12.25 కోట్ల ఖరీదైన స్వాంకీ కార్ కొన్న నటుడు
కోట్లాది రూపాయలు వెచ్చించి, ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంలో భారతీయ సినీప్రముఖులు ఎప్పుడూ వెనకాడరు.
By: Tupaki Desk | 13 Jan 2024 5:16 AM GMTకోట్లాది రూపాయలు వెచ్చించి, ఖరీదైన కార్లను కొనుగోలు చేయడంలో భారతీయ సినీప్రముఖులు ఎప్పుడూ వెనకాడరు. బాలీవుడ్ టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలో అగ్రహీరోలు ఖరీదైన స్వాంకీ కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల మెజారిటీ నటీనటులు భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. దానికి తగ్గట్టు విలాసాల్ని, రాజసాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ గా అడుగుపెడుతున్న బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి ఖరీదైన స్వాంకీ కార్ ని కొనుగోలు చేసారు. హష్మీ గురువారం నాడు అద్భుతమైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్‌ని గర్వంగా ఇంటికి తీసుకువచ్చి కొత్త సంవత్సరాన్ని ఆడంబరంగా స్వాగతించారు.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ సొగసైన డిజైన్ విలాసవంతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.25 కోట్లు. ఇది భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. ఈ కొత్త కార్ లో ఇమ్రాన్ హష్మి రైడ్‌ను ఆస్వాధించారు. ప్రస్తుతం ఈ కార్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవలే బాలీవుడ్ లో టైగర్ 3లో విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మి తదుపరి తెలుగులో పవన్ కల్యాణ్ ఓజీలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సాహో ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఇమ్రాన్ రణవీర్ `డాన్ 3` లో విలన్ పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు ఉన్నాయి. దీనికి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. రణ్‌వీర్ సింగ్‌ని కొత్త డాన్‌గా పరిచయం చేయనున్న ఈ చిత్రాన్ని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రితేష్ సిధ్వానీ- ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్నారు. ఇది 2025లో థియేటర్లలో విడుదల కానుంది.
మరోవైపు హష్మి విలన్ గా నటించిన `టైగర్ 3` వెండితెరపై విడుదలైన రెండు నెలల తర్వాత OTTలో విడుదలైంది. ఏక్ థా టైగర్ -టైగర్ జిందా హై తర్వాత ఈ చిత్రం ప్రఖ్యాత టైగర్ ఫ్రాంచైజీలో మూడవ భాగం. టైగర్ (సల్మాన్ ఖాన్), అతడి భాగస్వామి జోయా (కత్రినా కైఫ్), అసంతృప్త ఉగ్రవాది ఆతిష్ రెహ్మాన్ (ఎమ్రాన్ హష్మీ)ల నడుమ ఏం జరిగిందన్నదే టైగర్ 3 సినిమా. టైగర్ తన దేశాన్ని రక్షించడం లేదా తన కుటుంబాన్ని రక్షించుకోవడం అనేదానిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సిన క్లిష్ట సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అన్నది తెరపై చూడాలి.