Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : బ్రో

రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలతో పలకరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్.. భీమ్లా నాయక్ తర్వాత ఆయన నటించిన ‘బ్రో’ కూాడా రీమేకే.

By:  Tupaki Desk   |   28 July 2023 6:05 AM GMT
మూవీ రివ్యూ : బ్రో
X

'బ్రో' మూవీ రివ్యూ

నటీనటులు: సాయి తేజ్-పవన్ కళ్యాణ్-కేతిక శర్మ-రోహిణి-ప్రియ ప్రకాష్ వారియర్-తనికెళ్ల భరణి-వెన్నెల కిషోర్-రాజా చెంబోలు తదితరులు

సంగీతం: తమన్

ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్

స్క్రీన్ ప్లే-మాటలు: త్రివిక్రమ్

నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్

కథ-దర్శకత్వం: సముద్రఖని


రీఎంట్రీలో వరుసగా రీమేక్ సినిమాలతో పలకరిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్.. భీమ్లా నాయక్ తర్వాత ఆయన నటించిన 'బ్రో' కూాడా రీమేకే. తన మేనల్లుడు సాయి తేజ్ తో పవన్ తొలిసారి కలిసి నటించిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.



కథ:


మార్కండేయులు అలియాస్ మార్క్ (సాయి తేజ్) ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉన్నతోద్యోగి. తాను లేకపోతే ఆ కంపెనీనే లేదు అనుకునే మార్క్.. ఇంట్లో తల్లితో పాటు తన ఇద్దరు చెల్లెళ్లు.. ఫారిన్లో ఉండే తమ్ముడు.. ఇలా అందరికీ తనే దిక్కు అనుకుంటాడు. అందరూ తన మాటే వినాలంటాడు. తాను లేకుండా వీళ్లెవ్వరికీ జీవితమే లేదనుకుంటాడు. వీరితో పాటు తన ప్రేయసికి కూడా టైం ఇవ్వకుండా బిజీ బిజీగా గడిపేస్తున్న మార్క్.. ఒక కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడే అతడికి కాల దేవుడు (పవన్ కళ్యాణ్) పరిచయమవుతాడు. తాను లేకుంటే కుటుంబం.. కంపెనీ ఏమవుతుందో అని కంగారు పడే అతడికి.. మళ్లీ ఇంకో అవకాశం ఇస్తాడు కాల దేవుడు. 90 రోజుల రెండో జీవితం మొదలుపెట్టిన అతడికి తన ప్రపంచం కొత్తగా పరిచయం అవుతుంది. ఈ క్రమంలో అతను తెలుసుకున్న జీవిత సారం ఏంటన్నదే మిగతా కథ.


కథనం-విశ్లేషణ:


'అజ్ఞాతవాసి'తో అభిమానులకు.. ప్రేక్షకులకు పెద్ద షాకిచ్చి సినిమాల నుంచి నిష్క్రమించాడు పవన్ కళ్యాణ్. రెండేళ్ల తర్వాత ఆయన రీఎంట్రీ ఇస్తూ చేసిన 'వకీల్ సాబ్' సినిమా హిందీ 'పింక్'కు రీమేక్. ఆ తర్వాత ఆయన్నుంచి వచ్చిన 'భీమ్లా నాయక్' మలయాళ చిత్రం 'అయ్యప్పనుం కోషీయుం' ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు రీఎంట్రీలో ఆయన్నుంచి వచ్చిన మూడో చిత్రం 'వినోదియ సిత్తం' అనే తమిళ సినిమాకు రీమేక్. కొంచెం క్లాస్ టచ్ తో సాగే.. వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుని.. వాటికి ఎంటర్టైన్మెంట్ పూత పూసి.. పవన్ అభిమానులు ఆశించే మాస్ మూమెంట్స్ జోడించి.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే 'వకీల్ సాబ్'.. 'భీమ్లా నాయక్' చిత్రాలను తీర్చిదిద్దారు వాటి మేకర్స్. ఇప్పుడు 'బ్రో' సైతం అచ్చంగా అలాంటి ప్రయత్నమే. 'వినోదియ సిత్తం' మంచి సినిమానే కానీ.. చాలామందికి అదొక ప్రవచనం లాగా అనిపిస్తే ఆశ్చర్యం లేదు. సందేశంతో ముడిపడ్డ ఆ కథకు వినోదపు పూత పూసి.. పవన్ కళ్యాణ్ మార్కు మూమెంట్స్ జోడించి ప్రేక్షకులకు అందించింది 'బ్రో' టీం. మాతృకతో పోలిస్తే ఇందులో ఎమోషనల్ డెప్త్ తగ్గినట్లు అనిపించినా.. ఎంటర్టైన్మెంట్ విషయంలో దీనికి మార్కులు పడతాయి.


