బన్నీ కామెంట్స్.. బన్నీ వాసు ప్రెస్ మీట్!
బన్నీ తాజా కామెంట్లను ప్రస్తావిస్తూ దీనిపై మీరేమంటారు అని ఓ విలేకరి అడిగితే.. బన్నీ వాసు కాకుండా తన మిత్రుడు, మరో నిర్మాత ఎస్కేఎన్ బదులివ్వడం విశేషం.
By: Tupaki Desk | 24 Aug 2024 2:30 PM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి ప్రచారం చేసిన విషయంపై మొదలైన వివాదం ఇంకా చల్లారని సంగతి తెలిసిందే. ఈ విషయమై బన్నీని మెగా ఫ్యాన్స్ అంత తేలిగ్గా వదిలిపెట్టట్లేదు. సోషల్ మీడియాలో ఈ అంశం రాచపుండులా మారింది. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత రాజుకుంది. ‘‘ఫ్రెండు కోసం.. తనకు ఇష్టమైతే కచ్చితంగా ఎక్కడికైనా వస్తా’’ అంటూ బన్నీ చేసిన కామెంట్స్.. శిల్పా రవి ప్రచారం చేసిన విషయంలో తనను విమర్శించేవారికి కౌంటర్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీకి అత్యంత సన్నిహితుడు.. గీతా ఆర్ట్స్-2 అధినేత బన్నీ వాసుకు ‘ఆయ్’ సినిమా థ్యాంక్స్ మీట్లో విలేకరుల నుంచి ఈ విషయమై ప్రశ్న ఎదురైంది.
బన్నీ తాజా కామెంట్లను ప్రస్తావిస్తూ దీనిపై మీరేమంటారు అని ఓ విలేకరి అడిగితే.. బన్నీ వాసు కాకుండా తన మిత్రుడు, మరో నిర్మాత ఎస్కేఎన్ బదులివ్వడం విశేషం. ఇది ‘ఆయ్’ మూవీకి సంబంధించిన కార్యక్రమం అని.. బన్నీ కామెంట్ల మీద వాసు ప్రత్యేకంగా మరో ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడతారని ఎస్కేఎన్ వ్యాఖ్యానించడం విశేషం. ఐతే ఆ సమయానికి ఈ టాపిక్‌కు తెరదించడానికి ఎస్కేఎన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా లేక.. నిజంగా వాసు బన్నీ కామెంట్ల మీద ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టే సాహసం చేస్తాడా అన్నది ఆసక్తికరం. అలా ప్రెస్ మీట్ పెడితే మాత్రం మీడియా ప్రశ్నలతో ఇరుకున పడాల్సిందే. ఆల్రెడీ బన్నీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఒక గ్యాప్ రావడం గురించి ఈ మధ్య ఓ సందర్భంలో అడిగితే.. ఈ విషయాన్ని అంగీకరిస్తున్నట్లు మాట్లాడుతూనే.. అందరూ కలవడానికి ఒక మూమెంట్ చాలని.. దాని కోసమే తాను ఎదురు చూస్తున్నానని అన్నాడు బన్నీ వాసు.