శోభితతో న్యూ జర్నీ.. బ్యూటిఫుల్ ఫ్యామిలీ కోసం ఎదురుచూస్తున్నా: నాగచైతన్య
శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.
By: Tupaki Desk | 23 Nov 2024 7:29 AM GMTటాలీవుడ్ హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్ళి డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహ వేడుక జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 23న తన పుట్టినరోజు సందర్భంగా చైతూ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడారు. శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు.
పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "ఖచ్చితంగా చాలా ఉత్సాహం ఉంది, సీతాకోకచిలుకలు.. ఎక్కువ కాదు (నవ్వుతూ). వివాహ వేడుక మాకు ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. మా తాతగారి విగ్రహం ముందు పెళ్లి జరిపించి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మా రెండు కుటుంబాలు కలిసి వేడుకలు నిర్వహించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాయి'' అని నాగ చైతన్య చెప్పారు.
"నేను శోభితతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి, కలిసి జీవితాన్ని పంచుకోడానికి ఎదురు చూస్తున్నాను. నేను ఆమెతో డీప్ గా కనెక్ట్ అయ్యాను. ఆమె నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది. నాలో ఖాళీని పూర్తి చేస్తుంది. మున్ముందు మాది అద్భుతమైన ప్రయాణం కానుంది" అని చైతూ అన్నారు. ''నా పెళ్లి స్పెషల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి అది వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి సందర్భాలు కుటుంబ సభ్యులను, స్నేహితులను ఒకచోట చేరుస్తాయి. వారితో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు, బంధం ఏర్పరచుకోవడానికి మీకు అవకాశం ఇస్తాయని నేను భావిస్తున్నాను'' అని పేర్కొన్నారు.
''నా జీవితంలో రెండు పెద్ద ఈవెంట్స్ రాబోతున్నాయి. నేను నటించిన 'తండేల్' సినిమా ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. డిసెంబర్ 4న నా పెళ్లి జరగబోతోంది. అంతా అద్భుతంగా జరిగి ఆనందాన్ని తెస్తుందని ఆశిస్తున్నాను. అదే నా బర్త్ డే విష్'' అని చైతన్య అన్నారు. తన పుట్టినరోజు గురించి మాట్లాడుతూ "నేను నా బర్త్ డేని చాలా సాదాసీదాగా జరుపుకోవాలనుకుంటున్నాను. నా కంఫర్ట్ జోన్‌లో నా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి నేను ఇష్టపడే పనులు చేస్తూ గడపడం నాకు ఇష్టం. ఈసారి కూడా నేను అదే పని చేస్తున్నాను. గోవాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాను'' అని తెలిపారు.
శోభిత తన పుట్టినరోజు కోసం స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేసిందా? అని అడగ్గా.. "ఆమె ప్లానింగ్ అంతా నాకే వదిలేసింది. ఆమె నాతో ఉన్నంత కాలం అది నాకు సరిపోతుంది" అని నాగచైతన్య బదులిచ్చారు. "నేను లైఫ్ లో ఎత్తుపల్లాలను చాలా నార్మల్ గా చూస్తాను. అవి నాకు నేర్పించే పాఠాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు ఊహించని విధంగా ఏదైనా జరిగినప్పుడు, దాన్నుంచి మీరు సరైన పాఠాలు నేర్చుకుని ముందుకు సాగితే తప్పు లేదు'' అని చై అన్నారు.
"నేను ఫుల్ ఫిల్ చేసుకోవాలనుకునే కోరికలు చాలా ఉన్నాయి. విభిన్నమైన చిత్రాలు, పాత్రలతో అన్వేషించాలనుకునేవి చాలా ఉన్నాయి. నేను పని కోసం చాలా ఆకలితో ఉన్నాను. నేను అనుకున్నదానిలో ఎక్కువ సాధించలేదని భావిస్తున్నాను. సినిమాల్లో నాకు చాలా పని మిగిలి ఉంది. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరం. నేను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం కోసం, అందమైన కుటుంబాన్ని ఏర్పరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నాను'' అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
ఇటీవల అక్కినేని నాగార్జున ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పెళ్లి చాలా సింపుల్‌గా చేయాలని నాగ చైతన్య కోరినట్లు చెప్పారు. ''ఇది మా నాన్న శతజయంతి సంవత్సరం. చైతన్య- శోభితల పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం నాకెంతో హ్యాపీగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో కాదు, మా కుటుంబ వారసత్వంలో ఓ భాగం. మా నాన్నకి ఇష్టమైన ప్రదేశం. చైతన్య పెళ్లిని చాలా సింపుల్‌గా చేయమని కోరాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం కలిపి 300 మందిని పిలవాలని అనుకుంటున్నాం'' అని నాగ్ తెలిపారు.
''స్టూడియోలోని అందమైన సెట్‌లో చై - శోభిత పెళ్లి జరగనుంది. పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామని చెప్పారు. ఆ స్టూడియోలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రతీ ఏడాది అక్కడ కనీసం 10 పెళ్లిళ్లు జరుగుతుంటాయి. శోభిత తల్లిదండ్రులు కూడా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేయాలనుకున్నారు. నాకు కూడా ఆ వేద మంత్రాలు వినడం ఎంతో ఇష్టం. అవి వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చైతన్య - శోభితల పెళ్లి సంప్రదాయమైన తెలుగు పెళ్లి. ప్రస్తుతానికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు ఇప్పుడే చెప్పలేను'' అని నాగార్జున చెప్పారు.