వామ్మో.. సెన్సార్ లో క్లయిమ్యాక్స్ కట్
ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా యాక్షన్, పీరియాడిక్, మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్నాయి
By: Tupaki Desk | 4 Jan 2024 4:13 AM GMTఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువగా యాక్షన్, పీరియాడిక్, మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే వస్తున్నాయి. ఇలాంటి కథలలో హింసని ఎక్కువగా చూపించే ప్రయత్నం దర్శకులు చేస్తున్నారు. ధనుష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ కి తమిళంలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.
తాజాగా ఈ మూవీకి సెన్సార్ అయ్యింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు మూవీ క్లైమాక్స్ లో ఏకంగా నాలుగు నిమిషాల నిడివి ఎపిసోడ్ కట్ చేసారంట. సెన్సార్ కి ముందు మూవీ 2 గంటల 42 నిమిషాల 26 సెకండ్స్ గా ఉందంట. సెన్సార్ ఏకంగా 4 నిమిషాల 36 సెకండ్స్ ఫుటేజ్ ని కట్ చేసిందంట. దీంతో ఇప్పుడు మూవీ నిడివి 2:37 నిమిషాలకి తగ్గిందని తెలుస్తోంది.
అయితే ఈ స్థాయిలో కట్ చేయడానికి కారణం చిత్ర యూనిట్ యూ/ఏ సర్టిఫికేట్ కావాలని అడగడమే. ఈ మధ్యకాలంలో ఏ సర్టిఫైడ్ సినిమాల విషయంలో ఏజ్ నిబంధనని సక్రమంగా అమలు చేస్తున్నారు. సెన్సార్ నుంచి థియేటర్స్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ రావడంతో ఏజ్ నిబంధనలు చూసుకొని సినిమాకి పంపిస్తున్నారు. ఆన్ లైన్ లో టికెట్ కొన్నా కూడా 18 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాలు చూడటానికి అనుమతించడం లేదు.
సలార్, యానిమల్ సినిమాల విషయంలో ఈ నిబంధన చాలా సిటీలలో ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో అమలు చేశారు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ మిల్లర్ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ని చిత్ర యూనిట్ కోరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక్క తెలుగు తప్ప మిగిలిన అన్ని భాషలలో సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ లో థియేటర్స్ దొరకకపోవడంతో జనవరి 19కి వాయిదా వేశారు.
ఈ సినిమాకి ధనుష్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా సాలిడ్ గా డబ్బులు నిర్మాతకి వచ్చాయంట. సినిమాపైన కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉండటంతో కచ్చితంగా మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అనుకుంటున్నారు.