Begin typing your search above and press return to search.

చైతన్య - శోభితల పెళ్లి సందడి.. ఎన్ని గంటలు జరగనుందంటే?

అయితే వీరి మ్యారేజ్ కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 Nov 2024 3:58 AM GMT
చైతన్య - శోభితల పెళ్లి సందడి.. ఎన్ని గంటలు జరగనుందంటే?
X

టాలీవుడ్ హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల మరికొన్ని రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ, ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పెళ్ళి చేసుకోబోతున్నారు. అయితే వీరి మ్యారేజ్ కు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా జరగనుంది. అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సంవత్సరంలో ఆయన విగ్రహం ముందు పెళ్లి చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టూడియోలో స్పెషల్ గా ఏర్పాటు చేసిన సెట్‌లో చై - శోభితల వివాహం జరగనుంది. ఇది సంప్రదాయమైన తెలుగు పెళ్లి అని అక్కినేని నాగార్జున ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

నాగ చైతన్య - శోభితల వివాహం సాంప్రదాయబద్ధంగా చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. పెళ్ళిలో వేద మంత్రాలు వినడం తనకు ఎంతో ఇష్టమని, అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నాగ్ పేర్కొన్నారు. అయితే నివేదికల ప్రకారం, ఈ జంట సాంప్రదాయ బ్రాహ్మణ వివాహాన్ని ఎంచుకున్నారని, దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ పెళ్ళి ఆచార వ్యవహారాలు కొనసాగుతాయని తెలుస్తోంది.

పెళ్ళి కోసం శోభిత ధూళిపాళ కంజీవరం పట్టు చీరను ఎంపిక చేసుకుంది. చైతూ తన కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాధారణ పంచె కట్టు దుస్తులలో కనిపించనున్నారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి పనులన్నీ చై శోభితలు దగ్గరుండి చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం కలిపి 300 మంది అతిథులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, తమ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని చైతన్య - శోభిత భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి స్ట్రీమింగ్‌ రైట్స్‌ కోసం నెట్‌ ఫ్లిక్స్‌తో పాటు పలు ఓటీటీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని టాక్ నడుస్తోంది. నాగచైతన్య సినీ కెరీర్‌, వ్యక్తిగత జీవితం, శోభితతో పరిచయం, ప్రేమ, పెళ్లి వంటి విషయాలను డాక్యుమెంటరీగా తీసుకొస్తానని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

ఇకపోతే శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించి, కలిసి జీవితాన్ని పంచుకోడానికి ఆశగా ఎదురుచూస్తున్నానని ఇటీవల తన బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య అన్నారు. ఆమెతో డీప్ గా కనెక్ట్ అయ్యానని, తనను చాలా బాగా అర్థం చేసుకుంతుందని చెప్పారు. తన జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని, తమది అద్భుతమైన ప్రయాణం కానుందని చైతూ పేర్కొన్నారు.

నాగచైతన్య ప్రస్తుత 'తండేల్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక కార్తీక్ దండు డైరెక్షన్ లో చైతూ ఓ భారీ బడ్జెట్ మైథాలాజికల్ థ్రిల్లర్ లో నటించనున్నారు. 'NC 24' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఈ డిసెంబర్ లోనే సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.