పవన్ కళ్యాణ్ దేవుడి పాత్ర చేయడం కొత్తేమీ కాదు. 'గోపాల గోపాల'లో ఇప్పటికే ఆయన్ని దేవుడిగా చూశాం. అందులో ఒక సామాన్యుడి వెంటే ఉంటూ తనను ముందుకు నడిపించే పాత్రలో కనిపించాడు పవన్. 'బ్రో'కు ఈ విషయంలో చాలా సారూప్యతలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక వ్యక్తి వెంటే ఉంటూ తనకు జీవిత సారాన్ని ప్రభోదించే పాత్రలో కనిపిస్తాడు పవన్. కాకపోతే ఈసారి పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన పాత్రను తీర్చిదిద్దారు. దేవుడి పాత్ర కదా అని దాన్ని పద్ధతిగా.. కుదురుగా చూపించకుండా.. అల్లరల్లరిగా ప్రెజెంట్ చేయడం విశేషం. అలా అని ఆ పాత్ర ఔచిత్యం కూడా దెబ్బ తినలేదు. పవన్ సూపర్ హిట్ సినిమాల్లోని పాటలు.. మేనరిజమ్స్ జోడించి ఈ క్యారెక్టర్ని అభిమానులు మెచ్చేలా తీర్చిదిద్దారు. పవన్ తనను తాను ఇమిటేట్ చేస్తుంటే.. తన పాత పాటలకు స్టెప్పులేస్తుంటే అభిమానులకు అంతకంటే ఉత్సాహం ఏముంది? ఒక రకంగా తన అభిమానులను అలరించడానికే పవన్ ఈ సినిమా చేసినట్లు కూడా అనిపిస్తుంది.


ఇక కథాకథనాల విషయానికి వస్తే.. ఇందులో గొప్ప మలుపులు.. షాకులు... సర్ప్రైజులు ఏమీ ఉండవు. ఇదొక సింపుల్ కథ. ఈ లోకంలోకి అతిథిలా వచ్చాం.. ఇక్కడున్న వనరులన్నీ ఉపయోగించుకుని.. ఉన్న సమయాన్ని ఆస్వాదించి.. అతిథిలాగే వెళ్లిపోవాలి. ఏదీ మన సొంతం కాదు. మనం దేన్నీ నియంత్రించలేం. మనం ఉన్నా లేకపోయినా.. మారేదేమీ లేదు.. ఈ పాఠాన్ని సుగర్ కోటెడ్ స్టయిల్లో చెప్పే సినిమానే 'బ్రో'. అంతా తానే అనుకునే ఓ కుర్రాడు.. తన జీవితంలో దొరికిన సెకండ్ ఛాన్స్ లో తనో నిమిత్తమాత్రుడిని అని తెలుసుకునే ప్రయాణమే ఈ చిత్రం. సినిమా మొదలైన తీరు చూస్తేనే.. ఇది ఎలా నడవబోతున్నది.. ఎలా ముగియబోతున్నది అర్థమైపోతుంది. ఐతే తెలిసిన సన్నివేశాలనే.. వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ బాధ్యత అంతా పవనే తీసుకున్నాడు. మామూలు సన్నివేశాల్లోనూ ఆయన ఒక కొసమెరుపులా కనిపిస్తాడు. పవన్ ఎంట్రీ ఇచ్చే వరకు 'బ్రో' చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఆయన ఎంట్రీతోనే ఉత్సాహం వస్తుంది. విషాదాంతం అయ్యే యాక్సిడెంట్ సన్నివేశాన్ని రీక్రియేట్ చేస్తూ.. తేజు 'ఇంకో ఛాన్స్' తీసుకునే సన్నివేశాలు మంచి వినోదం పంచుతాయి. ఆ తర్వాత కూడా కథనం చకచకా సాగిపోతుంది. ప్రథమార్ధం తక్కువ నిడివితో చకచకా సాగిపోతుంది.


