Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: త్రిష 'బృంద' ఎలా ఉందంటే?

ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్ మీద అలరించిన సౌత్ సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్.. ఇప్పుడు 'బృంద' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టింది.

By:  Tupaki Desk   |   3 Aug 2024 7:16 AM GMT
మినీ రివ్యూ: త్రిష బృంద ఎలా ఉందంటే?
X

ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్ మీద అలరించిన సౌత్ సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్.. ఇప్పుడు 'బృంద' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టింది. సూర్య మనోజ్‌ వంగల ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ను రూపొందించారు. ఇందులో త్రిషతో పాటుగా ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోనీ లివ్‌ ఓటీటీ వేదికగా 8 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.

'బృంద' కథేంటంటే.. బృంద (త్రిష) నిద్రలేమితో బాధపపడే ఓ పోలీస్ ఇన్స్పెక్టర్. హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో కొత్తగా జాయిన్ అయిన ఆమెను, మహిళ అనే కారణం చేత తోటి పోలీసులు చిన్నచూపు చూస్తుంటారు. అయినా సరే అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఒక చెరువులో ఓ మృతదేహం కనిపించగా.. అందరూ దాన్ని ఆత్మహత్యగా భావిస్తారు. కానీ బృందం మాత్రం అది హత్యగా అనుమానిస్తుంది. పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ చూసిన తర్వాత అదే విషయం నిర్ధారణ అవుతుంది. అయితే కేసును క్లోజ్ చేయమని పైఅధికారుల నుంచి ఆమెపై ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ బృంద తన బృందంతో కలిసి మర్డర్ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. ఇన్వెస్టిగేషన్‌ లో దిగ్భ్రాంతికి గురి చేసే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. దీంతో ఉన్నతాధికారులు బృందతో కలిపి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్ ని ఏర్పాటు చేస్తారు. బృంద ఈ కేసుని ఎలా దర్యాప్తు చేసింది? ఆ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేసారు? హంతకుడిని ఎలా పట్టుకున్నారు? అనేది ఈ కథ.

ఓటీటీలో ఈ మధ్య కాలంలో ఏ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ తీసుకున్నా.. మర్డర్ మిస్టరీ, సీరియల్ కిల్లర్ హత్యలు చేయడం, అతన్ని పట్టుకోడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఒక్కొక్క ట్విస్ట్ ను రివీల్ చేసుకుంటూ ఇంట్రెస్టింగ్ గా థ్రిల్ కు గురి చేసేలా కథనం నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు 'బృంద' వెబ్ సిరీస్ కూడా ఇలానే సాగింది. స్టోరీ పరంగా చూసుకుంటే రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అయినా.. దాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠకు గురి చేసే స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు. దీనికి త్రిష లాంటి స్టార్ హీరోయిన్ యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది.

బృంద గతానికి సంబంధించిన విషయాలను, ప్రస్తుతం మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌ కు ముడిపెడుతూ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి వరకూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ ను నడిపించారు. కథతో పాటుగా మూఢనమ్మకాలు, మనుషులపై వాటి దుష్ప్రభావాలు, తల్లిదండ్రుల ప్రవర్తన, సమాజంలో వర్కింగ్ ఉమెన్స్ ఎదుర్కొంటున్న వివక్ష వంటి అంశాలను ఈ సిరీస్ లో అంతర్లీనంగా చర్చించారు. కాకపోతే ఇన్వెస్టిగేషన్‌ పేరుతో సిరీస్‌ ని కాస్త సాగదీశారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే హంతకుడు ఎవరో కనిపెట్టిన తర్వాత కథనం వేగం పుంజుకుంటుంది. అది చివర వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయినప్పటికీ ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు, అభ్యంతరకరమైన సంభాషణలు లేకుండా రూపొందించడం 'బృంద' సిరీస్ ప్రత్యేకత. ఇందులో మర్డర్ మిస్టరీని ఛేదించే తెలివైన పోలీస్‌ ఆఫీసర్‌ గా, ఆత్మగౌరవం కలిగిన మహిళగా త్రిష చక్కగా నటించింది. ఇది ఆమెకు ఓటీటీలో మంచి డెబ్యూ అని చెప్పాలి. ఆనందసామి నటన హైలైట్ గా నిలుస్తుంది. ఇంద్రజీత్‌, రవీంద్ర విజయ్‌, ఆమనీ, రాకేందు మౌళి తమ పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఓవరాల్ గా కథ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రధాన పాత్రధారుల నటన ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. నిడివి కాస్త ఎక్కువైనప్పటికీ వీకెండ్ లో ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో 'బృంద' సిరీస్ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.