అత్యాచారమా? ఆమె ఎవరో నాకు తెలీదు: హీరో నివిన్ పౌళీ
చాలామంది మలయాళ హీరోలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడం ఆశ్చర్యపరుస్తోంది.
By: Tupaki Desk | 4 Sep 2024 5:41 AM GMTమాలీవుడ్ లో మీటూ కొత్త వేవ్ కలకలం రేపుతోంది. జస్టిస్ హేమ కమిటీ నివేదిక అనంతర పరిణామమిది. చాలామంది మలయాళ హీరోలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల
తనపై వచ్చిన అత్యాచార ఆరోపణలపై మలయాళ నటుడు నివిన్ పౌలీ మంగళవారం రాత్రి అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో అతడు లైంగిక నేరానికి పాల్పడిన మహిళ గురించి తనకు తెలియదని తాను ఆ తప్పు చేయలేదని ఖండించాడు. ఈ కేసుపై న్యాయపరంగా పోరాడతానని, నిజానిజాలను నిరూపించేందుకు ఏ స్థాయికైనా వెళతానని చెప్పారు.
నేను ఇప్పుడే వార్త చూశాను. నాకు ఆ అమ్మాయి తెలియదు.. నేను ఆమెను చూడలేదు. ఇది నిరాధారమైన ఆరోపణ. నాకు కుటుంబం ఉంది కాబట్టి వార్తలు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో నేను ఈ విలేకరుల సమావేశానికి పిలిచాను.. ఎందుకంటే నా తప్పు లేదని 100 శాతం కచ్ఛితత్వంతో మాట్లాడుతున్నాను. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. నేను కేసులో చట్ట ప్రకారం పోరాడతాను. నిజాన్ని నిరూపించేందుకు నేను ఎంతకైనా తెగిస్తాను. దీనికి సమయం పడుతుంది అని నివిన్ ANIతో వ్యాఖ్యానించారు.
సౌమ్యుడిగా పేరున్న నివిన్ పౌలీపై అత్యాచారం ఆరోపణలు రావడంతో కేరళ సినీ పరిశ్రమ షాక్‌కు గురైంది. సినిమాలో పాత్ర ఇప్పిస్తానంటూ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతడిపై కేసు నమోదైంది. దుబాయ్ లో ఓ హోటల్లో తనపై అత్యాచారం జరిగిందని మహిళ ఆరోపించడం సంచలనమైంది. మలయాళ ప్రాంతీయ ఛానల్ రిపోర్టర్ లైవ్ ప్రకారం.. ఫిర్యాదుదారీ అవకాశం ఇస్తాననే నెపంతో ఆరుగురు తనను లైంగికంగా వేధించారని పేర్కొంది. గత నవంబర్‌లో దుబాయ్‌లో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఫిర్యాదులో నివిన్ పౌలీని ఆరో నిందితుడిగా పేర్కొనగా, మలయాళ నిర్మాత ఎకె సునీల్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. కేరళలోని ఊన్నుకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కొత్త ఆరోపణలను విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కి వారు దానిని బదిలీ చేస్తారు.
బెంగుళూరు డేస్ తో నివిన్ పాళీ ప్రతిభ ఎలాంటిదో ఇరుగు పొరుగు భాషల ప్రజలకు తెలుసు. అతడు తనపై ఆరోపణలు రావడంతో వెంటనే ఒక ప్రకటన విడుదల చేసి ఇవన్నీ నిరాధారమైనవి అని కొట్టి పారేసాడు.
కేరళ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న మీటూ ఉద్యమంలో నివిన్ పౌలీ తో పాటు పలువురు ప్రముఖ నటుల పేర్లు వినిపించాయి.