Begin typing your search above and press return to search.

100 కోట్లు కొట్టిన సినిమా.. టీవీలో ఎందుకు రావట్లే?

థియేట్రికల్ గా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే, ఇప్పుడు టీవీలో ప్రసారం చేయకుండా సెన్సార్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   5 March 2025 9:30 AM
100 కోట్లు కొట్టిన సినిమా.. టీవీలో ఎందుకు రావట్లే?
X

సినిమాలు థియేటర్ల నుంచి ఓటీటీలో విడుదల అవ్వటం, ఆ తర్వాత కొన్ని రోజులకే టీవీలో కూడా ప్రసారం అవుతుంది. కానీ మలయాళ సినిమా మార్కో విషయంలో మాత్రం ఇది సాధ్యపడలేదు. థియేట్రికల్ గా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే, ఇప్పుడు టీవీలో ప్రసారం చేయకుండా సెన్సార్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. ఇది సినీ ప్రేమికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

సాధారణంగా సినిమాల్లో హింసాత్మక సన్నివేశాలు ఉంటే, టీవీ ప్రసారం కోసం కొన్ని మార్పులు చేస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు చూడగలిగే వేదిక అయిన టీవీలో బహిరంగ హింసను తగ్గించే ప్రయత్నం చేస్తారు. కానీ మార్కో విషయంలో సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరించింది. ఎంత కట్ చేసినా టీవీలో ప్రసారం చేయడానికి ఇది అనుకూలంగా లేదని తేల్చింది. ఈ సినిమాలో హింస చాలా తీవ్రంగా ఉందని, కుటుంబ ప్రేక్షకులకు ఏమాత్రం అనుకూలంగా లేదని స్పష్టం చేసింది.

ఇది మాత్రమే కాదు, భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా మార్కో సినిమాపై ప్రత్యేకంగా స్పందించింది. సినిమాలో హింసాత్మకత ఎక్కువగా ఉండటమే కాకుండా, కొన్ని సన్నివేశాలు సామాజిక రుగ్మతలను ప్రోత్సహించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. అందుకే ఓటీటీలో కూడా సినిమాను ఎక్స్‌టెండెడ్ కట్‌గా విడుదల చేయకుండా అడ్డుకుంది. ఈ నిర్ణయంతో టీవీ ఆడియన్స్‌కి సినిమా చూడటానికి అవకాశం లేకుండా పోయింది.

ఈ చిత్రానికి హనీఫ్ అదేని దర్శకత్వం వహించగా, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర పోషించారు. కథ విషయానికి వస్తే, మార్కో అనే వ్యక్తి తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై భీకరమైన ప్రతీకారం తీసుకునే కథాంశంతో తెరకెక్కింది. సినిమాలో అతను ఏ విధంగా శత్రువులను తుడిచిపెట్టాడు? అతని పయనం ఎలా సాగింది? అనే అంశాలు సినిమాకు హైలైట్ అయ్యాయి. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ గట్టిగానే వచ్చాయి. ఇది చాలా హింసాత్మకమైందని అభిప్రాయపడితే, మరికొందరు కొత్త తరహా యాక్షన్ మూవీగా ప్రశంసించారు.

టీవీలో ప్రసారం కాకపోవడం కొంతమంది నిర్మాతలకు నష్టంగా భావించినా, ఓటీటీలో మాత్రం ఈ సినిమా మంచి ఆదరణను పొందింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటికీ టీవీ ప్రేక్షకులకు మాత్రం దూరంగా మారింది. కుటుంబం మొత్తం కూర్చొని చూసే సినిమాగా ఇది పనికిరాదని నిర్ణయించిన సెన్సార్ బోర్డు, ప్రైవేట్ ఛానెల్స్ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోవడానికి వెనకడుగు వేసేలా చేసింది.

మార్కో విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరికొన్ని సినిమాలకు గుణపాఠం అవ్వొచ్చు. టీవీలో ప్రసారం చేయడానికి అనుకూలంగా ఉన్న సినిమాలను మాత్రమే ఇక్కడినుంచి ఎక్కువగా ప్రోత్సహించే అవకాశం ఉంది. మరి, టీవీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు సినిమాలు చేయడానికి మారుతారా లేదా హింసాత్మక కథాంశాలను మరింత బలంగా తీసుకువెళతారా అనేది వేచిచూడాల్సిన విషయం.