Begin typing your search above and press return to search.

2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఇంతమంది ఉన్నారా?

ఈ ఏడాదిలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   18 Dec 2024 1:30 AM GMT
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఇంతమంది ఉన్నారా?
X

2024 కొందరి జీవితాల్లో మరపురాని తీపి జ్ఞాపకాలను మిగిలిస్తే, మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఓవైపు అనేకమంది సెలబ్రిటీలు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెడితే.. మరోవైపు వివిధ కారణాలతో పలువురు సినీ ప్రముఖులు వైవాహిక బంధానికి స్వస్తి పలికి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఊహించని విధంగా డివోర్స్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఏడాదిలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఆర్ రెహమాన్ - సైరా భాను:

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, సైరా భాను దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 1995లో పెళ్ళి చేసుకున్న ఈ జంట.. ఇటీవలే తమ 29 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు. అదే సమయంలో రెహమాన్ లేడీ అసిస్టంట్ మోహిని డే కూడా తన భర్త మార్క్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించడంతో అనేక పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. రెహ్మాన్, మోహిని మధ్య ఏదో సంబంధం ఉందనే విధంగా రూమర్స్ వైరల్ అయ్యాయి. వీటిపై లాయర్ స్పందిస్తూ ఆ వార్తలను ఖండించారు.

ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్:

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాది అధికారికంగా విడిపోయారు. 18 ఏళ్ల పాటు భార్యా భర్తలుగా కలిసున్న ఈ జంట.. 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇరువురు మళ్ళీ కలిసి జీవించాలనే ఉద్దేశ్యం లేకపోవడంతో, 2024 నవంబర్ 27న కోర్టు ద్వారా చట్టబద్ధంగా విడాకులు మంజూరు చేయబడ్డాయి. ధనుష్ - ఐశ్వర్య 2004 నవంబర్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

జయం రవి - ఆర్తి:

కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు ప్రకటించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. 15 ఏళ్లపాటు వైవాహిక బంధంలో కలిసున్న తర్వాత వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 2024 సెప్టెంబరులో జయం రవి విడాకుల గురించి సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అయితే తమ జీవితంలో ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు తనను సంప్రదించలేదని ఆర్తి తీవ్రంగా పేర్కొంది. ఈ విషయంలో ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ వచ్చారు. రవి - ఆర్తి 2009లో వివాహం చేసుకోగా.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

జీవి ప్రకాష్ కుమార్ - సైంధవి:

ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్, తన సతీమణి సింగర్ సైంధవితో విడిపోతున్నట్లుగా ప్రకటించడం ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జీవీ, సైంధవి చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు. హైస్కూల్ లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నారు. 2013లో వివాహ బంధంలో అడుగుపెట్టగా.. వారి దాంపత్యానికి గుర్తుగా 2020లో వారికి ఓ పాప జన్మించింది. అయితే ఏమైందో ఏమో తమ 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లు 2024 మే నెలలో ప్రకటించారు.

ఊర్మిళ మటోండ్కర్ - మోహ్సిన్ అక్తర్:

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ తన భర్త మోసిన్ అక్తర్ మీర్ తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట.. 8 ఏళ్లు తిరక్కుండానే విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 2024 సెప్టెంబర్ లో ఈ జంట డివోర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇషా డియోల్ - భరత్ తఖ్తానీ:

దిగ్గజ నటుడు ధర్మేంద్ర - హేమ మాలిని కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ ఇషా డియోల్ తన భర్త భరత్ తక్తాని నుంచి విడాకులు తీసుకుంది. ఇషా - భరత్ 2012 జూన్ 19న వివాహం చేసుకున్నారు. మరికొన్ని నెలల్లో 12వ వార్షికోత్సవం జరుపుకుంటారని అనుకుంటగా.. వీరి డైవర్స్ గురించి ఎన్నో రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ జంట 2024 జనవరి ప్రారంభంలో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి రాధ్య, మిరయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

యువ రాజ్‌కుమార్ - శ్రీదేవి బైరప్ప:

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవడు, హీరో యువ రాజ్‌కుమార్ ఈ ఏడాది తన భార్య నుంచి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. యువ రాజ్‌కుమార్ 2019లో శ్రీదేవి బైరప్పను వివాహం చేసుకున్నాడు. అయితే 2024 జూన్‌లో తన భార్య టార్చర్ పెడుతోందని విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 'కాంతార' హీరోయిన్ సప్తమి గౌడతో యువ రాజ్‌కుమార్ కు ఎఫైర్ నడుస్తోందని, అందుకే అతడు తనకు విడాకులు ఇచ్చాడని శ్రీదేవి ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సప్తమి.. శ్రీదేవిపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసింది.

భామ - అరుణ్ జగదీష్:

మలయాళ నటి భామ (రేఖిత ఆర్‌.కురుప్‌) కూడా ఈ ఇయర్ లోనే డివోర్స్ తీసుకుంది. భామ తన చిన్ననాటి స్నేహితుడు అరుణ్ జగదీష్ ని 2020లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే 2024 ప్రారంభంలో వీరిద్దరూ విడిపోయారు. భామ తెలుగులో 'మంచివాడు' అనే సినిమాలో తనీష్‌ సరసన హీరోయిన్ గా నటించింది.

ఇక 2024లో బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. మలైకా తన భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత 2018 నుంచి అర్జున్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే చివరకు వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో 'బిగ్ బాస్' ఫేమ్ చందన్ శెట్టి, నివేదిత గౌడ కూడా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.