దేశంలో సినీ సెలబ్రిటీల భద్రతకు గ్యారెంటీ లేదా?
ముంబై పోలీసులు బాధ్యతగా సెలబ్రిటీలకు భద్రతను అందిస్తున్నా కానీ, వారు సేఫ్ అనడానికి భరోసా ఏదీ లేదు.
By: Tupaki Desk | 16 Jan 2025 8:21 AM GMTభారతదేశంలో సినీపరిశ్రమ ప్రముఖులపై దాడులు నివ్వెరపోయేట్టు చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు భద్రత లేకుండా పోయిందనే ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. ఓవైపు మాఫియా కుట్రలు, మరోవైపు బంధిపోట్ల ఎటాక్ లు చూస్తుంటే అసలేం జరుగుతోంది? అన్న ఆందోళన నెలకొంది. చాలా సందర్భాల్లో సెలబ్రిటీలను వెన్నుపోటు పొడిచింది నమ్మినవాళ్లు, సేవకులేననేది గత చరిత్ర.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి కుటుంబంపై లారెన్స్ బిష్ణోయ్ దాడులు, బెదిరింపుల గురించి తెలిసిందే. సల్మాన్ కట్టుదిట్టమైన భద్రత నడుమ మాత్రమే బయట కాలు పెట్టాల్సిన పరిస్థితి. పలుమార్లు ఎటాక్ ల నుంచి అతడు అదృష్టవశాత్తూ బయటపడ్డాడని పోలీసుల విచారణలో తేలింది. తన ఇంటి పరిసరాల్లో, ఔట్ స్కర్ట్స్ లోని గెస్ట్ హౌస్ లోను అతడిపై స్కెచ్ వేయగా, అదృష్టవశాత్తూ మిస్సయ్యాడు. మరోవైపు సల్మాన్ స్నేహితుడు, రాజకీయ నాయకుడు అయిన బాబా సిద్ధిఖ్ హత్యోదంతం సంచలనమైన సంగతి తెలిసిందే. బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్య చేసినట్టు అంగీకరించింది. సల్మాన్ కి పలుమార్లు హెచ్చరికలు కూడా పంపింది. ప్రస్తుతం సల్మాన్ కి వై కేటగిరీ భద్రత కల్పించినా, ప్రయివేట్ సెక్యూరిటీ నిరంతరం పహారా కాస్తున్నా కానీ, అతడి ప్రాణాన్ని కాపాడే విషయంలో ఇంకా ఆందోళనలు అలానే ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ ని బెదిరించడమే కాదు.. కోట్లాది రూపాయలు ముట్టజెప్పకపోతే కింగ్ ఖాన్ షారూఖ్ ని కూడా చంపేస్తామని దుండగులు బెదిరించారు. ఈ బెదిరింపులపైనా పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై అతడి నివాసంలో జరిగిన దాడి అభిమానులను, వినోద పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అధికారులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేశారు. నేరస్థుడిని పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను చురుకుగా విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటన ప్రముఖుల పరిసరాల భద్రత గురించి విస్తృత చర్చలకు దారితీసింది. ఇది దొంగతనం కోసం ప్రయత్నంలో జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నా ఇందులో నిజాలేంటో తేలాల్సి ఉంది.
సైఫ్ ఆరోగ్యం గురించి వైద్యులు భరోసా ఇస్తున్నా కానీ, చొరబాటుదారుడు అతడి ఇంట్లోకి ఎలా సులభంగా ప్రవేశించాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. సైఫ్ వంటి ఉన్నత స్థాయి సెలబ్రిటీకి భద్రత లేకపోవడం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. దుండగుడి దాడి సమయంలో అంగరక్షకులు లేదా భద్రతా సిబ్బంది లేకపోవడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలాగే సైఫ్ పై దాడి జరిగిన సమయంలో కేవలం ఒకే ఒక్క పనిమనిషి ఉన్నారని, ఇంట్లో కరీనా కపూర్ కూడా లేరని చెబుతున్నారు.
ముంబై పోలీసులు బాధ్యతగా సెలబ్రిటీలకు భద్రతను అందిస్తున్నా కానీ, వారు సేఫ్ అనడానికి భరోసా ఏదీ లేదు. భద్రతా చర్యలు ఉన్నప్పటికీ ప్రజలు, ప్రముఖుల భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. వరుసగా సెలబ్రిటీల పై దాడులు, ప్రముఖుల పరిసరాల్లో కఠినమైన భద్రత అవసరాన్ని హైలైట్ చేస్తోంది. ముఖ్యంగా వ్యక్తిగత సిబ్బందిని మెయింటెయిన్ చేసే సెలబ్రిటీలకు కష్టకాలంలో బెదిరింపుల సమయంలో ప్రభుత్వ సిబ్బంది పహారాను జోడించినా కానీ, రక్షణ లేకుండా పోవడం అందరిలో భయాందోళనలను పెంచుతోంది. ప్రజల్లో గొప్ప ఫాలోయింగ్ ఉండి, వందల కోట్ల ఆస్తులు ఉన్న స్టార్ హీరోల్ని కాపాడటం అనేది ఇప్పుడు పోలీస్ శాఖకు పెను సవాల్ గా మారుతోంది.