జానీ మాస్టర్ వివాదం.. చిన్మయి, పూనమ్ స్ట్రాంగ్ కౌంటర్
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేదించాడని అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Sep 2024 5:45 AM GMTస్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేదించాడని అతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన యువతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. యువతి జానీ మాస్టర్ పై చాలా రకాల ఆరోపణలు చేసింది. గత ఐదేళ్లుగా ఇబ్బంది కలిగిస్తున్నాడని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరించాడని యువతి ఆరోపణలు చేసింది. వీటిని లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసింది.
దీనిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు జానీ మాస్టర్ బయటకొచ్చి మాట్లాడలేదు. కానీ నేషనల్ వైడ్ గా ఇప్పుడు జానీ మాస్టర్ పై యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. జానీ మాస్టర్ కేసు విషయంలో ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసులు కూడా యువతి ఫిర్యాదు ఇచ్చిన విషయాన్ని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ జానీని మాస్టర్ అని ఇకపై సంబోధించకండి. మాస్టర్ అనే పదానికి ఒక రెస్పెక్ట్ ఉంది అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే పూనమ్ కౌర్ కామెంట్స్ ని చాలా మంది సమర్థిస్తున్నారు. ఆమె చేసింది ఆరోపణలు మాత్రమే. ఇంకా నేరం నిరూపణ కాలేదు. నిజంగా నేరం నిరూపణ అయితే మాస్టర్ అనే హోదాని అతను కచ్చితంగా అనర్హుడు అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సింగర్ చిన్మయి కూడా ఈ వ్యవహారం పై ఇప్పటికే రియాక్ట్ అయ్యి ట్వీట్ చేసింది. మీడియా కథనాలు ట్యాగ్ చేస్తూ... రిపోర్టుల ఆధారంగా చూస్తే బాధిత యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ ఆమెని వేధిస్తున్నారని అర్ధమవుతోంది.
ఈ కేసులో పోరాడేందుకు అమ్మాయికి శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసింది. దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చి కేసు నమోదు కావడంతో జనసేన పార్టీ కూడా అతనిని సస్పెండ్ చేసింది. ఇక ఈ వ్యవహారంపై జానీ మాస్టర్ మీడియా ముందుకొచ్చి ఏమైనా వివరణ ఇస్తారా లేదంటే చట్టప్రకారం వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.