ద్వితీయార్ధంలో ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గించి.. ఎమోషన్ల మీద దృష్టిపెట్టాడు దర్శకుడు. ఐతే హీరో సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అయిపోయే క్రమం రొటీన్ అనిపిస్తుంది. ఆఫీస్ సీన్లు అయితే సిల్లీగా అనిపిస్తాయి. హీరో ఇంట్లో సమస్యలు కూడా నాటకీయ రీతిలో పరిష్కారం అయిపోతాయి. హీరోయిన్ ట్రాక్ కూడా తేలిపోయింది. ద్వితీయార్దంలో తొలి అరగంట సినిమా గ్రాఫ్ ను తగ్గిస్తుంది. ఐతే చివరి అరగంటలో మాత్రం చెప్పాలనుకున్న విషయాన్ని బలంగానే చెప్పారు. మనిషి ఈ భూమ్మీదికి అతిథిలా వచ్చి అతిథిలా వెళ్లిపోవాలనే విషయాన్ని అర్థవంతంగా.. మంచి డైలాగులతో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక్కడే త్రివిక్రమ్ మార్కు కనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు పండాయి. 'బ్రో'ను ఒక పకడ్బందీ సినిమాగా చెప్పలేం. ఇందులో కొత్తగా అనిపించే విషయాలు కూడా ఏమీ లేవు. కానీ రెండుంబావు గంటల నిడివిలో సినిమా ఎక్కడా ఆగకుండా సాగిపోతుంది. కొన్ని సన్నివేశాల్లో మినహా బోర్ కొట్టించదు. పవన్ అభిమానులను సంతృప్తి పరిచే మూమెంట్స్ ఉన్నాయి. సగటు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యే ఎంటర్టైన్మెంట్.. ఎమోషన్లు దీనికి ప్లస్. టైంపాస్ వినోదానికి ఢోకా లేని సినిమా ఇది.


నటీనటులు:


'బ్రో'కి పవన్ కళ్యాణే ప్రధాన ఆకర్షణ. పవన్ ను తీసేసి చూస్తే ఈ సినిమా సాధారణంగా అనిపిస్తుంది. చూడ్డానికి అతిథి పాత్రలా కనిపించినా.. సినిమాలో మేజర్ పార్ట్ ఆ క్యారెక్టర్ ఉంటుంది. చేసింది దేవుడి పాత్రే అయినా తన ట్రేడ్ మార్క్ స్టైల్స్ తో పవన్ ఆకట్టుకున్నాడు. ఈ పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపిస్తాడు. పవన్ కనిపించే ప్రతి సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంటుంది. సాయి తేజ్ పెర్ఫామెన్స్ ఓకే. యాక్సిడెంట్ తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతుండటం వల్ల తన లుక్స్.. బాడీ లాంగ్వేజ్.. ఎనర్జీ మునుపటి స్థాయిలో లేవు. ఐతే 'బ్రో' కథ కూడా యాక్సిడెంట్.. సెకండ్ లైఫ్ నేపథ్యంలో సాగేదే కావడం వల్ల తన పాత్రతో కనెక్ట్ కాగలుగుతాం. ఈ కోణంలో తేజు ఈ పాత్రకు రైట్ ఛాయిస్ అనిపిస్తాడు. హీరోయిన్ కేతిక శర్మ మామూలుగా అనిపిస్తుంది. హీరో తల్లి పాత్రలో రోహిణి చాలా బాగా నటించింది. ఆమెకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. బాస్ పాత్రలో వెన్నెల కిషోర్ కు లిమిటెడ్ రోల్ దక్కింది. తన మార్కులు నవ్వులు మిస్ అయ్యాయి. ప్రియ ప్రకాష్ వారియర్ బాగానే చేసింది. రాజా చెంబోలు కూడా ఓకే.


సాంకేతిక వర్గం:


తమన్ పాటల పరంగా కొంత నిరాశ పరిచాడు. 'బ్రో' శ్లోకం మినహా పాటలు సోసోగా అనిపిస్తాయి. ఐతే నేపథ్య సంగీతంతో సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో తమన్ ముఖ్య పాత్ర పోషించాడు. పవన్ తో ముడిపడ్డ చాలా సన్నివేశాల్లో తమన్ ఆర్ఆర్ మంచి ఎనర్జీని ఇస్తుంది. సుజీత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సాధారణంగా అనిపిస్తాయి. పవన్ సినిమా రేంజిలో క్వాలిటీ కనిపించలేదు. స్క్రీన్ ప్లే.. మాటల్లో త్రివిక్రమ్ కొన్ని చోట్ల తన మార్కు చూపించాడు. కాలం విలువను చెప్పే.. జీవిత సారాన్ని ప్రభోదించే మాటల్లో త్రివిక్రమ్ వినిపిస్తాడు. కానీ ఓవరాల్ గా చూస్తే త్రివిక్రమ్ నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశిస్తారు. దర్శకుడిగా సముద్రఖని పనితనం ఓకే. అతను ఎంచుకున్న కాన్సెప్ట్ యూనివర్శల్ అప్పీల్ ఉన్నది. ఐతే ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే మలుపులేమీ ఈ కథలో లేవు. నరేషన్ కూడా చాలా వరకు ఫ్లాట్ గా సాగిపోతుంది.


చివరగా: బ్రో.. సందేశానికి వినోదపు పూత


రేటింగ్ - 2.75/5