బిజినెస్ మెన్ 4K.. ఈ రికార్డులు బ్రేక్ చేస్తుందా?
ఇప్పటికే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద మొత్తంలో జరిగాయని తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 Aug 2023 4:18 AM GMTటాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం మంచి రేస్ లో ఉంది. పాత సినిమాలలో హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా చాలా మూవీస్ ని రీరిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాలని మాత్రమే అభిమానులు బర్త్ డే రోజున ఫ్యాన్స్ షోలుగా వేసుకునేవారు. అయితే ఆరెంజ్ మూవీ రీరిలీజ్ చేయగా అది అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. దీంతో ఫ్లాప్ మూవీస్ కూడా రీరిలీజ్ చేసుకోవచ్చనే భరోసా ఆరెంజ్ ఇచ్చింది.
ఈ నగరానికి ఏమైంది సినిమాని రీరిలీజ్ చేయగా దీనికి యువత నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో కంటెంట్ బాగుంటే ప్రేక్షకాదరణ వస్తుందని ఈ నగరానికి ఏమైంది సినిమాతో స్పష్టం అయ్యింది. తాజాగా సూర్య డబ్బింగ్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా రీరిలీజ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈ ట్రెండ్ ని నిర్మాతలు కూడా ఫాలో అయ్యి హిట్ సినిమాలు రీరిలీజ్ చేయడం మొదలు పెడుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పూరి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ బిజినెస్ మెన్ రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద మొత్తంలో జరిగాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన సినిమాలలో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ టాప్ లో ఉంది. ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 4.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
దీని తర్వాత జూనియర్ ఎన్ఠీఆర్ సింహాద్రి నిలిచింది. ఈ చిత్రం 4.01 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు కలెక్ట్ చేయగలిగింది. తరువాత జల్సా 3.20 కోట్ల గ్రాస్ తో మూడో స్థానంలో, ఒక్కడు 2.05 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది మూవీ 1.78 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది.
పోకిరి సినిమాతో టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. అయితే దానిని పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా బ్రేక్ చేసింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి బిజినెస్ మెన్ సినిమాతో మరల ఖుషి రికార్డుని బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంది. మరి ఓవరాల్ గా ఫస్ట్ డే ఏ మాత్రం వసూళ్లని బిజినెస్ మెన్ సొంతం చేసుకుంటుందనేది చూడాలి.