Begin typing your search above and press return to search.

గేమ్ ఛేంజర్ పైరసీ కల్లోలంపై బన్నీ వాస్ ఏమన్నారంటే..

ఈ మధ్య కాలంలో విడుదలైన డాకు మహారాజ్, పుష్ప 2 సినిమాలు సైతం పైరసీ బారిన పడటం మరో దెబ్బ.

By:  Tupaki Desk   |   5 Feb 2025 11:24 AM GMT
గేమ్ ఛేంజర్ పైరసీ కల్లోలంపై బన్నీ వాస్ ఏమన్నారంటే..
X

సినిమా పరిశ్రమలో పైరసీ అనేది ఎప్పటి నుంచో ఉన్న సమస్య. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, మొదటి రోజే HD ప్రింట్ పైరసీకి గురవ్వడం ఇండస్ట్రీలో పెద్ద షాక్ ఇచ్చింది. పైగా, రెండో వారంలోనే 4K క్వాలిటీతో మరో ప్రింట్ బయటకు రావడంతో సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా, పైరసీకి గురవ్వడం పరిశ్రమకు పెద్ద నష్టమే.

ఈ మధ్య కాలంలో విడుదలైన డాకు మహారాజ్, పుష్ప 2 సినిమాలు సైతం పైరసీ బారిన పడటం మరో దెబ్బ. అయితే, దీనిపై ఇప్పటి వరకు పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా తండేల్ నిర్మాత బన్నీ వాస్ ఈ సమస్యపై మాట్లాడడం, అందరూ ఆలోచించాల్సిన విషయాల్ని చెప్పడం వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమలో పైరసీని నియంత్రించేందుకు కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఇంతకు ముందు కాలంలో పైరసీ అంటే థియేటర్ ప్రింట్లు తీసి వాటిని వీడియో క్యాసెట్లు, సిడీల రూపంలో అమ్మడం మాత్రమే ఉండేది. కానీ, డిజిటల్ యుగంలో పరిస్థితి మారిపోయింది. నేరుగా వెబ్‌సైట్లలో సినిమాలు అప్లోడ్ చేయడం, వాటిని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించడం వల్ల ఈ సమస్య మరింత పెరిగింది. ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ కొత్త సినిమాలను త్వరగా స్ట్రీమింగ్ చేయడం వల్ల కొంత వరకు పైరసీ తగ్గినప్పటికీ, అది పూర్తిగా ఆగలేకపోతోంది.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో నేరుగా కొత్త సినిమాల లైవ్ స్ట్రీమింగ్‌ను కట్టడి చేయగలిగినా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా పైరసీ లింకులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. కేవలం కొన్ని క్లిక్‌లతోనే డౌన్‌లోడ్ చేసుకునేలా మారిపోవడంతో, సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్‌లో లభిస్తున్నాయి. దీనికి గట్టి కట్టుబాటు లేకుంటే పరిశ్రమకు తీరని నష్టం జరుగుతుందని బన్నీ వాస్ హెచ్చరించారు.

పైరసీని పూర్తిగా అరికట్టాలంటే, ప్రభుత్వ సహాయంతో పాటు టెక్నాలజీ కంపెనీలు కూడా ఇందులో ముందుకు రావాలని బన్నీ వాస్ సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్ యాజమాన్యాలకు ఇండస్ట్రీ నుంచి గైడ్‌లైన్స్ పంపించి, పైరసీని ప్రోత్సహించే అకౌంట్లను బ్లాక్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేసి, పైరసీకి పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెలియజేశారు.

సినీ పరిశ్రమలో పైరసీ పూర్తిగా రూపుమాపడం కష్టమైన పని అయినప్పటికీ, కొన్ని చర్యలు తీసుకుంటే కనీసం దానిని నియంత్రించడానికి అవకాశం ఉంటుందని బన్నీ వాస్ అభిప్రాయపడ్డారు. సినీ రంగానికి ప్రాణం పోసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు అందరూ కలిసికట్టుగా పైరసీని అరికట్టేందుకు పని చేయాలని సూచించారు. గేమ్ ఛేంజర్ లాంటి పెద్ద సినిమాలు ఇలా పైరసీ బారిన పడటం పరిశ్రమ మొత్తానికే హెచ్చరిక అని ఆయన అన్నారు.