చైతూ-శోభిత .. మూడు ముళ్ళతో ఒక్కటైన కొత్త జంట
చైతూ-శోభిత బంధం ఇప్పటివరకు మీడియా హడావుడి లేకుండా కొనసాగినప్పటికీ, ఇప్పుడు వారి పెళ్లి వేడుక ఘనంగా వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 4 Dec 2024 3:23 PM GMTఅక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల వివాహం ఘనంగా, ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ANR విగ్రహం ముందు నిర్వహించిన ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైన ఈ వేడుకలు హిందు సాంప్రదాయానికి తగ్గట్టుగా జరిగాయి. చైతూ-శోభిత బంధం ఇప్పటివరకు మీడియా హడావుడి లేకుండా కొనసాగినప్పటికీ, ఇప్పుడు వారి పెళ్లి వేడుక ఘనంగా వైరల్ అవుతోంది.
చైతన్య సంప్రదాయ పంచలో, శోభిత పసుపు బంగారు కాంబినేషన్ కలిగిన చీరలో కనిపించి అందరినీ మెప్పించారు. వధువు ధరించిన ఆభరణాలు, చీర నిండా గాజుల నడుమ ఆడంబరంగా కనిపించింది. పెళ్లి వేడుకలో వారి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వధూవరుల మధ్య ఉన్న సింప్లిసిటీ, వారిద్దరి సమన్వయం, ఆనందం ప్రతి ఫోటోలో కనిపిస్తోంది.
వివాహానికి సంబంధించిన ప్రత్యేకమైన మూహూర్తం రాత్రి 8:15 గంటలకు నిర్ధారించగా, ఆ సమయానికి వేద మంత్రాల మధ్య ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడుకకు ముందు మంగళ స్నానం, హల్దీ వంటి సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు మరింత ఆనందంగా జరిగాయి. వివాహ వేడుక అనంతరం ఈ జంట తిరుమల లేదా శ్రీశైలం వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం.
పెళ్లి సందర్భంగా నాగచైతన్య తన తాత ANR స్టైల్‌లో సంప్రదాయ పంచలో దర్శనమిచ్చారు. దీనికి అభిమానులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చైతూ తన తాత ANR కు నివాళిగా తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కుటుంబ సంప్రదాయాల పట్ల చూపిన గౌరవాన్ని స్పష్టం చేస్తోంది. మంగలస్నానం దగ్గరి నుండి, శోభిత చేతుల్లో పసుపు కలశం వరకు ప్రతి మూమెంట్ ఫోటోల రూపంలో నెట్టింట హైలైట్ అవుతోంది.
ఈ పెళ్లి వేడుకలో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు అలాగే మరికొందరు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని జంటను ఆశీర్వదించారు. ప్రముఖ దర్శకులు, హీరోలు, రాజకీయ నాయకులు, మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు కూడా వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక చైతూ-శోభిత కొత్త జీవిత ప్రయాణానికి అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.