చిరంజీవితో సినిమా ఎవరు చూస్తారన్నారు?
అయితే చిరంజీవి హీరోగా ఎదిగే క్రమంలోనే తమ్మారెడ్డి `కోతల రాయుడు` సినిమా నిర్మించారు.
By: Tupaki Desk | 5 March 2024 4:00 AM GMTఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవి-తమ్మారెడ్డి భరద్వాజ ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు. ఇద్దరిది చెన్నై పరిశ్రమ జర్నీ. సినిమా ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు జర్నీ దాదాపు ఒకేసారి మొదలైంది. అలా అనుకోకుండా ఇద్దరు కలవడం ప్రయత్నాలు చేయడం వంటివి జరిగాయి. ఆ తర్వాత చిరంజీవి పెద్ద హీరో అయ్యారు. అక్కడ నుంచి మెగాస్టార్ హోదాని సొంతం చేసుకున్నారు. ఇదే క్రమంలో తమ్మారెడ్డి దర్శక-నిర్మాతగానూ బిజీ అయ్యారు. అయితే చిరంజీవి అంత సక్సెస్ ని తమ్మారెడ్డి అందుకోలేదు అనుకోండి.
అయితే చిరంజీవి హీరోగా ఎదిగే క్రమంలోనే తమ్మారెడ్డి `కోతల రాయుడు` సినిమా నిర్మించారు. తాజాగా ఈ సినిమా అనుభవాల్ని తమ్మారెడ్డి పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే. `చిరంజీవిని హీరోగా పెట్టి `కోతలరాయుడు` సినిమాను నిర్మించడం మొదలుపెట్టాను. ఇప్పుడు చిరంజీవి మిత్రులుగా ఉన్నవాళ్లు .. అప్పట్లో నాకు మిత్రులు. వాళ్లంతా కూడా చిరంజీవి హీరో ఏమిటి? ఆయనను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? ఆయన తప్ప ఎవరూ దొరకలేదా? అన్నవారే. చిరంజీవి బాగా చేస్తున్నాడనే విష యం నాకు అర్థమైపోయింది.
ఆయన స్నేహితులు అలా అనడంతో నా నమ్మకం రెట్టింపు అయింది. వీళ్లంతా ఎందుకు ఇలా అంటున్నా రనే ఒక ఆలోచన ఉండేది. అయినా పంతంతో ఆ సినిమా తీసాను. ఆ సినిమా ఎంత హిట్ అయిందనేది? అందరికీ తెలిసిందే. ఆ తరువాత చిరంజీవితో సినిమా చేయడం నాకు కుదరలేదు. ఆ తర్వాత ఊర్మిళ సిని మాలో చిరంజీవిని ఓ గెస్ట్ రోల్ చేయమని అడిగాను. కానీ ఆయనకు కుదరక పోవడంతో చేయలేదు` అని అన్నారు.
`కోతల రాయుడు` సినిమాతోనే తమ్మారెడ్డి నిర్మాతగా పరిచయమయ్యారు. ఆ తర్వాత `మొగుడు కావాలి`..`మరో కురుక్షేత్రం`.. `ఇద్దరు కిలాడీలు` సినిమాలు నిర్మించారు. `మరో కురుక్షేత్రం` సినిమాతోనే దర్శకుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు దర్శక-నిర్మాతగా వ్యవహరించారు. చివరిగా 2014 లో `ప్రతిఘటన` స్వీయా దర్శకత్వంలో నిర్మించారు. ఆ తర్వాత దర్శక-నిర్మాణానికి దూరంగా ఉన్నారు.