Begin typing your search above and press return to search.

అల్లు థియేటర్లు.. కల్కి వసూళ్లపై బన్నీ వాస్ క్లారిటీ!

'కల్కి 2898 AD' సినిమా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినప్పటికీ, తాను ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదని జీఏ2 పిక్చర్స్ నిర్మాత బన్నీ వాస్ ఇటీవలి ప్రెస్ మీట్ లో అన్నారు.

By:  Tupaki Desk   |   3 Aug 2024 4:42 AM GMT
అల్లు థియేటర్లు.. కల్కి వసూళ్లపై బన్నీ వాస్ క్లారిటీ!
X

'కల్కి 2898 AD' సినిమా రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినప్పటికీ, తాను ఊహించిన స్థాయిలో వసూళ్లు రాలేదని జీఏ2 పిక్చర్స్ నిర్మాత బన్నీ వాస్ ఇటీవలి ప్రెస్ మీట్ లో అన్నారు. అయితే నిర్మాత వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రాలేదని ఆయన కామెంట్స్ చేసినట్లుగా ప్రచారం చేసారు. ఇదే విషయం మీద బన్నీ వాసు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కల్కి కలెక్షన్స్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అర్థం అయ్యాయన్నారు.

'ఆయ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కల్కి' చూసినప్పుడు ఇలాంటి కంటెంట్ ఉన్న చిత్రానికి సుమారు 2000 కోట్ల రూపాయలు వసూళ్లు వస్తాయని తాను ఊహించానని చెప్పారు. కానీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదనే బాధతోనే మాట్లాడానని, కలెక్షన్స్ రాలేదనేది తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. ఆ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ కి, విజువల్స్ ని కలిపి చూస్తే రెండు వేల కోట్లకు పైగానే రావాలి కానీ, ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర అంత కలెక్షన్స్ రావడం లేదనేదే తన ఉద్దేశమని అన్నారు. కల్కి సినిమా మీద తనకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదని మెగా నిర్మాత స్పష్టం చేసారు.

'కల్కి 2898 AD' సినిమా మూడేళ్ళ కిందట వచ్చుంటే ఇప్పుడు చూస్తున్న కలెక్షన్లకు రెండింతలు వచ్చేవని, ఆ సినిమా అంత కెపాసిటీ ఉందని బన్నీ వాస్ 'ఆయ్' ప్రెస్ మీట్ లో అన్నారు. 30 శాతం మంది ఆడియన్స్ కల్కి సినిమాను ఓటీటీలో చూద్దాంలే అని థియేటర్లకు రాలేదని, ఇదివరకు అలా ఉండేది కాదని చెప్పారు. కల్కి సినిమా అంత పెద్ద హిట్టయినప్పటికీ, దానికి రావాల్సిన ఇన్కమ్ రాలేదనేది తన ఒపీనియన్ అని అన్నారు. ఈరోజుల్లో జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోతోందని, అందుకే కలెక్షన్లు తగ్గుతున్నాయని నిర్మాత విశ్లేషించారు. రాబోయే పెద్ద సినిమాలు కూడా రావాల్సిన దానికంటే 30-40 శాతం తక్కువ వసూళ్లే రావొచ్చని పేర్కొన్నారు. దీనిపై బన్నీ వాసు తాజాగా మరోసారి వివరణ ఇచ్చారు.

ఇదే ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ థియేటర్ల గురించి బన్నీ వాసు మాట్లాడారు. అల్లు అరవింద్ కి చాలా థియేటర్లు ఉన్నాయని అనుకుంటారు కానీ, నిజానికి ఆయనకున్నది హైదరాబాదులోని AAA థియేటర్ ఒక్కటే అని, అది కూడా ఏషియన్ భాగస్వామ్యంలో చేస్తున్న థియేటర్ అని చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాపర్టీలు లీజుకు తీసుకొని డెవలప్ చేయబోతున్నట్లుగా తెలిపారు. అల్లు అరవింద్ సమర్పణలో ఎన్టీఆర్ బావమరిది నితిన్ హీరోగా తన నిర్మాణంలో రూపొందిన 'ఆయ్' చిత్రాన్ని ఆగస్టు 16వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు.