Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటిని చిన్నతనంలో అంతలా వేధించేవారట

కోల్ కతా వైద్య విద్యార్థిని దారుణ హత్యాచార ఉదంతం యావత్ దేశాన్ని కదిలించివేసింది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 4:25 AM GMT
బాలీవుడ్ నటిని చిన్నతనంలో అంతలా వేధించేవారట
X

కోల్ కతా వైద్య విద్యార్థిని దారుణ హత్యాచార ఉదంతం యావత్ దేశాన్ని కదిలించివేసింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆందోళనల్ని చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని వెల్లడిస్తున్నారు. బాలీవుడ్ నటి సెలీనా జెట్లీ తాజాగా ఒక ఆసక్తికర పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాను బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి పేర్కొన్నారు. ఈ పోస్టు వైరల్ గా మారింది. తప్పు చేయకున్నా.. ఆడపిల్లల్ని తప్పు చేసినట్లుగా చెప్పే తీరును ప్రశ్నించటమే కాదు.. ఆ తరహా మైండ్ సెట్ పై చెంప ఛెళ్లుమనేలా ఆమె వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

42 ఏళ్ల వయసులో తన బాల్యంలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించిన ఆమె.. తనను వేధించినవారిపై టీచర్లకు చెబితే.. తననే తిట్టేవారని.. తనదే తప్పు అనేవారంటూ ఆమె వివరంగా అప్పట్లో జరిగిన ఘటనల్ని ప్రస్తావించారు. తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో అబ్బాయిలు తరచూ తనను వేధింపులకు గురి చేసేవారని.. టీచర్లకు చెబితే తననే తప్పు పట్టేవారన్నారు. మహిళలైన తాము తప్పు చేయలేదని ధైర్యంగా నిలబడి.. మన రక్షణ కోసం గళమెత్తాల్సిన సమయమిదేనంటూ ఆమె పిలుపునిచ్చారు.

‘మా స్కూల్ కు సమీపంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు నేను వెళుతున్న రిక్షా వెంట పడేవారు. అల్లరి చేసేవారు. నా పైకి గులకరాళ్లు విసిరేవారు. ఇదే విషయాన్ని మా టీచర్ కు చెప్పా. నీ డ్రెస్సింగ్ మరీ మోడ్రన్ గా ఉంది. వదులు దుస్తులు ధరించి.. జుట్టుకు నూనె పెట్టుకొని రెండు జడలు వేసుకోవచ్చు కదా? ఇది నీ తప్పే’’ అని పేర్కొన్నారు. మరో ఉదంతంలో ఓ రోజు నేను రిక్షా కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఒక వ్యక్తి హటాత్తుగా వచ్చి.. నా ఎదుట నిలచొని తన ప్రైవేటు భాగాన్ని చూపించాడు. ఆ వెంటనే.. తాను కూడా అది నా తప్పేనని అనుకొని.. కొన్నేళ్లు కుమిలిపోయానని పేర్కొన్నారు.

స్కూల్ కు వెళ్లే వేళ నుంచి మొదలైన వేధింపులు..ప్లస్ వన్ కు వచ్చినా ఆగలేదన్న ఆమె.. తన టూవీలర్ వైర్లు కత్తించిన.. దాని మీద ఏవో పిచ్చి రాతలు రాసేవారన్నారు. ఒకసారి తన స్కూటీ వైర్లు కత్తిరించిన కారణంగా.. తాను స్కూటీ మీద నుంచి పడి తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. ప్లస్ వన్ లో ఉన్నప్పుడు తనకు ఎదురైన వేధింపులపై తన టీచర్ కు చెప్పగా.. ‘‘నువ్వు మోడ్రన్ టైప్ అమ్మాయివి. జీన్స్ వేసుకుంటావు. స్కూటీ నడుపుతావు. జుట్టును కట్ చేసి వదులుగా వదిలేస్తావు. దీంతో నీది లూజ్ క్యారెక్టర్ అనుకుంటారు’’ అని చెప్పిన విషయాన్ని వెల్లడించారు. అత్యాచారాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకే చెబుతారు కానీ.. అలా చేయొద్దని అబ్బాయిలకు ఎందుకు చెప్పరు? ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామన్న ఆవేదనను సెలీనా జైట్లీ వ్యక్తం చేశారు. ఆమె పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.