ఎమర్జెన్సీ సెన్సార్.. ఎట్టకేలకు దిగొచ్చిన కంగన
ఇటీవల ముంబైలోని తన ఆఫీస్‌ని కూడా మంచి ధరకు సేల్ చేసింది.
By: Tupaki Desk | 30 Sep 2024 2:03 PM GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వైఖరి తన చిత్రం `ఎమర్జెన్సీ` విడుదలకు చాలా ఇక్కట్లు తెస్తోంది. శిక్కు మత ఆగ్రహాన్ని చవి చూస్తున్న కంగన మెడకు చుట్టుకుంది ఈ వ్యవహారం. సొంత ఇల్లు, ఆఫీస్‌లను తనఖా పెట్టి మరీ తన అప్పులను తీర్చాల్సిన పరిస్థితి ఉందని ఇంతకుముందు కంగన తెలిపింది. ఇటీవల ముంబైలోని తన ఆఫీస్‌ని కూడా మంచి ధరకు సేల్ చేసింది.
ఇదిలా ఉంటే ఎమర్జెన్సీ సెన్సార్ ఎప్పటికి పూర్తవుతుందో తేలని పరిస్థితి తలెత్తింది. అయితే ఇటీవల ఓ సమావేశంలో సీబీఎఫ్‌సి కొన్ని కట్స్ ని సూచించిందని సమాచారం. ఎట్టకేలకు కంగన దిగి వచ్చి సెన్సార్ బోర్డు సూచించిన తన సినిమా కట్స్‌కు అంగీకరించినట్లు సమాచారం. సోమవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) బాంబే హైకోర్టుకు తెలియజేసింది. ఈ చిత్రానికి సహ నిర్మాత కూడా అయిన కంగనా బోర్డు సూచించిన కట్‌లకు అంగీకరించింది.
బార్ అండ్ బెంచ్‌లోని ఓ కథనం ప్రకారం సిబిఎఫ్‌సికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ ద్వారా న్యాయమూర్తులు బిపి కొలబావల్లా, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన బెంచ్ ముందు ఈ సవరణలతో సమర్పణ జరిగింది. చిత్ర సహ నిర్మాతలైన జీ స్టూడియోస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే విచారించింది.
ఈ చిత్రం వివాదంలో చిక్కుకోవడంతో పాటు సిక్కు సమాజాన్ని తప్పుగా చిత్రీకరించారంటూ ఈ ప్రాజెక్టుపై నిషేధం విధించాలని కోరడంతో ఈ పిటిషన్ దాఖలైంది. కొన్ని కట్స్ తర్వాత సినిమాను విడుదల చేయవచ్చని సెన్సార్ బోర్డ్ ప్రకటించింది. జీ తరపున వాదిస్తున్న న్యాయవాది శరణ్ జగ్తియాని, కంగనా రనౌత్ ప్రతిపాదిత కోతలను అంగీకరించారని ఇవి మాత్రమే ఆశించిన మార్పులు అని నిర్ధారించారని వెల్లడించారు. నిర్మాతలు మార్పులపై కన్ఫర్మేషన్ కోరగా విచారణ వాయిదా పడింది. ఇప్పుడు గురువారం సమస్యకు తుది పరిష్కారం దక్కనుంది.
ఎమర్జెన్సీ గురించి చెప్పాలంటే ఈ చిత్రాన్ని మణికర్ణిక ఫిల్మ్స్- జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ వల్ల వాయిదా పడింది. 1975 నుండి 1977 వరకు 21 నెలల ఎమర్జెన్సీ పీరియడ్‌ను విధించిన ప్రధాని ఇందిరాగాంధీ జీవితాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. కంగనా మాజీ ప్రధాని ఇందిరమ్మ పాత్రను పోషించింది. ఈ పొలిటికల్ డ్రామాలో సతీష్ కౌశిక్, అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించారు.