అంత తేలిగ్గా వదిలిపెట్టం.. నిర్మాత వార్నింగ్!
చాలా కాలంగా తెలుగు సినీనిర్మాతలు పైరసీపై పోరాటం సాగిస్తున్నా దానిని ఆపడం సాధ్యపడటం లేదు. యథావిధిగా పైరసీపై పోరాటం కొనసాగుతూనే ఉంది
By: Tupaki Desk | 10 Feb 2025 4:33 AM GMTపైరసీ మాఫియా ఆగడాలకు అంతూ దరీ లేదు. ఇలా సినిమా థియేటర్లలో విడుదల కాగానే, అలా ఒరిజినల్ హెచ్.డి వీడియో ఆన్ లైన్‌లో ప్రత్యక్షమైపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది. పైరసీ కారణంగా టాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమలు దారుణంగా నష్టపోతున్నాయి. చాలా కాలంగా తెలుగు సినీనిర్మాతలు పైరసీపై పోరాటం సాగిస్తున్నా దానిని ఆపడం సాధ్యపడటం లేదు. యథావిధిగా పైరసీపై పోరాటం కొనసాగుతూనే ఉంది.
పుష్ప 2 , గేమ్ ఛేంజర్, పట్టుదల (విదాముయార్చి).. ఇలా ఇటీవల విడుదలైన అన్ని సినిమాలు ఆన్ లైన్ పైరసీ కారణంగా చాలా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి 7 థియేటర్లలో విడుదలైన తండేల్ కొన్ని గంటలకే పైరసీ వెబ్‌సైట్‌లలో లీక్ అవ్వడం చిత్రనిర్మాతలను కలవరపాటుకు గురి చేసింది. హెచ్.డి క్వాలిటీతో ఈ వీడియో అందుబాటులోకి వచ్చేయడంతో అందరూ షాక్ తిన్నారు. తండేల్- పలు ఆన్ లైన్ లింకుల్లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి రావడంపై ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
తండేల్ కి మంచి టాక్ రావడంతో జనం థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో పైరసీ పెను సమస్యగా మారింది. అయితే పైరసీ లీక్ పై చిత్ర నిర్మాత బన్ని వాసు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇది కావాలని చేసిన పనిలా ఉంది. కచ్ఛితంగా వారికి శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. కేవలం పైరసీ అప్ లోడ్ చేసిన వాళ్లే కాదు, డౌన్ లోడ్ చేసిన వాళ్లను విడిచిపెట్టమని బన్ని వాసు సీరియస్ అయ్యారు. గతంలో గీత గోవిందం పైరసీకారులపై కేసులు పెట్టాం. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటికి వస్తున్నారు. కేసుల నుంచి బయటపడటం అంత సులువేమీ కాదు.. అని బన్ని వాసు హెచ్చరించారు. గీతా ఆర్ట్స్ సినిమాలను పైరసీలో చూసేవాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టం! అప్ లోడ్ చేసినవారినే కాదు.. డౌన్ లోడ్ చేసినా వదిలి పెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాం. ఇకపై పూర్తిగా పైరసీపైనే దృష్టి పెడుతున్నామని బన్ని వాసు తెలిపారు.
అజిత్ నటించిన పట్టుదల చిత్రం కూడా ఫిబ్రవరి 7న విడుదలైంది మరియు ఆ చిత్రం కూడా సినిమాను లీక్ చేయవద్దని మేకర్స్ కోరినప్పటికీ పైరసీకి గురైంది. గతంలో రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఈ నిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో భారీ దెబ్బకు పైరసీ కారణమైంది. రూ.450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.155 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.