శోభిత-చైతన్య వివాహం.. నాగార్జున ఎమోషనల్ మూమెంట్స్
శోభితను తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ, చైతన్య జీవితంలో కొత్త అడుగు ప్రారంభమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 4 Dec 2024 4:46 PM GMTనాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం అక్కినేని కుటుంబానికి ఓ ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన వైభవమైన పెళ్లి పందిరిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అక్కినేని నాగార్జున ఈ సందర్భాన్ని భావోద్వేగంతో తెలియజేస్తూ కొన్ని ప్రత్యేక ఫోటోలను షేర్ చేశారు. శోభితను తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ, చైతన్య జీవితంలో కొత్త అడుగు ప్రారంభమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు.
"శోభిత, చైతన్య కలిసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం నా కోసం ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడుకున్న మూమెంట్. మాకు ఇంత ఆనందం తీసుకొచ్చిన శోభిత, నువ్వు మా కుటుంబంలోకి వచ్చినందుకు హృదయపూర్వక స్వాగతం. ఈ సందర్భం నాకు మరింత ప్రత్యేకమైనదిగా అనిపించింది, ఎందుకంటే ఇది మా ANR గారి విగ్రహం కింద, ఆయన ఆశీర్వాదం మధ్య జరుగుతోంది.
ఆయన ప్రేమ, మార్గదర్శకత ప్రతి అడుగులోను మనతో ఉందనిపిస్తోంది," అని నాగార్జున తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వేడుక ANR శతాబ్దోత్సవ సంవత్సరంలో జరగడం ఒక ప్రత్యేకత. ANR విగ్రహం ముందు చైతన్య, శోభిత వివాహం జరగడం అక్కినేని కుటుంబానికి చిరస్మరణీయ క్షణమైంది. నాగార్జున తన ట్వీట్‌లో ఇంకా, "ఈ జరుపుకునే సందర్భం ఆయన ఆశీర్వాదాలతో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ రోజు ప్రతీ క్షణం పట్ల కృతజ్ఞతతో మా కళ్లను తడిపేశాము," అంటూ చెప్పుకొచ్చారు.
వధూవరుల ఫోటోలు ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతన్య సంప్రదాయ పంచ ధరిస్తూ, శోభిత కాంచీవరం పట్టు చీరలో మెరిసిపోతున్న ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. వీరి ఆనందభావాలు, కుటుంబ సభ్యుల హర్షం ఈ వేడుకను మరింత ప్రత్యేకతగా నిలిపాయి. నాగార్జున, ఈ సందేశం ద్వారా తన కుటుంబంపై ఉన్న గౌరవాన్ని, ప్రేమను పంచుకున్నారు. ఇది అక్కినేని కుటుంబానికి మాత్రమే కాకుండా, అభిమానులకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన క్షణంగా మారింది.
ఇక పెళ్లి అనంతరం పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు నాగార్జున ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఇక నాగచైతన్య తదుపరి సినిమా తండేల్ సినిమా ఫిబ్రవరి లో విడుదల కానున్న విషయం తెలిసిందే. చందు మోండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల కానుంది. ఇక సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అంధించారు.