Begin typing your search above and press return to search.

బన్నీ - త్రివిక్రమ్.. బడ్జెట్ పుష్ప కంటే ఎక్కువగానే..

అయితే నాగవంశీ వ్యాఖ్యల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు ఎలాంటి కథ రాస్తున్నారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 12:03 PM GMT
బన్నీ - త్రివిక్రమ్.. బడ్జెట్ పుష్ప కంటే ఎక్కువగానే..
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు గాను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిలీజ్ కు మరో 50 రోజులు ఉండగా.. నేడు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో బన్నీ.. పుష్పరాజ్ గా సీరియస్ మోడ్ లో కనిపించారు.

అయితే పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తో సినిమా చేస్తారని చాలా నెలల క్రితమే అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ బోయపాటి, త్రివిక్రమ్, అట్లీ, సందీప్ రెడ్డి వంగాలో ఎవరో ఒకరితో బన్నీ వర్క్ చేస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూవీ విషయంపై నిర్మాత నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చారు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా తమ బ్యానర్ పై త్రివిక్రమ్ తో ఉంటుందని నాగవంశీ తెలిపారు.

బన్నీ కోసం పాన్ ఇండియా సబ్జెక్టును త్రివిక్రమ్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని, చాలా పెద్ద కథ అని తెలిపారు. భారీ పాన్ ఇండియా లెవెల్ లో మూవీ ఉంటుందని, కానీ ఏ జోనర్ అనేది త్రివిక్రమ్ ను అడగలేదని అన్నారు. అయితే నాగవంశీ వ్యాఖ్యల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు ఎలాంటి కథ రాస్తున్నారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.

అయితే అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా పీరియాడికల్ యాక్షన్ స్టోరీని త్రివిక్రమ్ సిద్ధం చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది. హిందూ పురాణాల నుంచి తీసుకున్న పలు అంశాలతో కథను రాసుకున్నట్లు సమాచారం. కెరీర్ లో తొలిసారి.. ఎక్కువగా వీఎఫ్ ఎక్స్ ను ఆయన యూజ్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తెరకెక్కించిన చిత్రాలు ఒకెత్తు... బన్నీ మూవీ మరో ఎత్తు అన్న విధంగా త్రివిక్రమ్ తీయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో భారీ బడ్జెట్ తో త్రివిక్రమ్.. బన్నీ మూవీని తెరకెక్కించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పుష్ప కన్నా ఎక్కువ బడ్జెట్ తో తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. పుష్ప బడ్జెట్ రూ.300 కోట్లు అని తెలుస్తుండగా.. అంత కన్నా ఎక్కువ వ్యయంతో రూపొందించనున్నట్లు వినికిడి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తోపాటు గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో భాగమవ్వనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్, బన్నీ ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలకు గాను వర్క్ చేశారు. బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి కలిసి సినిమా చేయబోతున్నారు.