Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : బడ్డీ

ఓ మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు అల్లు శిరీష్. చివరగా ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో పలకరించాడతను.

By:  Tupaki Desk   |   2 Aug 2024 9:27 AM GMT
మూవీ రివ్యూ : బడ్డీ
X

'బడ్డీ' మూవీ రివ్యూ

నటీనటులు: అల్లు శిరీష్-గాయత్రి భరద్వాజ్-అజ్మల్ అమీర్-ముకేష్ రుషి-రవిప్రకాష్ తదితరులు

సంగీతం: హిప్ హాప్ తమిళ

ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్

రచన: సాయి హేమంత్

నిర్మాత: జ్ఞానవేల్ రాజా

స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శామ్ ఆంటన్

ఓ మంచి హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు అల్లు శిరీష్. చివరగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో పలకరించాడతను. అది ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు శిరీష్ నుంచి 'బడ్డీ' సినిమా వచ్చింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. ప్రొఫెషన్లో అతడికి చాలా మంచి పేరుంటుంది. ఎయిర్ పోర్టులో ఏటీసీగా కొత్తగా చేరిన ప్రియ (గాయత్రి భరద్వాజ్)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. వృత్తిపరంగా తనకు ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచిన ఆదిత్యతో ప్రియ ప్రేమలో పడుతుంది. ప్రియను చూడకుండానే ఆదిత్య ఇష్టపడతాడు. కానీ అతణ్ని ఆమె చూస్తుంది. మంచి సందర్భంలో తనను కలవాలనుకుంటుంది. ఈలోపు ఒక మెడికల్ మాఫియా వలలో ప్రియ చిక్కుకుని కోమాలోకి వెళ్లిపోతుంది. ఆ స్థితిలో ఆదిత్య ఒకప్పుడు బహుమతిగా ఇచ్చిన టెడ్డీ బేర్లోకి ప్రియ ఆత్మ వెళ్తుంది. ఆ తర్వాత ఈ టెడ్డీ బేర్.. ఆదిత్యతో స్నేహం చేసి ప్రియను కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నం ఎంతమేర సఫలమైంది.. ఇంతకీ మెడికల్ మాఫియా చేస్తున్న స్కామ్ ఏంటి.. ప్రియ బాడీతో వాళ్లు ఏం చేయాలనుకున్నారు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ఒక మనిషి ఆత్మ మరో వ్యక్తి శరీరంలోకి వెళ్లి తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే ఫాంటసీ సినిమాలు ఇండియాలో వందల సంఖ్యలో వచ్చాయి. నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను ఇలా తెర మీద చూపిస్తే ప్రేక్షకులకు గమ్మత్తుగా అనిపిస్తుంది. అందుకే ఫాంటసీ సినిమాల సక్సెస్ రేట్ బాగుంటుంది. ఐతే ఫాంటసీ కథ అనగానే లాజిక్ గురించి ఎక్కువ పట్టించకోకూడదు అనేది వాస్తవమే అయినా.. ఈ విషయాన్ని మరీ తేలిగ్గా తీసుకుని కథను.. పాత్రల్ని ఎలా పడితే అలా నడిపిస్తే మొత్తం వ్యవహారం సిల్లీగా మారుతుంది. 'బడ్డీ' సినిమా అంతటా అలాంటి సిల్లీనెసే కనిపిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయాక ఆత్మ మరొకరిలోకి వెళ్లడం అంటే మనకు అలవాటే కానీ.. ఓ వ్యక్తి కోమాలోకి వెళ్లగానే ఆత్మ బయటికి వచ్చి మరో వ్యక్తిలోకి చేరడం లాజికల్ గా అనిపించదు. 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో ఇలాంటి పాయింటే చూపిస్తే ప్రేక్షకులకు రుచించలేదు. మళ్లీ 'బడ్డీ'లో అదే ట్రై చేశారు. చేస్తే చేశారు కానీ.. ఒక ఆత్మ టెడ్డీ బేర్లోకి వచ్చి ఆ బొమ్మ మామూలు మనిషిలాగే తిరిగేస్తుంటే.. మాట్లాడేస్తుంటే హీరో సహా చుట్టూ ఉన్న వాళ్లెవ్వరూ పెద్దగా ఆశ్చర్యపడకపోవడం.. అందరూ దాంతో నార్మల్ గా వ్యవహరించడమే విడ్డూరంగా అనిపిస్తుంది. దీని వల్ల క్యూరియాసిటీ పెంచాల్సిన సీన్లన్నీ కూడా తేలిపోయాయి. ఇక హీరోకు.. ఈ బొమ్మకు మధ్య ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలోనూ దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. దాని వల్ల 'బడ్డీ' ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది.

