Begin typing your search above and press return to search.

న‌డిరోడ్డులో 'చావా' ఫ్యాన్స్ భీభ‌త్సం

ఈ ప్ర‌తీకార‌ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొంద‌రు యువకులు సైన్ బోర్డులపై బ్లాక్ క‌ల‌ర్ స్ప్రే వేస్తున్నట్లు క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2025 6:26 AM GMT
న‌డిరోడ్డులో చావా ఫ్యాన్స్ భీభ‌త్సం
X

విక్కీ కౌశల్ నటించిన హిందీ చిత్రం 'చావా' ప్ర‌కంప‌న‌లు ఆగ‌డం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్ల‌ను తేవ‌డంలోనే కాదు, వివాదాల‌ను మోసుకు రావ‌డంలోను ముందు వ‌రుస‌లో ఉంది. ఇప్పుడు న‌డిరోడ్డులో చావా అభిమానుల భీభ‌త్సం సంచ‌ల‌నంగా మారింది. దిల్లీలోని అక్బర్ రోడ్డు, హుమాయున్ రోడ్డులోని సైన్ బోర్డులపై న‌ల్ల‌టి పెయింట్ ని పోసి ముస్లిమ్ రాజుల‌ పేర్లు లేకుండా చేసారు. వాటిపై మ‌రాఠా చ‌క్ర‌వ‌ర్తి ఛత్రపతి శివాజీ పోస్టర్లను అతికించారని పోలీసు వర్గాలు వెల్ల‌డించాయి. ఇది మ‌త‌త‌త్వాన్ని రెచ్చ‌గెట్టే చ‌ర్య‌గా చూస్తున్నారు.

ఈ ప్ర‌తీకార‌ చర్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో కొంద‌రు యువకులు సైన్ బోర్డులపై బ్లాక్ క‌ల‌ర్ స్ప్రే వేస్తున్నట్లు క‌నిపిస్తోంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ పోస్ట‌ర్ల‌ను వాటిపై అతికించారు. శివాజీ కుమారుడు శంభాజీ సామ్రాజ్యానికి రెండవ రాజు. అత‌డిని మొగ‌లు రాజు ఔరంగ‌జేబ్ క్రూరాతిక్రూరంగా హింసించి చంపాడు. సినిమా చూసిన అనంత‌రం ఇంత‌కుముందు ఒక తాగుబోతు అభిమాని నేరుగా థియేట‌ర్ లో స్క్రీన్ పై ప‌డి చించాడు. తెర‌పై క‌నిపించే ఔరంగ‌జేబ్‌ని చంపాల‌ని చూసాడు. కానీ చివ‌రికి పోలీసులు రంగంలోకి దిగి అత‌డిని అదుపు చేయాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ఆక‌తాయిలు ముస్లిముల పేర్ల‌తో ఉన్న సైన్ బోర్డుల‌పై రంగు పోసి, ఛ‌త్ర‌ప‌తి పోస్ట‌ర్ల‌ను అంటించారు.

పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. ధ్వంసం చేసిన బోర్డులను శుభ్రం చేయించార‌ని తెలిసింది. ఇప్ప‌టికే దర్యాప్తు ప్రారంభించి, నిందితులను గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్‌లను సమీక్షిస్తున్నారు. మరింత విధ్వంసం జరగకుండా, శాంతిభద్రతల స‌మ‌స్య త‌లెత్త‌కుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

చావా అనేది ఒక చారిత్రక య‌క్ష‌న్ డ్రామా. మ‌రాఠా రాజుల క‌థ‌తో రూపొందింది. ఇందులో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ కుమారుడు ఛత్రపతి శంభాజీ పాత్రను పోషించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అసాధార‌ణ విజ‌యం సాధించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ట్రేడ్ విశ్లేషకుల‌ వివ‌రాల ప్రకారం.. ఈ చిత్రం ఈ ఆదివారం నాటికి 500 కోట్ల మైలురాయిని దాటింది.

న్యూఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ చిత్రాన్ని ప్రశంసించిన సంగ‌తి తెలిసిందే. మరాఠీ -టు హిందీ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన క‌థలు ఛ‌త్ర‌ప‌తి, శంభాజీ క‌థ‌లు అని అన్నారు. గోవా, మధ్యప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్రానికి పన్ను రహిత హోదాను మంజూరు చేశాయి.