకు తమిళ సినిమా పరిణామాన్ని చూసింది.
ఈ థియేటర్‌తో రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ హీరోలకు ఉన్న అనుబంధం కూడా ఎంతో గొప్పది. థియేటర్ ని కూల్చి వేసాక.. ఈ ప్రయాణం ముగియడం చూడటం భావోద్వేగంగా ఉందని 1985 నుండి థియేటర్‌తో అనుబంధం ఉన్న పన్నీర్‌సెల్వం అన్నారు. ఈ థియేటర్ ప్రారంభమైన పది రోజుల తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. నేను రజనీకాంత్, కమల్ హాసన్ ఇతరులతో మాట్లాడాను! అని ఆయన గుర్తుచేసుకున్నారు.
భారీ మైదానంలో విస్తరించి ఉన్న శ్రీ బృందా థియేటర్‌ను లోగనాథన్ చెట్టియార్ స్థాపించారు. 14 ఏప్రిల్ 1985న రజనీకాంత్ ప్రారంభించారు. దీనిలో సూపర్‌స్టార్ రజనీ సినిమాలన్నింటినీ ప్రదర్శించినందున దీనిని రజనీ థియేటర్ అని పిలుస్తారు. మోహన్ - లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన `ఉదయగీతం` చిత్రంతో థియేటర్ ప్రారంభమైంది. నాన్ సిగప్పు మనిధన్, మాప్పిళ్ళై (ఇది 244 డేస్ ఆడింది), పాండియన్ (174 రోజులు), అన్నామలై (150 రోజులు) వంటి లెక్కలేనన్ని బ్లాక్‌బస్టర్‌లను ఈ థియేటర్ లో ప్రదర్శించారు.
సినిమాస్కోప్ నుండి డిజిటల్ ప్రొజెక్షన్‌కు మారడాన్ని మేము చూశాము! అని థియేటర్ లో పని చేస్తున్న 70 ఏళ్ల ఆపరేటర్ ఎం. కనకరాజ్ గుర్తుచేసుకున్నారు. అతడు రెండు దశాబ్దాలుగా అక్కడ పనిచేశాడు. కనగరాజ్ ప్రదర్శించిన మొదటి చిత్రం ప్రియముదన్. రజనీ సినిమా విడుదలల సమయంలో ఈ థియేటర్ లో పండుగ వాతావరణం కనిపించేది. ఈ డిజిటల్ యుగంలో సింగిల్ స్క్రీన్లను మూసి వేస్తున్నారు. మా కాలంలో ఉత్తర చెన్నై అంతటా ఈ థియేటర్ కు మంచి ఫ్లోటింగ్ ఉండేది. పెద్ద సినిమాల విడుదలల సమయంలో వాతావరణం వేడెక్కి ఉండేది. ఇక్కడ క్యాంటీన్‌లోని కాఫీ కూడా దశాబ్దం క్రితం వరకు చాలా పాపులర్ అని పన్నీర్‌సెల్వం గుర్తుచేసుకున్నారు. ఎట్టకేలకు రజనీ థియేటర్ ని కూల్చేసారు. అక్కడ మల్టీప్లెక్స్ కడతారా? లేక ఇంకేదైనా వ్యాపారమా? అనేది వేచి చూడాలి.