టెడ్డీబేర్లోకి మనిషి ఆత్మ వెళ్లడం.. అది రకరకాల విన్యాసాలు చేయడం అన్నది గమ్మత్తుగా అనిపించే విషయం. 'ఈగ' సినిమాలో మనిషి ఆత్మ ఈగలోకి వెళ్లడం.. దాని తర్వాత పరిణామాలను రాజమౌళి అద్భుతంగా చూపించాడు. ఈగ రంగప్రవేశానికి ముందే హీరో పాత్రతో ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరుస్తాడు. ఆ పాత్ర చనిపోతుంటే గుండె కలుక్కుమంటుంది. తర్వాత ఈగలోకి హీరో ఆత్మ వచ్చిన దగ్గర్నుంచి ప్రతి సన్నివేశంలో క్యూరియాసిటీ కలిగిస్తూ.. ఈ ఈగ ఎలా సర్వైవ్ అవుతుంది.. తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంటుంది అన్నది నోరెళ్లబెట్టి చూసేలా తెరపై ప్రెజెంట్ చేశాడు జక్కన్న. బడ్డీలో 'ఈగ' స్థానంలోకి టెడ్డీ బేర్ వచ్చింది. కానీ ఈ పాత్రతో కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. అంతకంటే ముందు ఆ బొమ్మలోకి వచ్చిన చేరిన ఆత్మకు చెందిన హీరోయిన్ పాత్ర అయితే మరీ పేలవం. హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు మొదలుకుని.. ప్రతి సీన్ బోరింగా అనిపిస్తుంది. ఒక క్రిటికల్ సిచువేషన్లో తనకు సాయం చేశాడని హీరోయిన్ హీరోతో ప్రేమలో పడిపోవడం వరకు ఓకే. కానీ హీరో హీరోయిన్ని కనీసం చూడకుండానే ఎందుకు ప్రేమిస్తాడో అర్థం కాదు. తాను ప్రేమించిన అమ్మాయిని కనీసం కలవడానికి కూడా అతను ప్రయత్నించడు. కేవలం ఫోన్లో మాట్లాడుతూ తన కోసం ఏమైనా చేసేస్తానంటాడు. ఈ రోజుల్లో ఇలాంటి లవ్ ట్రాక్ రాయడం ఈ దర్శకుడికే చెల్లింది.

తనది కాని ప్రతీకారాన్ని లేదా.. లక్ష్యాన్ని హీరో తీసుకునే సినిమాలేవీ కూడా ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని కలిగించవు. 'బడ్డీ'లో అయితే మరీ విడ్డూరంగా ఒక టెడ్డీ బేర్ కోసం హీరో ప్రాణాల మీదికి తెచ్చుకుని ఎన్నో సాహసాలు చేసేస్తుంటాడు. పోనీ ఆ బొమ్మలో ఉన్నది తాను ప్రేమించిన అమ్మాయి ఆత్మే అని అయినా తనకు తెలుస్తుందా అంటే అదీ కాదు. మరి ఎందుకు అతను దేశాలు దాటి ప్రమాదకర విన్యాసాలు చేస్తాడో? సినిమాలో అంతో ఇంతో ఆసక్తి రేకెత్తేంచేదంగటే టెడ్డీ బేర్ క్యారెక్టరే. జై బాలయ్య అంటూ భారీ మెషీన్ గన్ను పేల్చే సన్నివేశం ఒకటి సినిమాలో కొంచెం పేలింది. అక్కడ మాత్రమే ప్రేక్షకుల్లో కొంచెం హుషారు పుడుతుంది. ఇది కాక టెడ్డీ బేర్ నాటు నాటు డ్యాన్స్ చేయడం లాంటి కొన్ని సీన్లు పర్వాలేదనిపిస్తాయి. కానీ బేసిగ్గా కథలో మాత్రం ఏ విశేషం లేదు. ప్రమాదకర ప్రయోగాలు చేసే మెడికల్ మాఫియా చుట్టూ బోలెడన్ని కథలు చూశాం ఇలాంటివి. హీరో హీరోయిన్లతో పాటు విలన్ పాత్రలోనూ విశేషం కనిపించకపోవడంతో ఏదో సినిమా నడుస్తుంటుందే తప్ప.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి మాత్రం ఏ దశలోనూ ప్రేక్షకుల్లో కలగదు. దీంతో పోలిస్తే 'టెడ్డీ' పేరుతో వచ్చిన తమిళ ఒరిజనలే చాలా బెటర్ గా అనిపిస్తుంది. రీమేక్ కాని రీమేక్ లా దీన్ని తీర్చిదిద్దిన తమిళ దర్శకుడు శామ్ ఆంటన్ మన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు.

