సీబీఎఫ్‌సికి యానిమల్ తెచ్చిన తంటా?
అయితే ఇన్ని విమర్శలు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యానిమల్ లో ఇలాంటి వాటికి కట్ చెప్పడంలో సీబీఎఫ్‌సి ఎందుకు విఫలమైంది?
By: Tupaki Desk | 19 Dec 2023 4:53 AM GMTరణబీర్ కపూర్ నటించిన యానిమల్ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే 800కోట్ల మేర వసూలు చేసిందని ట్రేడ్ చెబుతోంది. అయితే ఈ విజయాన్ని మించి ఈ సినిమా తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. ఇందులో పెచ్చు మీరిన హింస, రక్తపాతం, స్త్రీవిద్వేషం, విషపూరిత పురుషత్వం అంటూ చాలా వివాదాలు చెలరేగాయి.
అయితే ఇన్ని విమర్శలు ప్రజల నుంచి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? యానిమల్ లో ఇలాంటి వాటికి కట్ చెప్పడంలో సీబీఎఫ్‌సి ఎందుకు విఫలమైంది? అన్నది ప్రశ్నగా మారింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలింసర్టిఫికేషన్ వైపు అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. అక్కడ లంచగొండులు లంచం తీసుకుని ఎలాంటి సర్టిఫికేట్ అయినా ఇచ్చేస్తారా? అన్న డౌట్లు కూడా వ్యక్తమయ్యాయి. నిజానికి యానిమల్ చిత్రానికి కేవలం నాలుగైదు కట్స్ చెప్పి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ ఇందులో ప్రజలకు అభ్యంతరకరంగా ఉండే ఏ ఒక్క సన్నివేశంపైనా సీబీఎఫ్‌సి ప్రభావం లేదని కూడా ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే తన సినిమా 'మార్క్ ఆంటోని' హిందీ వెర్షన్ కి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సికి తాను 6.5 లక్షలు చెల్లించాల్సొచ్చిందని విశాల్ మీడియా ఎదుట ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ భోగోతంపై సీరియస్ గా విచారణ సాగింది. సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ దీనికోసం అధికారులను పంపించింది. సీబీఎఫ్ సి అవినీతిపై విచారణ సాగింది. దీనిపై విచారణ అనంతరం ఒక సీబీఎఫ్‌సి అధికారి స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలిగాడు. ఆ స్థానంలో మరో అధికారి వచ్చి చేరారు. ఇక కేంద్రం పంపిన అధికారుల విచారణ ఇక్కడితో ఆగలేదు. మునుముందు సెన్సార్ షిప్ చేయనున్న సినిమాల విషయంలో అవినీతి జరిగితే ఉపేక్షించేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. ఇక యానిమల్ విషయంలో తలెత్తిన వివాదాలతో సీబీఎఫ్‌సి అధికారులు సైతం ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది.