మహేష్‌తో రాజమౌళి సినిమా మరో స్థాయికి చేర్చాలి: పవన్ కల్యాణ్
ఇదే సందర్భంలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రస్థావిస్తూ
By: Tupaki Desk | 26 July 2023 5:17 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీలున్న ప్రతి వేదికపైనా తన సహచర నటుల గురించి చేసే వ్యాఖ్యలు సంచలనంగా మారుతుంటాయి. ఇంతకుముందు మహేష్ - ప్రభాస్ తనకంటే పెద్ద స్టార్లు అని బాహాటంగా వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లినా టాలీవుడ్ అగ్రహీరోగానే ఇప్పటికీ నీరాజనాలు అందుకుంటున్నారు. ఒక స్టార్ గా ఎంతో నిజాయితీని ప్రదర్శిస్తూ ప్రజల నుంచి అపారమైన ప్రేమాభిమానాలను దక్కించుకుంటున్నారు.
అతడు తన స్థాయి ఎంతమాత్రం తగ్గకపోయినా ఎంతో ఒదిగి ఉండే స్వభావంతో సహచర హీరోల ఎదుగుదలను ఆకాంక్షించడం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్.. చరణ్ సహా ప్రభాస్ మహేష్ లాంటి స్టార్లను గొప్పగా ప్రశంసల్లో ముంచెత్తారు. తాజాగా 'బ్రో' ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
జూనియర్ ఎన్టీఆర్ గారిలా.. రామ్ చరణ్ లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు. ప్రభాస్ గారిలా... రానా గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు.. అని తాజా ఈవెంట్లో పవన్ వ్యాఖ్యానించారు. సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను.. ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోవద్దని సూచిస్తానని పవన్ అన్నారు. మనం కష్టపడి పనిచేద్దామని చెబుతాను. ''మేం గొడ్డుచాకిరి చేస్తాం.. దెబ్బలు తగిలించుకుంటాం.. కడుపులు మాడ్చుకుంటాం.. నష్టాలు వస్తే తీసుకుంటాం. సినిమాల ద్వారా అందరినీ ఆనందింపజేయడం కోసం నిరంతరం ప్రయత్నిస్తాం'' అని అన్నారు.
ఇదే సందర్భంలో దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రస్థావిస్తూ ''ఆయన మన పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారితో ఆయన చేసే సినిమా మన స్థాయిని మరింత పెంచాలి. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలి...'' అని పవన్ వ్యాఖ్యానించారు. రాజమౌళికి విషెస్ చెబుతూనే తన స్పీచ్ ఆద్యంతం ఇతర హీరోలపై స్ఫూర్తిదాయకమైన స్పీచ్ తో అలరించారు. నాకు అందరూ హీరోలు ఇష్టం. వారివల్ల ఎందరికో కడుపు నిండుతుంది.
అందరూ బాగుండాలని కోరుకుంటూనే.. మనం పెద్ద హిట్ కొట్టాలని కసిగా పనిచేయాలి... అప్పుడే పరిశ్రమ బాగుంటుంది'' అని అన్నారు. సాయిధరమ్- పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రో ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.