నటీనటులు:

తన చివరి చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'లో మంచి హుషారైన పాత్రలో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. కానీ 'బడ్డీ'లో అతను ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది. చాలా వరకు ముభావంగా కనిపించే పాత్రలో శిరీష్ డల్లుగా కనిపించాడు. పెద్దగా హావభావాలు పలికించలేకపోయాడు. ఓవరాల్ గా తన పాత్ర కూడా అంత ఎగ్జైట్మెంట్ కలిగించేలా లేదు. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ కు కథలో కీలక పాత్రే దక్కినా.. ఆమె తనదైన ముద్ర వేయలేకపోయింది. తన లుక్స్ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉన్నాయి. తొలి అరగంట తర్వాత కథ ప్రకారం ఆమె పాత్ర సైడ్ అయిపోయింది. హీరోయిన్ కంటే ఇంకో సైడ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఆకర్షణీయంగా కనిపించింది.

విలన్ అజ్మల్ అమీర్ బాగానే చేశాడు. ముకేష్ తనకు అలవాటైన పాత్రలకు భిన్నంగా కనిపించాడిందులో. కామెడీ టచ్ ఉన్న తన పాత్ర పర్వాలేదు. ఆలీ ద్వితీయార్ధంలో ఎంట్రీ ఇచ్చి నవ్వించడానికి ట్రై చేశాడు కానీ.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

సాంకేతిక వర్గం:

తమిళంలో మంచి పేరున్న హిప్ హాప్ తమిళ.. తెలుగులో ఇప్పటిదాకా తనదైన ముద్ర వేయలేకపోయాడు. 'బడ్డీ' కూడా తన ప్రత్యేకతను చాటలేకపోయింది. పాటలు ఒక్కటీ రిజిస్టర్ కావు. రెండు పాటలైతే మరీ విసిగిస్తాయి. నేపథ్య సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం చాలా డల్లుగా అనిపిస్తుంది. తెరంతా మసకబారినట్లుగా విజువల్స్ సాగాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సాధారణంగా అనిపిస్తాయి. తమిళంలో నిర్మాతగా మంచి పేరుండి.. పెద్ద పెద్ద సినిమాలు తీసే జ్ఞానవేల్ రాజా ఈ సినిమా విషయంలో రాజీ పడ్డట్లున్నాడు. రైటర్ కమ్ డైరెక్టర్ శామ్ ఆంటన్ నిరాశపరిచాడు. హాలీవుడ్లో.. కోలీవుడ్లో తీసిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసే ప్రయత్నం ఏదో చేశాడు కానీ.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మినిమం ఎమోషన్ లేకుండా కథను.. పాత్రలను తీర్చిదిద్దడంతో 'బడ్డీ' ఏ కోశాన ప్రేక్షకులను ఎంగేజ్ చేయదు. రైటింగ్ దగ్గరే సినిమా తేలిపోయింది. టేకింగ్ కూడా గొప్పగా లేకపోవడంతో సినిమా సాధారణంగా తయారైంది.

చివరగా: బడ్డీ…నిరాశపరిచింది

రేటింగ్- 2.25/5